నీలిచిత్రాలు తీసిన వ్యక్తి అరెస్ట్
కోల్‌సిటీ, న్యూస్‌లైన్: గోదావరిఖనిలో నీలిచిత్రాలు తీసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బుర్ర రమేశ్ అనే ప్రబుద్ధుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వివరాలను గోదావరిఖని డీఎస్పీ ఆర్.జగదీశ్వర్‌రెడ్డి విలేకరులకు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. స్థానిక లక్ష్మీనగర్‌లో మెడికల్ ఏజెన్సీ నిర్వహిస్తున్న రమేశ్ ఇద్దరు మహిళలను అశ్లీలంగా వీడియో తీశాడు. వీటిలో తాను కన్పించకుండా జాగ్రత్తపడ్డాడు. ఈ అశ్లీల చిత్రాలను ఇతర మొబైల్స్‌కు బ్లూటూత్ ద్వారా పంపించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
వన్‌టౌన్ పోలీసులు సుమోటోగా కేసు దర్యాప్తు చేశారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. నీలిచిత్రాలను ఉద్దేశపూర్వకంగా తీసినట్లు తేలింది. వీటిని అడ్డుపెట్టుకుని ఆ మహిళలను బ్లాక్‌మెయిల్ చేయాలనుకున్నాడా? ఇతడికి ఇంకెవరైనా సహకరించారా? ఈయన బారినపడిన మహిళలు ఇంకెవరైనా ఉన్నారా? అనే కోణాల్లో సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తానని డీఎస్పీ చెప్పారు. రమేశ్‌పై నిర్భయ చట్టంతోపాటు 292 సెక్షన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం కింద కేసులు నమోదుచేసి అరెస్ట్ చేసినట్లు వివరించారు.
మహిళలను లోబరుచుకుని నీలి చిత్రాలు తీసినా, తీస్తున్నట్లు తెలిసినా తనకు(94407 95133) సమాచారం ఇవ్వాలని డీఎస్పీ కోరారు. సమాచారం అందించిన వారికి రివార్డు ఇస్తామని, వీరితోపాటు బాధితుల పేర్లు గోప్యంగా ఉంచుతామని వివరించారు. సకాలంలో సమాచారం ఇస్తే బాధితులకు నష్టాన్ని తగ్గించే వీలుంటుందని, బాధితులు పబ్లిక్ ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినా స్పందిస్తానని పేర్కొన్నారు.