చైనా సాధించలేనిది.. భారత్ సాధించింది!
ఇప్పటికీ సొంతంగా తనకంటూ ఓ ఓఎస్ (ఆపరేటింగ్ సిస్టమ్)ను రూపొందించుకోనందుకు చైనా ఈర్ష్య పడుతూ ఉండవచ్చు. గత 15 ఏళ్లుగా దేశీయ ఓఎస్‌ను రూపొందించుకునేందుకు చైనా నానా తంటాలు పడుతూనే ఉంది. ఓఎస్ టెక్నాలజీ విషయంలో పాశ్చాత్య దేశాల ఆధిపత్యం నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తోంది. కానీ, ఆ ప్రయత్నం ఇప్పటివరకు సఫలీకృతం కాలేదు. కానీ, భారత్ మాత్రం రెండేళ్ల కిందటే ఆ ఘనతను సొంతం చేసుకుంది.
ఇండస్ ఓఎస్.. ఇప్పుడు భారత్‌లో మొబైల్ ఫోన్లు అత్యధికంగా వాడుకుంటున్న మొబైల్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లలో రెండోస్థానంలో ఉంది. ఆల్ఫాబెట్ అండ్రాయిడ్ తర్వాత 6.3శాతం మార్కెట్ వాటాతో రెండోస్థానంలో ఇండస్ ఓఎస్ ఉంది. స్థానిక భారతీయ భాషలలో రూపొందిన ఈ ఓఎస్ 2015 సంవత్సరం ముగిసేనాటికి రెండోస్థానాన్ని ఆక్రమించి.. ప్రస్తుత సంవత్సరంలోనూ ఆ స్థానాన్ని నిలబెట్టుకుంది. ఈ వారమే విడుదలైన కౌంటర్ పాయింట రీసెర్చ్ నివేదిక ఈ వివరాలను వెల్లడించింది. ఐవోఎస్‌తోపాటు షియోమి, ఎంఐయూఐ, సియానోజెన్ వంటి ఆండ్రాయిడ్ వెరియంట్లు కూడా ఇండస్ ఓఎస్‌ను వాడుతున్నాయి.
చైనా సొంతంగా ఓఎస్ రూపొందించుకునే క్రమంలో చైనా ఓఎస్ (సీఓఎస్), కిలిన్, రెడ్ ఫ్లాగ్, యున్‌ఓఎస్ వంటి ప్రయోగాలు చేసినప్పటికీ అవి అంతగా విజయవంతం కాలేదు. చైనా ప్రభుత్వం, పలు ప్రైవేటు కంపెనీలు ఈ విషయంలో ప్రోత్సాహం అందించినా అనుకున్న లక్ష్యాన్ని అది సాధించలేదు.
వాస్తవంగా ఫస్ట్‌టచ్ పేరిట రూపొందించిన ఇండస్ ఓస్ 2015లో సంచలనం సృష్టించింది. ఈ ఓఎస్‌ను వాడుకోవడానికి మైక్రోమాక్స్ కంపెనీ ముందుకురావడం దీనికి పెద్ద ఊతంగా నిలిచింది. స్థానిక డిమాండ్లను దృష్టిలో ఉంచుకొని ఈ ఓఎస్ రూపొందడంతో ఇది బాగా ఆదరణ పొందింది. టైపింగ్ సౌలభ్యకరంగా ఉండటం, టైపింగ్‌లో ప్రాంతీయ భాషల పదాల ప్రిడిక‌్షన్ సరిగ్గా ఉండటం ఈ ఓఎస్ కు కలిసివొచ్చే అంశం. ఇది ఓఎస్ విషయంలో ఐఫోన్ ఆపరేటింట్ సిస్టమ్ అయిన ఐఓఎస్‌ను దేశీయంగా అధిగమించింది. యాప్ బజార్ వంటి యాప్‌లతో మరిన్ని ఆర్థిక సేవలు అందించేందుకు ఈ ఓఎస్ సిద్ధమవుతోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చిన ’మేకిన్ ఇండియా’కు ఈ ఓఎస్ రూపకల్పన పెద్ద ఊతమిచ్చే అంశమని నిపుణులు చెప్తున్నారు.