సమావేశంలో మాట్లాడుతున్న నారాయణ
హిమాయత్‌నగర్ : గోరక్షణ పేరుతో అమాయక ప్రజలపై మూకుమ్మడి దాడులు పెరుగుతున్నాయని, హిందూత్వ మత మౌఢ్యాన్ని వ్యతిరేకించేవారిపై దాడులు చేయడాన్ని ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ పిలుపునిచ్చారు. కులం, మతం ఆధారంగా ఓట్లు అడుగుతున్న పరిస్థితి ప్రస్తుత ప్రధాన రాజకీయ పార్టీల్లో కొనసాగుతోందని ఆయన మండిపడ్డారు.
స్వామి అగ్నివేష్‌పై జరిగిన దాడిని ఖండిస్తూ గురువారం హిమాయత్‌నగర్‌లోని మఖ్దూం భవన్‌లో జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. వేదిక అధ్యక్షులు లక్ష్మణరెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో నారాయణ మాట్లాడుతూ.. ఏపీలో తటస్తుల పేరుతో నారా చంద్రబాబు నాయుడు కోటీశ్వరులను ఎన్నికల బరిలోకి దించి ప్రజాస్వామ్యాన్ని ధనస్వామ్యంగా మారుస్తున్నారని మండిపడ్డారు.
హిందూత్వ అరాచక పాలనను, స్వామి అగ్నివేష్‌పై అమానుష దాడిని అందరూ ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. ‘సాక్షి’ ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి మాట్లాడుతూ.. 2018లో హిందూ మతమౌఢ్యులు 16మందిని చంపారన్నారు. భావ వ్యక్తీకరణను, ప్రశ్నించడాన్ని సహించలేకపోతున్నారని మండిపడ్డారు. ప్రజల్లో చైతన్యం తీసుకొస్తేనే లౌకికతత్వం నిలుస్తుందని పేర్కొన్నారు.
సభకు అధ్యక్షత వహించిన వి.లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ.. స్వామి అగ్నివేష్ 1939లో ఏపీలో జన్మించి, హరియాణాలో ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేయడం గొప్ప విషయమన్నారు. ఐదేళ్లు వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, మద్య నిషేధం అమలు కోసం, గిరిజనులు, దళితుల అభ్యున్నతి కోసం, సామాజిక న్యాయం కోసం ఉద్యమిస్తున్న పోరాటయోధుడన్నారు.
అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన 79 ఏళ్ల ఉద్యమకారునిపై.. ఆరెస్సెస్, బీజేపీ యువమోర్చాకు చెందిన అరాచక శక్తులు భౌతిక దాడులు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఆయనపై జరిగిన దాడికి ప్రధాని మోదీ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని, సిట్టింగ్ హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఐజేయూ గౌరవ సలహాదారులు కె.శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రశ్నించేతత్వాన్ని పెంపొందిస్తేనే సమాజం ముందుకెళ్తుందన్నారు.
తాత్విక చింతనను ప్రోత్సహించాలన్నారు. సీపీఎం కార్యదర్శి వర్గసభ్యులు డి.జి.నరసింగరావు ప్రసంగిస్తూ.. స్వామి అగ్నివేష్‌పై దాడి మనువాద మూర్ఖుల దాడేనన్నారు. సీనియర్ జర్నలిస్ట్ కె.అమర్, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నేత కె.గోవర్ధన్, ప్రముఖ మహిళా నేత రమా మెల్కొటే, సీనియర్ పాత్రికేయులు తెలకపల్లి రవి, ప్రగతిశీల మహిళ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు జి.ఝాన్సీ, శ్రామిక మహిళా నేత పావని, ఎంవీ ఫౌండేషన్ నేత ప్రకాష్, అప్సా కోఆర్డినేటర్ శివరాణి, జన చైతన్య వేదిక ప్రధాన కార్యదర్శి సలీం మాలిక్, ప్రముఖ హేతువాది కె.వి.రెడ్డి, ప్రముఖ విశ్లేషకులు దేవి తదితరులు పాల్గొన్నారు. స్వామి అగ్నివేష్‌పై జరిగిన దాడిని ఖండించారు.
Comments
Please login to add a commentAdd a comment