Information Technology Act
-
అదర్ పూనావాలా పేరిట రూ.కోటి టోపీ
ముంబై: వ్యాక్సిన్ల తయారీ సంస్థ సీరం ఇనిస్టిట్యూట్ సీఈఓ అదర్ పూనావాలా పేరు చెప్పి సైబర్ నేరగాళ్లు రూ.కోటికి పైగా కాజేశారు. మహారాష్ట్రలోని పోలీసులు శనివారం ఈ మేరకు వెల్లడించారు. వెంటనే డబ్బు బదిలీ చేయాలంటూ పూనావాలా పేరిట సీరం సంస్థ డైరెక్టర్ సతీశ్ దేశ్‌పాండేకు సైబర్ నేరగాళ్లు వాట్సాప్‌లో మెసేజ్ పంపించారు. కొన్ని బ్యాంకు ఖాతాల వివరాలను వాట్సాప్ చేశారు. దాంతో కంపెనీ సిబ్బంది ఆ ఖాతాల్లోకి రూ.1,01,01,554 బదిలీ చేశారు. ఆ మెసేజ్ పూనావాలా పంపలేదని తర్వాత గుర్తించారు. వెంటనే పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు అందుకున్న పుణే పోలీసులు చీటింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం కింద గుర్తుతెలియని వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సీరం కంపెనీ కరోనా టీకా కోవిషీల్డ్‌తో సహా ఇతర వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తోంది. పుణే సమీపంలో సీరం ప్లాంట్ ఉంది. -
అడ్మిన్లు జర పైలం !
షేర్లు.. లైకుల కోసం ఇష్టమొచ్చింది పోస్టు చేస్తామంటే.. ఎన్నికల వేళ నడువదు! అత్యుత్సాహభరిత పోస్టులు పెట్టి బరిలో ఉన్న అభ్యర్థులపై అవాకులు చెవాకులు పేల్చితే.. ఊచలు లెక్కించాల్సిందే! జరిమానాలు కట్టాల్సిందే! ‘నా గ్రూప్‌లో నేను షేర్ చేస్తే ఏమౌతుందిలే’ అన్న నిర్లక్ష్యం అసలే వద్దు.. ఒకవేళ చేస్తే భారీ మూల్యం చెల్లించక తప్పదు!అందుకే.. ఉన్నతాధికారులు సైతం ‘మేమన్నీ చూస్తున్నాం..’ అంటూ సోషల్ మీడియాలో సందడి చేసే వారికి సుతిమెత్తని హెచ్చరికలూ జారీ చేస్తున్నారు. కాబట్టి, అడ్మిన్లూ.. జర పైలం మరే! గత ఎన్నికల్లో.. సామాజిక మాధ్యమాల్లో వివిధ పార్టీల కార్యకర్తలు పెడుతున్న సందేశాలు ఈమధ్య చాలానే వివాదాస్పదం అవుతున్నాయి. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు సోషల్ మీడియాలో వివాదాస్పద పెట్టడంతో, ప్రత్యర్థులు వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చిన సందేశాలపై ఎన్నికల సంఘానికి సైతం ఫిర్యాదు సంఘటనలున్నాయి. పార్టీలకు సంబంధం ఉన్న వారితోపాటు పార్టీలకు సంబంధం లేని వారు సైతం కేసుల్లో ఇరుక్కున్న పరిస్థితి గత అసెంబ్లీ ఎన్నికల్లో కనిపించింది. చట్టాలు ఏం చెబుతున్నాయంటే.. సామాజిక మాధ్యమాల్లో ప్రచారాలు ఎక్కువగా సాగుతుండటంతో అధికారులు