మహంకాళి దేవాలయ ఆస్తులు అన్యాక్రాంతం!
సమాచార హక్కు చట్టంతో బహిర్గతం
రాంగోపాల్‌పేట్: సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి దేవాలయానికి చెందిన ఆస్తులు అన్యాక్రాంతమైనట్టు తెలుస్తోంది. కోట్ల రూపాయల విలువ చేసే అమ్మవారి ఆస్తులను కొందరు అధికారులు కైంకర్యం చేసినట్టు స్పష్టమవుతోంది. తమ తప్పును దీన్ని
కప్పిపుచ్చుకునేందుకు రికార్డులనే మాయం చేశారని తెలుస్తోంది. దీన్ని నిరూపించే బలమైన సాక్ష్యాధారాలను సమాచార హక్కు చట్టం కార్యకర్త నాగెల్లి శ్రీనివాస్ సంపాదించారు. ఆయన మంగళవారం వెల్లడించిన వివరాల ప్రకారం..
ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి ఆలయానికి స్వాతంత్య్రానికి పూర్వమే భక్తులు ఎకరం 37 గుంటల స్థలాన్ని మాన్యంగా ఇచ్చారు. 1954 సంవత్సరానికి ముందు మసీదు, చర్చీలు, దేవాలయాలకు చెందిన ఆస్తులను అవుకాఫ్‌లో రిజిష్టర్ చేయించేవారు. 1954 సంవత్సరంలో వక్ఫ్ బోర్డు ఏర్పాటు కాగా 1966 సంవత్సరంలో దేవాదాయ శాఖ ఏర్పడింది. దీంతో 1946 (1356 ఫస్లీ)సంవత్సరంలో అప్పటి ఆలయ ఫౌండర్ ట్రస్టీలు దేవాలయానికి చెందిన ఎకరం 37 గుంటల మాన్యం భూమిని కితాబ్ ఉల్ అవుకాఫ్‌లో రిజిష్టర్ చేయించారు.
దీనికి సంబంధించిన ఫైల్ నంబర్ 17/2గా నమోదు చేశారు. ఇదే భూమిలో 7 మడిగెలు కూడా ఉన్నాయని అందులో పేర్కొన్నారు. ఈ రికార్డు ప్రకారం ఈ భూమికి సంబంధించిన సర్వే నంబర్ 92 భోలక్‌పూర్ విలేజ్‌గా ఉంది. ఆ రికార్డు ప్రకారం దేవాలయానికి ఎకరం 37 గుంటల స్థలం ఉండగా, ఇప్పుడు మిగిలింది మాత్రం కేవలం 1,308 గజాల స్థలం మాత్రమే. అంటే సుమారు 7,972 వేల గజాల స్థలం కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లిపోయింది. ఈ ప్రాంతంలో మార్కెట్ రేటు ప్రకారం చూస్తే సుమారు రూ.100 కోట్ల స్థలం కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లిపోయిందనేది స్పష్టం అవుతుంది.
లోకాయుక్తకు తప్పుడు సమాచారం..
ఆలయ భూమి కబ్జా వ్యవహారాన్ని నాగెల్లి శ్రీనివాస్ అనే సమాచార హక్కు చట్టం కార్యకర్త బయటకు తేవడంతో లోకాయుక్త దీన్ని సూమోటోగా స్వీకరించింది. దేవాలయానికి చెందిన కోట్ల రూపాయల ఆస్తులు అన్యాక్రాంతం కాగా అధికారులు తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు అధికారులు లోకాయుక్తకు తప్పుడు సమాచారం అందించారు. భోలక్‌పూర్ విలేజ్‌లో సర్వే నెంబర్ 92 లేదని, కితాబ్ ఉల్ అవుకాఫ్‌లో క్లరికల్ తప్పిదం వల్ల 17/2 ఫైల్ నంబర్ నమోదైందని చెప్పారు.
సర్వే ల్యాండ్ రికార్డ్స్‌లో టీఎస్ నంబర్ 108, 109,110లో దేవాలయం, దాని సంబంధించిన స్థలం ఉందని భోలక్‌పూర్ విలేజ్ 92 సర్వే నంబర్ లేదని దేవాదాయ శాఖ అధికారులు లోకాయుక్తకు తెలిపారు. కానీ 1912 సంవత్సరంలో అప్పటి నిజాం నవాబు సర్వే నంబర్ 92 భోలక్‌పూర్ విలేజ్‌కు 15 ఎకరాల భూమిని బ్రిటిష్ వారికి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. భోలక్‌పూర్ విలేజ్ 92 కింద పలు డాక్యుమెంట్లు, దీన్ని నిర్ధారించే మ్యాప్లున్నా అధికారులు దాన్ని పక్కన బెట్టి 1963 సంవత్సరంలో చేసిన టౌన్ సర్వే ల్యాండ్ రికార్డ్స్‌నే ప్రామాణికంగా భావిస్తుండటం అనుమానాలకు దారితీస్తుంది.
ఆ రికార్డు ఏమైంది?
1946 సంవత్సరంలో కితాబ్ ఉల్ అవుకాఫ్‌లో దేవాలయానికి చెందిన భూమి రిజిష్టర్ చేసిన 17/2 ఫైల్ మొత్తం కొంత మంది అధికారులే మాయం చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్లరికల్ తప్పిదం వల్లే అలా జరిగిందంటూ తప్పించుకుంటున్నారు. భోలక్‌పూర్ విలేజ్ 92 సర్వే నంబర్‌తో అనేక లావాదేవీలు జరిగినటుట సాక్ష్యాధారాలున్నా కొంత మంది పెద్దలు చేసిన నిర్వాహకం బయటకు రాకుండా ఉండేందుకు ఈ ఫైల్‌తోపాటు సర్వే నంబర్ 92ను కూడా రికార్డుల్లో కనిపించకుండా చేసినట్టు తెలుస్తోంది. ఇదే రికార్డులో దేవాలయానికి చెందిన మరికొన్ని భూములు ఉండే అవకాశం ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం మహంకాళి దేవాలయానికి చెందిన భూములపై దృష్టిసారిస్తే కోట్లాది రూపాయల ఆస్తులు బయటకు వచ్చే అవకాశం ఉంది.