టీడీపీకి అపఖ్యాతి మిగిలింది
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథ్ రెడ్డి
ప్రొద్దుటూరు:
అధికారంలోకి వచ్చాక నాలుగేళ్లకు టీడీపీ అపఖ్యాతి తెచ్చుకుంటుందనుకుంటే ఆరు నెలలకే ఆ పార్టీకి ఈ పరిస్థితి వచ్చిందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి పేర్కొన్నారు. స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి అధ్యక్షతన మంగళవారం ప్రొద్దుటూరు నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆకేపాటి మాట్లాడుతూ వాస్తవానికి వైఎస్సార్సీపీ గత ఎన్నికల్లో అధికారంలోకి వస్తుందని అన్ని సర్వేలు చెప్పాయన్నారు. ఈ విషయాన్ని గమనించిన చంద్రబాబు నాయుడు రైతులకు రుణమాఫీ, డ్వాక్రా రుణాలు మాఫీ, ఇంటికో ఉద్యోగం, ఉద్యోగులకు పదవీ విరమణ వయసు పెంపు ఇలా ప్రతి వర్గానికి సంబంధించి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాడన్నారు. కానీ ఆ హామీలను విస్మరిస్తున్నారని ధ్వజమెత్తారు. బుధవారం జిల్లాలోని అన్ని మండలాల్లో జరపతలపెట్టిన ధర్నా కార్యక్రమాలను
విజయవంతం చేయాలని కోరారు.
సమావేశంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వీఎస్ ముక్తియార్, ప్రొద్దుటూరు, రాజుపాళెం మండల కన్వీనర్లు కల్లూరు నాగేంద్రారెడ్డి, ఎస్ఏ నారాయణరెడ్డి, ఈవీ సుధాకర్‌రెడ్డి, మండల ఉపాధ్యక్షుడు మల్లేల రాజారాంరెడ్డి, పార్టీ పట్టణాధ్యక్షురాలు జింకా విజయలక్ష్మి, 17వ వార్డు కౌన్సిలర్ అనసూయ, గోపవరం సర్పంచ్ దేవీ ప్రసాదరెడ్డి, ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కార్యదర్శి చిప్పగిరి ప్రసాద్ ప్రసంగించారు.
మాట మరచిన బాబు
మైదుకూరు టౌన్: ఎన్నికల ముందు ఆల్ ఫ్రీ అంటూ మాటలు చెప్పిన చంద్రబాబు అధికారంలోకి రాగానే ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకోలేక రోజుకో మాట మారుస్తున్నారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథరెడ్డి విమర్శించారు.
మంగళవారం మైదుకూరులో వైఎస్సార్సీపీ యువనాయకుడు శెట్టిపల్లె నాగిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు చంద్రబాబు ప్రజలకు మోసపూరిత హామీలు ఇచ్చి ముఖ్యమంత్రి అయ్యారన్నారు. ఆ హామీలను నెరవేర్చలేక తన ఇష్టానుసారంగా పాలన సాగిస్తుంటే ఊరుకుండే ప్రసక్తే లేదన్నారు. ప్రజల పక్షాన నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటామన్నారు.
టీడీపీ మైండ్ గేమ్ ఆడుతోంది : ఎమ్మెల్యే రాచమల్లు
కార్యకర్తలతో ప్రచారం చేయిం చడం ద్వారా టీడీపీ మైండ్ గేమ్ ఆడుతోందని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. ముందు గా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి జైలుకు వెళుతున్నారని, ఇందులో భాగంగా పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ప్రొద్దుటూరులో పోటీ చేస్తారని, ఇందుకుగాను రూ.36కోట్లకు ఒప్పందం కుదిరిందని, టీ దుకాణాల వద్ద ప్రచారం చేస్తున్నారన్నారు.
ముందుగా తాను రాజీనామా చేస్తున్నానని, తర్వాత జమ్మలమడుగు, రాయచోటి ఇలా ఏ నియోజకవర్గానికి సంబంధించి ఆ నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారన్నారు. ఇందులో ఎంత మాత్రం వాస్తవం లేదన్నారు. అలాగే తనతోపాటు మరికొందరు ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళుతున్నట్లు ప్రచారం చేస్తున్నారన్నారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ కుటుంబంపై తనకు అమితమైన ప్రేమాభిమానాలు ఉన్నాయని, జగన్మోహన్రెడ్డి అడిగితే ఎమ్మెల్యే పదవే కాదు తన ప్రాణాలను అడిగినా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని చె ప్పారు. ఈ జీవితం ఉన్నంత వరకు తాను వైఎస్ కుటుంబంతోనే ఉంటానని తెలిపారు. ఇలాంటి విష ప్రచారాలను కార్యకర్తలు నమ్మవద్దని సూచించారు.