inhuman attack
-
Israel-Hamas war: తిండి కోసం ఎగబడ్డ వారిపై కాల్పులు.. గాజాలో ఘోరం
రఫా: యుద్ధంలో సర్వం కోల్పోయి ఉండటానికి ఇల్లు, తింటానికి తిండి లేక అంతర్జాతీయ సాయం కోసం పొట్టచేతబట్టుకుని అర్ధిస్తున్న అభాగ్యులపైకి ఇజ్రాయెల్ తుపాకీ గుళ్ల వర్షం కురిపింది. గురువారం పశ్చిమ గాజాలో ఇజ్రాయెల్ జరిపిన ఈ అమానవీయ దారుణ దాడి ఘటనలో 100 మందికిపైగా పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 66 మంది మహిళలు, చిన్నారులే ఉన్నారు. 760కిపైగా గాయపడ్డారు. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మానవత్వాన్ని కాలరాస్తూ హమాస్–ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతున్న తీరును తాజా ఘటన మరోసారి కళ్లకు కట్టింది. పశ్చిమ గాజాలోని షేక్ అజ్లీన్ ప్రాంతంలోని హరౌన్ అల్ రషీద్వీధి ఈ రక్తపుటేళ్లకు సాక్షీభూతమైంది. తాజాగా దాడితో ఇప్పటివరకు ఇజ్రాయెల్ భూతల, గగనతల దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన పాలస్తీనియన్ల సంఖ్య 30,000 దాటింది. క్షతగాత్రుల సంఖ్య 70,457 దాటేసింది. Gaza: l'esercito israeliano spara sulla popolazione che cercava un pezzo di pane Oltre cento i morti.. Basta mentire Basta assassinare la popolazione civile che chiede cibo e acqua. Una sola parola :" assassini#GazaMassacare#GazaHoloucast #Gazaagenocide #Gaza Le Nazioni Unite… pic.twitter.com/aECgoHaU7S — Rete Italiana Antifascista (@Italiantifa) February 29, 2024 మృతదేహాలు గాడిదలపై.. ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాల ప్రకారం.. రోజుల తరబడి సరైన తిండిలేక అలమటించిపోతున్న పాలస్తీనియన్లకు పంచేందుకు ఆహార పొట్లాలు, సరుకు నిండిన ట్రక్కులు అల్ రషీద్ వీధికొచ్చాయి. అప్పటికే వందలాదిగా అక్కడ వేచి ఉన్న పాలస్తీనియన్లు ట్రక్కుల చుట్టూ గుమికూడారు. ఇజ్రాయెల్ సైన్యం పర్యవేక్షణలో ట్రక్కుల నుంచి ఆహార పంపిణీ జరగాల్సి ఉంది. అయితే క్యూ వరసల్లో నిల్చున్న వ్యక్తులను కాదని చాలా మంది ట్రక్కులపైకి ఎగబడి గోధుమ పిండి, క్యాన్లలో ప్యాక్ చేసిన ఆహారాన్ని లూటీ చేశారు. దీంతో పరిస్థితి అదుపు తప్పి గందరగోళం నెలకొంది. తోపులాట, తొక్కిసలాట జరిగాయి. వారించబోయిన ఇజ్రాయెల్ సైనికులపై వారు దాడికి పాల్పడ్డారని వార్తలొచ్చాయి. ‘‘ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఇజ్రాయెల్ బలగాలు పాలస్తీనియన్లపైకి తుపాకీ గుళ్లవర్షం కురిపించాయి. జనం పిట్టల్లా రాలి పడ్డారు. ఎక్కడ చూసినా మృతదేహాలే. మృతదేహాలు, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించేందుకు సరిపడా అంబులెన్సులు మా దగ్గర లేవు. విధిలేక గాడిదలపై, గాడిద బండ్లపై మృతదేహాలు, గాయపడిన వారిని తరలించాం’’ అని కమల్ అద్వాన్ ఆస్పత్రిలో అంబులెన్స్ సేవల అధికారి ఫరేస్ అఫానా చెప్పారు. లూటీ నుంచి తప్పించుకునేందుకు ట్రక్కులు ముందుకు కదలడంతో వాటి కింద పడి కొందరు మరణించారని వార్తలొచ్చాయి. మళ్లీ మళ్లీ కాల్పులు ఘటన వివరాలను ప్రత్యక్ష సాక్షి, క్షతగాత్రుడు కమెల్ అబూ నహేల్ చెప్పారు. ‘ రెండు నెలలుగా పశుగ్రాసం తిని బతుకుతున్నాం. రాత్రిపూట ఆ వీధిలో ఆహారం పంచుతున్నారంటే వెళ్లాం. వందల మందిపై కాల్పులు జరిపారు. తప్పించుకునేందుకు కార్ల కింద దాక్కున్నాం. కాల్పులు ఆగిపోయాక మళ్లీ ట్రక్కుల దగ్గరకు పరుగెత్తాం. ఇజ్రాయెల్ సైనికులు మళ్లీ కాల్పులు జరిపారు. నా కాలికి బుల్లెట్ తగలడంతో కింద పడ్డా. అప్పటికే ముందుకు కదలిన ట్రక్కు నా కాలిని ఛిద్రంచేసింది’ అని నహేల్ చెప్పారు. చదవండి: ఇజ్రాయెల్ కీలక ప్రకటన -
వీడెంత దుర్మార్గుడో చూడండి
