అక్షరం చుట్టూ ఆంక్షల ముళ్లకంచె బిగించి, భావవ్యక్తీకరణకు పాతరేసి, నిలదీసే గొంతుల్ని నులమడం నియంతృత్వ దేశాల్లో చెల్లుబాటవుతుందేమోగానీ... ప్రజాస్వామ్యం వర్థిల్లేచోట సాధ్యపడదు. కనుకనే అసమ్మతి స్వరాలను అణచడానికి ప్రభుత్వాలకు ఆయుధంగా ఉపయోగపడుతున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 66-ఏ, సెక్షన్ 74లపై మీ వైఖరేమిటో వారం రోజుల్లో చెప్పాలని ఇటీవల సర్వోన్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రెండు వారాల గడువునివ్వాలన్న అదనపు సొలిసిటర్ జనరల్ మహిందర్ సింగ్ విన్నపాన్ని జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ ఎస్‌ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. వారం రోజుల్లోగా ఏమాటా చెప్పకపోతే ఈ రెండు సెక్షన్ల చెల్లుబాటుపై విచారణ పూర్తయి తీర్పు వెలువడే వరకూ స్టే విధిస్తామని స్పష్టంచేసింది. ఈ విషయంలో దాగుడుమూతలాడుతున్న కేంద్ర ప్రభుత్వ పోకడలను గమనిస్తే న్యాయమూర్తుల ఆగ్రహం సబబేనని అర్థమవుతుంది. ఈ రెండు సెక్షన్లూ నిరంకుశమైనవనీ, భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు ఉరి బిగించేవనీ 2012లో ఢిల్లీకి చెందిన విద్యార్థిని శ్రేయా సింఘాల్ ప్రజాప్రయోజన వ్యాజ్యం ద్వారా సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు.
అప్పట్లో మరణించిన శివసేన అధినేత బాల్ ఠాక్రేపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ ముంబైకి చెందిన ఇద్దరు బాలికలను అరెస్టు చేసినప్పుడు శ్రేయా సింఘాల్ ఈ సెక్షన్ల చెల్లుబాటును సవాల్ చేశారు. ఆనాటినుంచీ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తన వైఖరిని వివరించకుండా తాత్సారం చేస్తున్నది. మధ్యలో ఒకసారి మాత్రం సెక్షన్ 66-ఏను అమలు చేసేటపుడు నగరాల్లో అయితే ఐజీ ర్యాంకు అధికారినుంచీ, జిల్లాల్లో అయితే ఎస్పీ స్థాయి అధికారినుంచీ ముందస్తు అనుమతి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఉత్తర్వులు పంపామని తెలిపింది. సెక్షన్ 74కు సంబంధించి ఆ మాత్రం జవాబైనా లేదు. తాజా విచారణలో సైతం... ఈ సెక్షన్లు దుర్వినియోగ మవుతున్నాయని అదనపు సొలిసిటర్ జనరల్ అంగీకరించినా అవి చెదురుమదురుగా జరుగుతున్నవేనని సమర్థించుకోబోయారు.
నలభైయ్యేళ్లక్రితం మన దేశంలో ఇందిరాగాంధీ అసమ్మతి పీకనొక్కడానికి అత్యవసర పరిస్థితి విధించారు. అందుకామె భారీ మూల్యం చెల్లించుకున్నారు. సరిగ్గా అదే పనిని ఇన్ఫర్మేషన్ చట్టానికి సవరణల ద్వారా యూపీఏ సర్కారు 2008లో చడీ చప్పుడూ లేకుండా కానిచ్చింది. మొదటి సవరణ సెక్షన్ 66-ఏ సామాజిక వెబ్‌సైట్లలో అభ్యంతరకర సందేశాలను పంపేవారిని అరెస్టు చేసేందుకు అధికారం ఇస్తున్నది. అంతేకాదు... ఆ నిబంధన కింద నిందితులకు గరిష్టంగా మూడేళ్ల జైలుశిక్ష పడవచ్చు.
అలాంటి అభ్యంతరకర సందేశాలను ఉంచిన వెబ్‌సైట్ నిర్వాహకులకు రెండేళ్ల వరకూ శిక్ష విధించవచ్చునని మరో సెక్షన్ 74 చెబుతున్నది. ఈ రెండు సవరణలపైనా అప్పట్లో ఎవరి దృష్టీ పడలేదు. సవరణలు చేయగానే వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు విజృంభించి తమకు నచ్చని వ్యాఖ్యలు చేసినవారిని అరెస్టు చేయడం ప్రారంభించాక అందరికీ తెలిసివచ్చింది. ఒకరు కాదు... ఇద్దరు కాదు, ఈ చట్టంకింద ఎందరో జైలుపాలయ్యారు. పశ్చిమబెంగాల్‌లో జాదవ్‌పూర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అంబికేష్ మహాపాత్ర ఫేస్‌బుక్‌లో మమతాబెనర్జీని హేళన చేసేవిధంగా ఉన్న కార్టూన్లను పొందుపరిచారన్న అభియోగంపై అరెస్టుచేశారు. కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కుమారుడిపై వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణపై ఇద్దరు యువకులను అరెస్టుచేశారు. ముంబైలో ఒక కార్టూనిస్టుపైనా కేసు పెట్టారు. మూడేళ్లక్రితం ఫేస్‌బుక్, గూగుల్, యాహూ, మైక్రోసాఫ్ట్ ప్రతినిధులను కేంద్రంలో అప్పటి ఐటీ మంత్రి కపిల్ సిబల్ పిలిపించి అభ్యంతరకర వ్యాఖ్యలను, రాతలను ఎప్పటికప్పుడు గమనిస్తూ వెనువెంటనే తీసేయాలని ఆదేశాలిచ్చారు.
సామాజిక వెబ్‌సైట్లలో కొందరు అశ్లీల వ్యాఖ్యలు, దృశ్యాలు ఉంచడం... దుర్వ్యాఖ్యలు చేయడం, సున్నితమైన మత విశ్వాసాలను గాయపరచడం, వ్యక్తిత్వహననానికి పాల్పడటం వంటివి సాగుతున్నాయి. వాటివల్ల అడపా దడపా సమస్యలు కూడా వస్తున్నాయి. అలాంటి వారిని అదుపుచేయాల్సిందే. అందుకు ఇప్పుడున్న ఇతరత్రా చట్టాలే సరిపోతాయి. కానీ, ఆ ముసుగులో హేతుబద్ధమైన విమర్శలనూ, అసమ్మతిని అణిచేయాలని చూడటం అత్యంత ప్రమాదకరమైనది. ముద్రణా మాధ్యమం అందుబాటులోకొచ్చిన మొదట్లో పాలకులు ఇదే రీతిన వ్యవహరించారు. ఇప్పుడు ఇంటర్నెట్ అత్యంత శక్తిమంతమైన మాధ్యమంగా మారింది గనుక దాన్ని నియంత్రించేందుకు పాలకులు ప్రయత్నిస్తున్నారు. ఇంటర్నెట్‌లో సమాచార ప్రవాహానికి ఆనకట్టలు కట్టాలని చూస్తున్నారు. సెక్షన్ 66-ఏలోని పదజాలాన్ని ఒక్కసారి పరిశీలిస్తే దాన్ని ఎంత అస్పష్టతతో రూపొందించారో అర్థమవుతుంది. ఒక వ్యక్తి ఏదైనా సమాచారాన్ని ఆగ్రహాన్నీ, అసౌకర్యాన్నీ కలిగించాలన్న ఉద్దేశంతో మరొకరికి పంపినప్పుడు ఈ నిబంధన వర్తిస్తుందని ఆ సెక్షన్ అంటున్నది. ఇందులో ఆగ్రహమూ, అసౌకర్యమూ అనే పదాలను అవసరాన్నిబట్టి ఎలాగైనా వక్రీకరించవచ్చు. అధికారంలో ఉన్నవారికి ఏదైనా ఆగ్రహం తెప్పించవచ్చు లేదా అసౌకర్యాన్ని కలిగించవచ్చు. కనుక అందుకు కారకులనుకున్నవారిపై చర్యలు ప్రారంభించి అందరినీ భయభ్రాంతులను చేయవచ్చు. అస్పష్ట పదజాలం వెనకున్న ఆంతర్యం ఇదే. పాలకులు రోజురోజుకూ సహనం, సంయమనం కోల్పోతున్నారని... తమకు ఎదురులేకుండా చేసుకోవాలని చూస్తున్నారనీ ఈ నిబంధనల కింద జరిగిన అరెస్టులను గమనిస్తే బోధపడుతుంది. ఇలాంటి పోకడలను సూటిగా నిలదీయడం ద్వారా సుప్రీంకోర్టు ధర్మాసనం ఉన్నత ప్రజాస్వామిక విలువలకు పట్టంగట్టింది. ఇప్పటికైనా కేంద్రం తన చర్యలోని అప్రజాస్వామికతను గుర్తించి సవరించుకుంటే మంచిది.
ధర్మాగ్రహం!
Published Thu, Dec 11 2014 1:07 AM | Last Updated on Sat, Sep 2 2017 5:57 PM
Advertisement
Advertisement