భావప్రకటన స్వేచ్ఛకు రక్ష | SC strikes down Sec 66A of IT Act, calls it unconstitutional | Sakshi
Sakshi News home page

భావప్రకటన స్వేచ్ఛకు రక్ష

Published Wed, Mar 25 2015 2:33 AM | Last Updated on Sun, Sep 2 2018 5:18 PM

భావప్రకటన స్వేచ్ఛకు రక్ష - Sakshi

భావప్రకటన స్వేచ్ఛకు రక్ష

ఐటీ చట్టంలోని 66ఏ సెక్షన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
66ఏ రాజ్యాంగవిరుద్ధం; ఫ్రీడం ఆఫ్ స్పీచ్‌ను దెబ్బతీస్తోంది

 
న్యూఢిల్లీ: వెబ్‌సైట్లలో అభ్యంతరకర వ్యాఖ్యలను పోస్ట్ చేసిన వ్యక్తులను అరెస్ట్ చేసే అధికారం కల్పించే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ)చట్టంలోని సెక్షన్ ‘66ఏ’ను సంపూర్ణంగా కొట్టివేస్తూ మంగళవారం సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పునిచ్చింది. ఆ సెక్షన్ రాజ్యాంగవిరుద్ధంగా, సందిగ్ధపూరితంగా ఉందని తేల్చిచెప్పింది. పౌరులందరికీ భావప్రకటన స్వేచ్ఛను కల్పిం చిన రాజ్యాంగంలోని 19(1) అధికరణను ఈ సెక్షన్ ఉల్లంఘిస్తోందని స్పష్టం చేసింది. 66(ఏ)లో పేర్కొన్న కొన్ని పదాలను స్పష్టంగా నిర్వచించకపోవడం వల్ల భిన్న వ్యాఖ్యానాలకు అవకాశమిచ్చేలా ఉందని ఆక్షేపించింది. 69ఏ, 79లను కొన్ని పరిమితులతో కొనసాగించేందుకు అంగీకరించింది. వాటిలో వెబ్‌సైట్లలోని సమాచారాన్ని ప్రజలకు అందుబాటులోకి రాకుండా బ్లాక్ చేయాలని ఆదేశించే అధికారాన్నిచ్చేది సెక్షన్ 69ఏ కాగా.. కొన్ని ప్రత్యేక కేసుల్లో ఇంటర్మీడియరీలకు బాధ్యతనుంచి మినహాయింపునిచ్చేది సెక్షన్ 79. సెక్షన్ 66ఏలా కాకుండా, సెక్షన్ 69ఏని నిర్దిష్టంగా రూపొందించారని, కేంద్రప్రభుత్వం తప్పదని భావిస్తేనే వెబ్‌సైట్లను నిషేధించేలా నిబంధనను అందులో పొందుపర్చారని పేర్కొంది.
 
అత్యంత మౌలికం.. ఫ్రీడం ఆఫ్ స్పీచ్!


భావప్రకటన హక్కు అత్యంత మౌలికమైనదని ఈ సందర్భంగా జస్టిస్ జె. చలమేశ్వర్, జస్టిస్ ఆర్‌ఎఫ్ నారిమన్‌ల ధర్మాసనం 123 పేజీల తీర్పులో స్పష్టంచేసింది. ప్రజలకున్న సమాచారాన్ని తెలుసుకునే హక్కుపై ఈ సెక్షన్ ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని వ్యాఖ్యానించింది.  66ఏ దుర్వినియోగం కాకుండా మరిన్ని నిబంధనలను పొందుపరుస్తామంటూ విచారణ సందర్భంగా కేంద్రం ఇచ్చిన హామీని కోర్టు తోసిపుచ్చింది. ప్రభుత్వాలు మారుతాయి కానీ చట్టాలు అలానే ఉంటాయని వ్యాఖ్యానించింది.  సమానత్వ హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ హక్కు, భావప్రకటన స్వేచ్ఛ హక్కులను కల్పించే రాజ్యాంగంలోని 14, 21, 19(1)(2) నిబంధనలపై ఐటీ చట్టంలోని 66ఏ సెక్షన్ చూపే ప్రభావాన్ని కోర్టు నిశితంగా పరిశీలించి, ఆ సెక్టన్‌కు చట్టబద్ధత లేదని తేల్చింది. 66ఏ సెక్షన్‌లో సవరణ చేయాలంటూ న్యాయశాస్త్ర విద్యార్థిని శ్రేయా సింఘాల్ 2012లో దాఖలు చేసిన ప్రజాశ్రేయోవ్యాజ్యం సహా పలు సంబంధిత పిటిషన్లపై విచారణ తర్వాత కోర్టు ఈ తీర్పును వెలువరించింది.
 
కోర్టు ఏమంది..!

