ఆ ఇన్ఫోసిస్ ఉద్యోగినికి సీనియర్ వేధింపులు!
కోజికోడ్: పుణేలో ఆదివారం తన కార్యాలయంలోనే హత్యకు గురైన ఇన్ఫోసిస్ సాఫ్ట్వేర్ ఉద్యోగిని రశీల రాజు (23)ను ఆఫీసులో ఆమె సీనియర్ ఒకతను తరచూ వెంటపడి వేధించేవాడని రశీల తండ్రి ఆరోపించారు. కావాలని ఆదివారం ఆమెను ఒంటరిగా ఆఫీసుకు పిలిపించి, తగినంత భద్రత లేకుండా చేసి హత్య చేయించారని రశీల తండ్రి రాజు పేర్కొన్నారు. రశీల అంత్యక్రియలు మంగళవారం కేరళలోని ఆమె స్వస్థలంలో ముగిశాయి. అంతిమ యాత్రకు వందలాది ప్రజలు తరలి వచ్చారు. రశీల మృతికి నష్టపరిహారంగా రూ.కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా, ఆమె కుటుంబంలో మరొకరికి ఉద్యోగం ఇవ్వడానికి ఇన్ఫోసిస్ ఒప్పుకున్నట్లు సమాచారం.
పుణెలోని రాజీవ్ గాంధీ ఇన్ఫోటెక్ పార్క్‌లో ఉన్న ఇన్ఫోసిస్ కార్యాలయంలోఆదివారం మధ్యాహ్నం పనిచేయడానికి వెళ్లిన రశీలను సాయంత్రం 9వ అంతస్తులో సెక్యూరిటీ గార్డు హత్య చేయడం తెలిసిందే. సెక్యూరిటీ గార్డును పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. రశీల మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ కేరళలో ప్రతిపక్ష కాంగ్రెస్ నేత రమేష్ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌కు లేఖ రాశారు.