రాయ్‌పూర్: బాలింత అని కూడా చూడకుండా మహిళను దారుణంగా రోడ్డు మీదకు ఈడ్చిపారేసిన అమానవీయ ఘటన ఛత్తీస్‌గఢ్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. కొరియా జిల్లా జానక్‌పూర్ బ్లాక్‌లోని బార్వానీ కన్య ఆశ్రమంలో ఈ దారుణం జరిగింది. హాస్టల్ సూపరింటెండెంట్ సుమిళ సింగ్ భర్త రంగ్లాల్ సింగ్ ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో సుమిళ సింగ్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఆమె స్థానంలో లీలావతి అనే మహిళను కొత్త సూపరింటెండెంట్‌గా నియమించారు. అసలేం జరిగింది..? హాస్టల్లో పనిచేస్తున్న ఓ మహిళ తన 3 నెలల బిడ్డతో కలిసి అక్కడే ఓ గదిలో ఉంటోంది. రూము ఖాళీ చేయాలని ఈనెల 10న ఆమెకు రంగ్లాల్ హుకుం జారీ చేశాడు. ఖాళీ చేసేందుకు ఆమె నిరాకరించడంతో బలప్రయోగానికి దిగాడు. మంచం మీద కూర్చున్న ఆమెను దుప్పటితో సహా కిందికి ఈడ్చిపాడేశాడు. అంతటితో ఆగకుండా బాధితురాలిని బలవంతంగా బయటకు లాక్కుపోయాడు. సుమిళ సమక్షంలో ఈ దారుణమంతా జరిగినా భర్తను ఆమె వారించకపోవడం గమనార్హం. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఈనెల 11న పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు. గిరిజన సంక్షేమ శాఖ అధికారులు, అధికార కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఆదివారం బాధితురాలిని పరామర్శించి, ఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. #WATCH Chhattisgarh:Ranglal Singh,husband of School Superintendent Sumila Singh misbehaved with a cleaner at Barwani Kanya Ashram in Korea, after she took shelter at students' hostel with her 3-month-old baby.Police says,“FIR filed.Probe on.Accused will be arrested soon.” (18.08) pic.twitter.com/NFayVvh8GZ — ANI (@ANI) August 19, 2019 -
స్వామి అగ్నివేశ్‌పై దాడి అమానుషం
హిమాయత్‌నగర్ : గోరక్షణ పేరుతో అమాయక ప్రజలపై మూకుమ్మడి దాడులు పెరుగుతున్నాయని, హిందూత్వ మత మౌఢ్యాన్ని వ్యతిరేకించేవారిపై దాడులు చేయడాన్ని ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ పిలుపునిచ్చారు. కులం, మతం ఆధారంగా ఓట్లు అడుగుతున్న పరిస్థితి ప్రస్తుత ప్రధాన రాజకీయ పార్టీల్లో కొనసాగుతోందని ఆయన మండిపడ్డారు. స్వామి అగ్నివేష్‌పై జరిగిన దాడిని ఖండిస్తూ గురువారం హిమాయత్‌నగర్‌లోని మఖ్దూం భవన్లో జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. వేదిక అధ్యక్షులు లక్ష్మణరెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో నారాయణ మాట్లాడుతూ.. ఏపీలో తటస్తుల పేరుతో నారా చంద్రబాబు నాయుడు కోటీశ్వరులను ఎన్నికల బరిలోకి దించి ప్రజాస్వామ్యాన్ని ధనస్వామ్యంగా మారుస్తున్నారని మండిపడ్డారు. హిందూత్వ అరాచక పాలనను, స్వామి అగ్నివేష్‌పై అమానుష దాడిని అందరూ ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. ‘సాక్షి’ ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి మాట్లాడుతూ.. 2018లో హిందూ మతమౌఢ్యులు 16మందిని చంపారన్నారు. భావ వ్యక్తీకరణను, ప్రశ్నించడాన్ని సహించలేకపోతున్నారని మండిపడ్డారు. ప్రజల్లో చైతన్యం తీసుకొస్తేనే లౌకికతత్వం నిలుస్తుందని పేర్కొన్నారు. సభకు అధ్యక్షత వహించిన వి.లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ.. స్వామి అగ్నివేష్ 1939లో ఏపీలో జన్మించి, హరియాణాలో ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేయడం గొప్ప విషయమన్నారు. ఐదేళ్లు వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, మద్య నిషేధం అమలు కోసం, గిరిజనులు, దళితుల అభ్యున్నతి కోసం, సామాజిక న్యాయం కోసం ఉద్యమిస్తున్న పోరాటయోధుడన్నారు. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన 79 ఏళ్ల ఉద్యమకారునిపై.. ఆరెస్సెస్, బీజేపీ యువమోర్చాకు చెందిన అరాచక శక్తులు భౌతిక దాడులు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఆయనపై జరిగిన దాడికి ప్రధాని మోదీ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని, సిట్టింగ్ హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఐజేయూ గౌరవ సలహాదారులు కె.శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రశ్నించేతత్వాన్ని పెంపొందిస్తేనే సమాజం ముందుకెళ్తుందన్నారు. తాత్విక చింతనను ప్రోత్సహించాలన్నారు. సీపీఎం కార్యదర్శి వర్గసభ్యులు డి.జి.నరసింగరావు ప్రసంగిస్తూ.. స్వామి అగ్నివేష్‌పై దాడి మనువాద మూర్ఖుల దాడేనన్నారు. సీనియర్ జర్నలిస్ట్ కె.అమర్, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నేత కె.గోవర్ధన్, ప్రముఖ మహిళా నేత రమా మెల్కొటే, సీనియర్ పాత్రికేయులు తెలకపల్లి రవి, ప్రగతిశీల మహిళ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు జి.ఝాన్సీ, శ్రామిక మహిళా నేత పావని, ఎంవీ ఫౌండేషన్ నేత ప్రకాష్, అప్సా కోఆర్డినేటర్ శివరాణి, జన చైతన్య వేదిక ప్రధాన కార్యదర్శి సలీం మాలిక్, ప్రముఖ హేతువాది కె.వి.రెడ్డి, ప్రముఖ విశ్లేషకులు దేవి తదితరులు పాల్గొన్నారు. స్వామి అగ్నివేష్‌పై జరిగిన దాడిని ఖండించారు. -
అమానుషంపై విస్మయం
అంధ విద్యార్థులపై అమానుష దాడి రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ప్రజా, విద్యార్థి సంఘాలు ఈ కర్కశ దాడిని తీవ్రంగా ఖండించాయి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ జిల్లా కేంద్రం కాకినాడలో ర్యాలీలు, ధర్నాలు చేపట్టాయి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ దుశ్చర్యను తీవ్రంగా పరిగణించింది. ఇటువంటి దారుణ ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని జిల్లా అధికారులను ఆదేశించింది. కాకినాడ క్రైం :అంధ విద్యార్థులపై అమానుషంగా దాడి చేయడం అందర్నీ కలచివేసింది. ఈ ఘటనపై మీడియాలో వచ్చిన కథనాలు చూసి ఇటువంటి మూర్ఖులు కూడా ఉంటారా అంటూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఏ మాత్రం జాలి లేకుండా పసిమొగ్గలపై విరుచుకు పడతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధిత విద్యార్థులను పలువురు పరామర్శించారు. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం శివారు అచ్చంపేట జంక్షన్‌లోని గ్రీన్‌ఫీల్డ్ అంధుల పాఠశాలలో ముగ్గురు అంధ విద్యార్థులపై ప్రిన్సిపాల్, కరస్పాండెంట్ అమానుషంగా దాడి చేసిన విషయం విదితమే. అంధ విద్యార్థులు కూర్తి జాన్సన్, పాముల సురేంద్ర, పులప సాయి తమను కొట్టవద్దంటూ... ఇంకెప్పుడూ తప్పు చేయబోమని... బతిమలాడుతున్నా పట్టించుకోకుండా కర్కశంగా దాడికి పాల్పడ్డ ప్రిన్సిపాల్ టేకుమూడి శ్రీనివాస్, కరస్పాండెంట్ కోలకొండ వెంకటేశ్వరరావు దుశ్చర్యను ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్‌యూ తదితర విద్యార్థి సంఘాలు కాకినాడ నగరంతో పాటు వివిధ ప్రాంతాల్లో ర్యాలీలు, ధర్నాలు నిర్వహించాయి. బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. గ్రీన్‌ఫీల్డ్ ఉదంతాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా తీవ్రంగా పరిగణించింది. రాష్ట్ర మహిళా సాధికారత, స్త్రీ-శిశు సంక్షేమశాఖ మంత్రి పి. సుజాత ఘటనను ఖండించారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆమె ఫోన్లో ఆదేశించారు. విశాఖపట్నం ప్రభుత్వ అంధుల ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న కరస్పాండెంట్ కేవీ రావును సస్పెండ్ చేయాల్సిందిగా ఆదేశాలిచ్చారు. పలువురి ఖండన బాధిత విద్యార్థులను జిల్లా పరిషత్ చైర్మన్ నామన రాంబాబు, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి తదితరులు మంగళవారం పరామర్శించారు. వారి నుంచి సమాచారం సేకరించారు. బాధ్యులపై కఠినచర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోవడం దురదృష్టకరమని జడ్పీ చైర్మన్ రాంబాబు ఈ దాడిని ఖండించారు. పోలీసుల తీరుపై ఆగ్రహం ఇంత దారుణానికి ఒడిగట్టిన వారిని పోలీసులు రక్షించే ప్రయత్నం చేస్తున్నారంటూ ప్రజా, విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో జిల్లాలో జరిగిన ఇటువంటి సంఘటనల్లో కూడా పోలీసులు వ్యవహరించిన తీరు విమర్శల పాలైంది.