 
తీర్పును వెలువరిస్తూ జస్టిస్ నారిమన్.. ‘‘రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల్లో పొందుపర్చిన భావ ప్రకటన స్వేచ్ఛాహక్కుపై 66ఏ స్పష్టమైన  ప్రభావం చూపుతుంది. సెక్షన్‌లో పొందుపర్చిన ‘ఇబ్బంది కలిగించే, ఆందోళన కలిగించే, తీవ్రంగా ప్రమాదకరమైన, అవమానకర, గాయపర్చే, విద్వేషపూరిత, శత్రుత్వ’ తదితర పదాలు నిర్దిష్టంగా లేవు. వాటివల్ల ‘ఏ చర్య చట్టవ్యతిరేకం’ అనే విషయం అర్ధం చేసుకోవడం.. చట్టాన్ని అమలు చేసే వ్యవస్థలకు కానీ, చట్టాన్ని ఉల్లంఘిస్తున్న వారికి కానీ కష్టమవుతుంది. అందుకే ఆ సెక్షన్‌ను రాజ్యాంగ విరుద్ధమైనదిగా భావిస్తున్నాం’’ అని తెలిపారు. తీవ్రంగా ప్రమాదకరం అనే పదాల విషయంలో యూకేలోని  కోర్టులిచ్చిన వేర్వేరు తీర్పులను ప్రస్తావిస్తూ.. నిపుణులే ఒకే అంశాన్ని వేర్వేరుగా అర్థం చేసుకుంటున్న నేపథ్యంలో.. సామాన్యులు, పోలీసులు ఈ అసందిగ్ధతను ఎలా ఎదుర్కొంటాయన్నారు.
 
నేపథ్యం ఏమిటి..?

 
2012 నవంబర్‌లో శివసేన వ్యవస్థాపకుడు బాల్‌ఠాక్రే మృతికి సంతాపంగా ఇచ్చిన బంద్ పిలుపును ‘ఫేస్‌బుక్’లో ప్రశ్నించిన షాహీన్‌ధాడను, ఆ పోస్ట్‌ను ‘లైక్’ చేసిన రీను శ్రీనివాసన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఐటీ చట్టంలోని 66ఎ సెక్షన్ కింద వారిపై కేసు నమోదు చేసి బెయిలుపై విడుదల చేశారు. దీనిపై నిరసనలు వెల్లువెత్తాయి.

► ఈ నేపథ్యంలో సామాజిక వెబ్‌సైట్లలో అభ్యంతరకర వ్యాఖ్యలను పోస్ట్ చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులనుఉన్నతాధికారుల అనుమతి లేకుండా అరెస్ట్ చేయకూడదంటూ 2013, మే 16 సుప్రీంకోర్టు సూచించింది.
►   ఈలోపు, యూపీ మంత్రి ఆజం ఖాన్‌పై ఫేస్‌బుక్‌లో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడన్న ఆరోపణలపై ఓ యువకుడిని 66ఏ కింద మార్చి 18న అరెస్ట్ చేశారు. దీనిపైసుప్రీంలో పిటిషన్ దాఖలైంది.
►    ఈనేపథ్యంలోనే సుప్రీం తీర్పునిచ్చింది.
 
 66ఎ ఏం చెబుతోంది..!

న్యూఢిల్లీ: ‘సైబర్ లా’ అని పేరొందిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000 సంవత్సరంలో అమల్లోకి వచ్చింది.సెక్షన్ ‘66ఎ ’ను 2008లో చట్టసవరణ ద్వారా చేర్చా రు. 2009 ఫిబ్రవరిలో అమల్లోకి తెచ్చారు.
 సెక్షన్ 66ఎలో ఏముందంటే..
►   ‘కంప్యూటర్ లేదా ఏదైనా సమాచార పరికరం ద్వారా ఏ వ్యక్తై..
►    {పమాదకరమైన, నేరపూరిత సమాచారాన్ని కానీ పంపినట్లుగా రుజువైతే..
►   ఆ సమాచారం తప్పు అని తెలిసినా.. దురుద్దేశపూరితంగా.. భయం, హాని, అవమానం, ఇబ్బంది, గాయం, శత్రుత్వం, విద్వేషం కలిగేలా.. ఏదైనా సమాచారాన్నిపంపినట్లుగా రుజువైతే..
►    ఎవరైనా వ్యక్తికి భయం,  హాని, అవమానం, ఇబ్బంది,  విద్వేషం కలిగించే ఉద్దేశంతో అదే వ్యక్తికి ఈమెయిల్ చేసినట్లుగా రుజువైతే..
►    మూడేళ్ల జైలుశిక్ష, రూ. 5 లక్షల జరి మానా, లేదా రెండూ విధించవచ్చు’
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement