కలెక్టరేట్, న్యూస్‌లైన్: సమాచార హక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి సాయిలు జిల్లాలోని వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో సమాచార హక్కు చట్టం అమలు తీరుపై వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్‌ఓ మాట్లాడుతూ, సాధ్యమైనంత వర కూ కార్యాలయాల పూర్తి వివరాలను డిస్‌ప్లే బోర్డుపై ఉంచాలన్నారు. దీంతో సమాచార హక్కు ద్వారా అందే దరఖాస్తులను కొద్దిమేరైనా నివారించవచ్చన్నారు.
దరఖాస్తు చేసుకున్న వారికి 30 రోజుల్లోపు కోరిన సమాచారాన్ని అందజేయాలన్నారు. లేకపోతే జరిమానా తప్పదన్నారు. చట్టంపై అవగాహన కల్పించేందుకు జిల్లా శిక్షణా కేంద్రం నుంచి వివిధ కార్యాలయ సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. కొన్ని సందర్భాల్లో దరఖాస్తుదారులు అనవసరమైన సమాచారం కోరుతున్నారని వివిధ శాఖల అధికారులు డీఆర్‌ఓ ద ృష్టికి తీసుకురాగా, సెక్ష న్8 ప్రకారం ఇలాంటి దరఖాస్తులను తిరస్కరించాలని సూచించారు.
అనంతరం సమాచార హక్కు చట్టం రక్షణ వేదిక జిల్లా అధ్యక్షుడు రాజేందర్ మాట్లాడుతూ, చట్టం అమలులో క్షేత్ర స్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులపై దృష్టి సారించాలన్నారు. సెక్షన్ 4(1)బి పరిధిలోని అంశాలకు అన్ని కార్యాలయాల్లో ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు. దరఖాస్తుదారులు కోరిన సమాచారాన్ని తెలుగులో ఆర్‌టీఐ లోగో ముద్రించిన కాగితంపై ఇవ్వాలన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన సమాచారాన్ని జిల్లా అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపర్చాలన్నారు. ప్రతి రెండు నెలలకోసారి ఆర్టీఐ సమీక్ష సమావేశం నిర్వహించాలని కోరారు. సమావేశంలో కలెక్టరేట్ ఏఓ శివకుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
గడువులోగా సమాచారం ఇవ్వండి
Published Sat, Jan 11 2014 12:28 AM | Last Updated on Sat, Sep 2 2017 2:29 AM
Advertisement