సైతం ఈ పోస్టులపై ప్రత్యేక దృష్టి సారించారు. కొన్ని గ్రూపుల్లో పోలీసు అధికారులు, సిబ్బంది ఉండి మరీ పరిశీలిస్తున్నారు. ఎవరైననా సైబర్ నిబంధనలకు విరుద్ధంగా పోస్టు పెడితే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకునే అవకాశం కోకొల్లలు. ఇలాంటి చర్యలపై చట్టలు సైతం కఠినంగా ఉన్నాయి. అంతేకాకుండా.. అశ్లీల సమాచారం, ఫొటో మార్ఫింగ్, తప్పుడు సమాచారం, ఇతరుల మనోభావాలు దెబ్బతినేలా పోస్టులు చేస్తే ఇన్ఫర్మేమేషన్ టెక్నాలజీ యాక్ట్–2000 ప్రకారం సెక్షన్ 67 కింద జైలు శిక్షతోపాటు జరిమానా కూడా విధిస్తారు. అదే నేరం రెండోసారి పాల్పడినట్లు గుర్తిస్తే పదేళ్ల జైలుపాటు రూ.2 లక్షల వరకు జరిమానా విధిస్తారు. పోస్టులు పెట్టే అడ్మిన్లతోపాటు వాటిని షేర్ చేసే వారిని కూడా ఒక్కోసారి బాధ్యులను చేసే అవకాశముంది. అడ్మిన్ బాధ్యతలు.. సామాజిక మాధ్యమాల్లో వచ్చే సందేశాలకు చట్ట ప్రకారం ఆయా గ్రూప్‌లకు సంబంధించిన అడ్మిన్లే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. గ్రూప్‌లో ఉండే ప్రతీ సభ్యుడు కచ్చితంగా అడ్మిన్‌కు తెలిసి ఉండేలా చూసుకోవాలి. అపరిచితులను గ్రూప్‌లో చేర్చుకోవద్దు. ఎవరైనా గ్రూప్ సభ్యులు అభ్యంతరకరంగా ప్రవర్తించినా.. వివాదస్పద పోస్టులు, కామెంట్లు చేసినా.. ఆ సభ్యుడిని వెంటనే తన గ్రూప్ నుంచి తొలగించడం ఉత్తమం. అడ్మిన్‌తోపాటు గ్రూప్‌లోని సభ్యులు వివాదాస్పద పోస్టులు చేస్తే ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేస్తారని తెలుసుకోవాలి. ఇవి పెట్టొద్దు.. షేర్ చేయొద్దు.. విద్వేషాలు రెచ్చగొట్టే విషయాలు తప్పుడు సమాచారం, తెలియని అంశాలు మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలు ఓ వర్గాన్ని బాధించే కార్టూన్సు -
భావప్రకటన స్వేచ్ఛకు రక్ష
ఐటీ చట్టంలోని 66ఏ సెక్షన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు 66ఏ రాజ్యాంగవిరుద్ధం; ఫ్రీడం ఆఫ్ స్పీచ్‌ను దెబ్బతీస్తోంది న్యూఢిల్లీ: వెబ్సైట్లలో అభ్యంతరకర వ్యాఖ్యలను పోస్ట్ చేసిన వ్యక్తులను అరెస్ట్ చేసే అధికారం కల్పించే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ)చట్టంలోని సెక్షన్ ‘66ఏ’ను సంపూర్ణంగా కొట్టివేస్తూ మంగళవారం సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పునిచ్చింది. ఆ సెక్షన్ రాజ్యాంగవిరుద్ధంగా, సందిగ్ధపూరితంగా ఉందని తేల్చిచెప్పింది. పౌరులందరికీ భావప్రకటన స్వేచ్ఛను కల్పిం చిన రాజ్యాంగంలోని 19(1) అధికరణను ఈ సెక్షన్ ఉల్లంఘిస్తోందని స్పష్టం చేసింది. 66(ఏ)లో పేర్కొన్న కొన్ని పదాలను స్పష్టంగా నిర్వచించకపోవడం వల్ల భిన్న వ్యాఖ్యానాలకు అవకాశమిచ్చేలా ఉందని ఆక్షేపించింది. 69ఏ, 79లను కొన్ని పరిమితులతో కొనసాగించేందుకు అంగీకరించింది. వాటిలో వెబ్సైట్లలోని సమాచారాన్ని ప్రజలకు అందుబాటులోకి రాకుండా బ్లాక్ చేయాలని ఆదేశించే అధికారాన్నిచ్చేది సెక్షన్ 69ఏ కాగా.. కొన్ని ప్రత్యేక కేసుల్లో ఇంటర్మీడియరీలకు బాధ్యతనుంచి మినహాయింపునిచ్చేది సెక్షన్ 79. సెక్షన్ 66ఏలా కాకుండా, సెక్షన్ 69ఏని నిర్దిష్టంగా రూపొందించారని, కేంద్రప్రభుత్వం తప్పదని భావిస్తేనే వెబ్సైట్లను నిషేధించేలా నిబంధనను అందులో పొందుపర్చారని పేర్కొంది. అత్యంత మౌలికం.. ఫ్రీడం ఆఫ్ స్పీచ్! భావప్రకటన హక్కు అత్యంత మౌలికమైనదని ఈ సందర్భంగా జస్టిస్ జె. చలమేశ్వర్, జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్‌ల ధర్మాసనం 123 పేజీల తీర్పులో స్పష్టంచేసింది. ప్రజలకున్న సమాచారాన్ని తెలుసుకునే హక్కుపై ఈ సెక్షన్ ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని వ్యాఖ్యానించింది. 66ఏ దుర్వినియోగం కాకుండా మరిన్ని నిబంధనలను పొందుపరుస్తామంటూ విచారణ సందర్భంగా కేంద్రం ఇచ్చిన హామీని కోర్టు తోసిపుచ్చింది. ప్రభుత్వాలు మారుతాయి కానీ చట్టాలు అలానే ఉంటాయని వ్యాఖ్యానించింది. సమానత్వ హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ హక్కు, భావప్రకటన స్వేచ్ఛ హక్కులను కల్పించే రాజ్యాంగంలోని 14, 21, 19(1)(2) నిబంధనలపై ఐటీ చట్టంలోని 66ఏ సెక్షన్ చూపే ప్రభావాన్ని కోర్టు నిశితంగా పరిశీలించి, ఆ సెక్టన్‌కు చట్టబద్ధత లేదని తేల్చింది. 66ఏ సెక్షన్లో సవరణ చేయాలంటూ న్యాయశాస్త్ర విద్యార్థిని శ్రేయా సింఘాల్ 2012లో దాఖలు చేసిన ప్రజాశ్రేయోవ్యాజ్యం సహా పలు సంబంధిత పిటిషన్లపై విచారణ తర్వాత కోర్టు ఈ తీర్పును వెలువరించింది. కోర్టు ఏమంది..! తీర్పును వెలువరిస్తూ జస్టిస్ నారిమన్.. ‘‘రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల్లో పొందుపర్చిన భావ ప్రకటన స్వేచ్ఛాహక్కుపై 66ఏ స్పష్టమైన ప్రభావం చూపుతుంది. సెక్షన్లో పొందుపర్చిన ‘ఇబ్బంది కలిగించే, ఆందోళన కలిగించే, తీవ్రంగా ప్రమాదకరమైన, అవమానకర, గాయపర్చే, విద్వేషపూరిత, శత్రుత్వ’ తదితర పదాలు నిర్దిష్టంగా లేవు. వాటివల్ల ‘ఏ చర్య చట్టవ్యతిరేకం’ అనే విషయం అర్ధం చేసుకోవడం.. చట్టాన్ని అమలు చేసే వ్యవస్థలకు కానీ, చట్టాన్ని ఉల్లంఘిస్తున్న వారికి కానీ కష్టమవుతుంది. అందుకే ఆ సెక్షన్‌ను రాజ్యాంగ విరుద్ధమైనదిగా భావిస్తున్నాం’’ అని తెలిపారు. తీవ్రంగా ప్రమాదకరం అనే పదాల విషయంలో యూకేలోని కోర్టులిచ్చిన వేర్వేరు తీర్పులను ప్రస్తావిస్తూ.. నిపుణులే ఒకే అంశాన్ని వేర్వేరుగా అర్థం చేసుకుంటున్న నేపథ్యంలో.. సామాన్యులు, పోలీసులు ఈ అసందిగ్ధతను ఎలా ఎదుర్కొంటాయన్నారు. నేపథ్యం ఏమిటి..? 2012 నవంబర్‌లో శివసేన వ్యవస్థాపకుడు బాల్‌ఠాక్రే మృతికి సంతాపంగా ఇచ్చిన బంద్ పిలుపును ‘ఫేస్బుక్’లో ప్రశ్నించిన షాహీన్‌ధాడను, ఆ పోస్ట్‌ను ‘లైక్’ చేసిన రీను శ్రీనివాసన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఐటీ చట్టంలోని 66ఎ సెక్షన్ కింద వారిపై కేసు నమోదు చేసి బెయిలుపై విడుదల చేశారు. దీనిపై నిరసనలు వెల్లువెత్తాయి. ► ఈ నేపథ్యంలో సామాజిక వెబ్సైట్లలో అభ్యంతరకర వ్యాఖ్యలను పోస్ట్ చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులనుఉన్నతాధికారుల అనుమతి లేకుండా అరెస్ట్ చేయకూడదంటూ 2013, మే 16 సుప్రీంకోర్టు సూచించింది. ► ఈలోపు, యూపీ మంత్రి ఆజం ఖాన్‌పై ఫేస్బుక్లో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడన్న ఆరోపణలపై ఓ యువకుడిని 66ఏ కింద మార్చి 18న అరెస్ట్ చేశారు. దీనిపైసుప్రీంలో పిటిషన్ దాఖలైంది. ► ఈనేపథ్యంలోనే సుప్రీం తీర్పునిచ్చింది. 66ఎ ఏం చెబుతోంది..! న్యూఢిల్లీ: ‘సైబర్ లా’ అని పేరొందిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000 సంవత్సరంలో అమల్లోకి వచ్చింది.సెక్షన్ ‘66ఎ ’ను 2008లో చట్టసవరణ ద్వారా చేర్చా రు. 2009 ఫిబ్రవరిలో అమల్లోకి తెచ్చారు. సెక్షన్ 66ఎలో ఏముందంటే.. ► ‘కంప్యూటర్ లేదా ఏదైనా సమాచార పరికరం ద్వారా ఏ వ్యక్తై.. ► {పమాదకరమైన, నేరపూరిత సమాచారాన్ని కానీ పంపినట్లుగా రుజువైతే.. ► ఆ సమాచారం తప్పు అని తెలిసినా.. దురుద్దేశపూరితంగా.. భయం, హాని, అవమానం, ఇబ్బంది, గాయం, శత్రుత్వం, విద్వేషం కలిగేలా.. ఏదైనా సమాచారాన్నిపంపినట్లుగా రుజువైతే.. ► ఎవరైనా వ్యక్తికి భయం, హాని, అవమానం, ఇబ్బంది, విద్వేషం కలిగించే ఉద్దేశంతో అదే వ్యక్తికి ఈమెయిల్ చేసినట్లుగా రుజువైతే.. ► మూడేళ్ల జైలుశిక్ష, రూ. 5 లక్షల జరి మానా, లేదా రెండూ విధించవచ్చు’ -
ధర్మాగ్రహం!
అక్షరం చుట్టూ ఆంక్షల ముళ్లకంచె బిగించి, భావవ్యక్తీకరణకు పాతరేసి, నిలదీసే గొంతుల్ని నులమడం నియంతృత్వ దేశాల్లో చెల్లుబాటవుతుందేమోగానీ... ప్రజాస్వామ్యం వర్థిల్లేచోట సాధ్యపడదు. కనుకనే అసమ్మతి స్వరాలను అణచడానికి ప్రభుత్వాలకు ఆయుధంగా ఉపయోగపడుతున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 66-ఏ, సెక్షన్ 74లపై మీ వైఖరేమిటో వారం రోజుల్లో చెప్పాలని ఇటీవల సర్వోన్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రెండు వారాల గడువునివ్వాలన్న అదనపు సొలిసిటర్ జనరల్ మహిందర్ సింగ్ విన్నపాన్ని జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. వారం రోజుల్లోగా ఏమాటా చెప్పకపోతే ఈ రెండు సెక్షన్ల చెల్లుబాటుపై విచారణ పూర్తయి తీర్పు వెలువడే వరకూ స్టే విధిస్తామని స్పష్టంచేసింది. ఈ విషయంలో దాగుడుమూతలాడుతున్న కేంద్ర ప్రభుత్వ పోకడలను గమనిస్తే న్యాయమూర్తుల ఆగ్రహం సబబేనని అర్థమవుతుంది. ఈ రెండు సెక్షన్లూ నిరంకుశమైనవనీ, భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు ఉరి బిగించేవనీ 2012లో ఢిల్లీకి చెందిన విద్యార్థిని శ్రేయా సింఘాల్ ప్రజాప్రయోజన వ్యాజ్యం ద్వారా సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు. అప్పట్లో మరణించిన శివసేన అధినేత బాల్ ఠాక్రేపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ ముంబైకి చెందిన ఇద్దరు బాలికలను అరెస్టు చేసినప్పుడు శ్రేయా సింఘాల్ ఈ సెక్షన్ల చెల్లుబాటును సవాల్ చేశారు. ఆనాటినుంచీ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తన వైఖరిని వివరించకుండా తాత్సారం చేస్తున్నది. మధ్యలో ఒకసారి మాత్రం సెక్షన్ 66-ఏను అమలు చేసేటపుడు నగరాల్లో అయితే ఐజీ ర్యాంకు అధికారినుంచీ, జిల్లాల్లో అయితే ఎస్పీ స్థాయి అధికారినుంచీ ముందస్తు అనుమతి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఉత్తర్వులు పంపామని తెలిపింది. సెక్షన్ 74కు సంబంధించి ఆ మాత్రం జవాబైనా లేదు. తాజా విచారణలో సైతం... ఈ సెక్షన్లు దుర్వినియోగ మవుతున్నాయని అదనపు సొలిసిటర్ జనరల్ అంగీకరించినా అవి చెదురుమదురుగా జరుగుతున్నవేనని సమర్థించుకోబోయారు. నలభైయ్యేళ్లక్రితం మన దేశంలో ఇందిరాగాంధీ అసమ్మతి పీకనొక్కడానికి అత్యవసర పరిస్థితి విధించారు. అందుకామె భారీ మూల్యం చెల్లించుకున్నారు. సరిగ్గా అదే పనిని ఇన్ఫర్మేషన్ చట్టానికి సవరణల ద్వారా యూపీఏ సర్కారు 2008లో చడీ చప్పుడూ లేకుండా కానిచ్చింది. మొదటి సవరణ సెక్షన్ 66-ఏ సామాజిక వెబ్సైట్లలో అభ్యంతరకర సందేశాలను పంపేవారిని అరెస్టు చేసేందుకు అధికారం ఇస్తున్నది. అంతేకాదు... ఆ నిబంధన కింద నిందితులకు గరిష్టంగా మూడేళ్ల జైలుశిక్ష పడవచ్చు. అలాంటి అభ్యంతరకర సందేశాలను ఉంచిన వెబ్సైట్ నిర్వాహకులకు రెండేళ్ల వరకూ శిక్ష విధించవచ్చునని మరో సెక్షన్ 74 చెబుతున్నది. ఈ రెండు సవరణలపైనా అప్పట్లో ఎవరి దృష్టీ పడలేదు. సవరణలు చేయగానే వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు విజృంభించి తమకు నచ్చని వ్యాఖ్యలు చేసినవారిని అరెస్టు చేయడం ప్రారంభించాక అందరికీ తెలిసివచ్చింది. ఒకరు కాదు... ఇద్దరు కాదు, ఈ చట్టంకింద ఎందరో జైలుపాలయ్యారు. పశ్చిమబెంగాల్లో జాదవ్‌పూర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అంబికేష్ మహాపాత్ర ఫేస్బుక్లో మమతాబెనర్జీని హేళన చేసేవిధంగా ఉన్న కార్టూన్లను పొందుపరిచారన్న అభియోగంపై అరెస్టుచేశారు. కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కుమారుడిపై వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణపై ఇద్దరు యువకులను అరెస్టుచేశారు. ముంబైలో ఒక కార్టూనిస్టుపైనా కేసు పెట్టారు. మూడేళ్లక్రితం ఫేస్బుక్, గూగుల్, యాహూ, మైక్రోసాఫ్ట్ ప్రతినిధులను కేంద్రంలో అప్పటి ఐటీ మంత్రి కపిల్ సిబల్ పిలిపించి అభ్యంతరకర వ్యాఖ్యలను, రాతలను ఎప్పటికప్పుడు గమనిస్తూ వెనువెంటనే తీసేయాలని ఆదేశాలిచ్చారు. సామాజిక వెబ్సైట్లలో కొందరు అశ్లీల వ్యాఖ్యలు, దృశ్యాలు ఉంచడం... దుర్వ్యాఖ్యలు చేయడం, సున్నితమైన మత విశ్వాసాలను గాయపరచడం, వ్యక్తిత్వహననానికి పాల్పడటం వంటివి సాగుతున్నాయి. వాటివల్ల అడపా దడపా సమస్యలు కూడా వస్తున్నాయి. అలాంటి వారిని అదుపుచేయాల్సిందే. అందుకు ఇప్పుడున్న ఇతరత్రా చట్టాలే సరిపోతాయి. కానీ, ఆ ముసుగులో హేతుబద్ధమైన విమర్శలనూ, అసమ్మతిని అణిచేయాలని చూడటం అత్యంత ప్రమాదకరమైనది. ముద్రణా మాధ్యమం అందుబాటులోకొచ్చిన మొదట్లో పాలకులు ఇదే రీతిన వ్యవహరించారు. ఇప్పుడు ఇంటర్నెట్ అత్యంత శక్తిమంతమైన మాధ్యమంగా మారింది గనుక దాన్ని నియంత్రించేందుకు పాలకులు ప్రయత్నిస్తున్నారు. ఇంటర్నెట్లో సమాచార ప్రవాహానికి ఆనకట్టలు కట్టాలని చూస్తున్నారు. సెక్షన్ 66-ఏలోని పదజాలాన్ని ఒక్కసారి పరిశీలిస్తే దాన్ని ఎంత అస్పష్టతతో రూపొందించారో అర్థమవుతుంది. ఒక వ్యక్తి ఏదైనా సమాచారాన్ని ఆగ్రహాన్నీ, అసౌకర్యాన్నీ కలిగించాలన్న ఉద్దేశంతో మరొకరికి పంపినప్పుడు ఈ నిబంధన వర్తిస్తుందని ఆ సెక్షన్ అంటున్నది. ఇందులో ఆగ్రహమూ, అసౌకర్యమూ అనే పదాలను అవసరాన్నిబట్టి ఎలాగైనా వక్రీకరించవచ్చు. అధికారంలో ఉన్నవారికి ఏదైనా ఆగ్రహం తెప్పించవచ్చు లేదా అసౌకర్యాన్ని కలిగించవచ్చు. కనుక అందుకు కారకులనుకున్నవారిపై చర్యలు ప్రారంభించి అందరినీ భయభ్రాంతులను చేయవచ్చు. అస్పష్ట పదజాలం వెనకున్న ఆంతర్యం ఇదే. పాలకులు రోజురోజుకూ సహనం, సంయమనం కోల్పోతున్నారని... తమకు ఎదురులేకుండా చేసుకోవాలని చూస్తున్నారనీ ఈ నిబంధనల కింద జరిగిన అరెస్టులను గమనిస్తే బోధపడుతుంది. ఇలాంటి పోకడలను సూటిగా నిలదీయడం ద్వారా సుప్రీంకోర్టు ధర్మాసనం ఉన్నత ప్రజాస్వామిక విలువలకు పట్టంగట్టింది. ఇప్పటికైనా కేంద్రం తన చర్యలోని అప్రజాస్వామికతను గుర్తించి సవరించుకుంటే మంచిది. -
51శాతం పెరిగిన సైబర్ నేరాలు
మొదటి మూడు స్థానాల్లో మహారాష్ట్ర, అవిభక్త ఏపీ, కర్ణాటక న్యూఢిల్లీ: సైబర్ నేరాల్లో మహారాష్ట్ర, అవిభక్త ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు మొదటి మూడు స్థానాలను ఆక్రమించాయి. కొత్త ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) చట్టం ప్రకారం దేశవ్యాప్తంగా నమోదైన కేసులను పరిశీలించినపుడు సైబర్ నేరాల్లో ఈ రాష్ట్రాలు ముందువరుసలో ఉన్నాయి. అయితే,.. దేశవ్యాప్తంగా ఐటీ, ఐటీ ఆధారిత పరిశ్రమలనుంచి వచ్చే ఆదాయంలో 70 శాతం ఈ రాష్ట్రాలనుంచే సమకూరుతోంది. తాజా రికార్డుల ప్రకారం ఇక దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు ఒక్కఏడాదిలోనే 51.5శాతం పెరిగాయి. 2013లో దేశవ్యాప్తంగా 4,356సైబర్ నేరాల కేసులు నమోదయ్యాయి. నేషనల్ క్రైమ్ రికార్డుల బ్యూరో (ఎన్సీఆర్బీ) తాజా నివేదిక ప్రకారం,.. సైబర్ నేరాలకు సంబంధించి 2013లో మహారాష్ట్రలో 681 కేసులు నమోదయ్యాయి. అదే సంవత్సరం అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో 635 కేసులు, కర్ణాటకలో 513 కేసులు నమోదయ్యాయి. అంతకు ుుందు సంవత్సరంతో (2012తో) పోల్చితే సైబర్ నేరాలు ఏపీలో 48శాతం పెరిగాయి. నగరాల్లో బెంగళూరు టాప్ దేశం ఐటీ రంగానికి రాజధానిగా చెబుతున్న బెంగళూరు నగరంలో అత్యధిక సంఖ్యలో 399 సైబర్ నేరాలు నమోదయ్యాయి. విశాఖపట్నంలో 173, హైదరాబాద్‌లో 159 కేసులు నమోదయ్యాయి. -
నీలిచిత్రాలు తీసిన వ్యక్తి అరెస్ట్
కోల్‌సిటీ, న్యూస్‌లైన్: గోదావరిఖనిలో నీలిచిత్రాలు తీసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బుర్ర రమేశ్ అనే ప్రబుద్ధుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వివరాలను గోదావరిఖని డీఎస్పీ ఆర్.జగదీశ్వర్‌రెడ్డి విలేకరులకు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. స్థానిక లక్ష్మీనగర్‌లో మెడికల్ ఏజెన్సీ నిర్వహిస్తున్న రమేశ్ ఇద్దరు మహిళలను అశ్లీలంగా వీడియో తీశాడు. వీటిలో తాను కన్పించకుండా జాగ్రత్తపడ్డాడు. ఈ అశ్లీల చిత్రాలను ఇతర మొబైల్స్‌కు బ్లూటూత్ ద్వారా పంపించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వన్‌టౌన్ పోలీసులు సుమోటోగా కేసు దర్యాప్తు చేశారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. నీలిచిత్రాలను ఉద్దేశపూర్వకంగా తీసినట్లు తేలింది. వీటిని అడ్డుపెట్టుకుని ఆ మహిళలను బ్లాక్మెయిల్ చేయాలనుకున్నాడా? ఇతడికి ఇంకెవరైనా సహకరించారా? ఈయన బారినపడిన మహిళలు ఇంకెవరైనా ఉన్నారా? అనే కోణాల్లో సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తానని డీఎస్పీ చెప్పారు. రమేశ్‌పై నిర్భయ చట్టంతోపాటు 292 సెక్షన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం కింద కేసులు నమోదుచేసి అరెస్ట్ చేసినట్లు వివరించారు. మహిళలను లోబరుచుకుని నీలి చిత్రాలు తీసినా, తీస్తున్నట్లు తెలిసినా తనకు(94407 95133) సమాచారం ఇవ్వాలని డీఎస్పీ కోరారు. సమాచారం అందించిన వారికి రివార్డు ఇస్తామని, వీరితోపాటు బాధితుల పేర్లు గోప్యంగా ఉంచుతామని వివరించారు. సకాలంలో సమాచారం ఇస్తే బాధితులకు నష్టాన్ని తగ్గించే వీలుంటుందని, బాధితులు పబ్లిక్ ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినా స్పందిస్తానని పేర్కొన్నారు.