అమానుషంపై విస్మయం
అంధ విద్యార్థులపై అమానుష దాడి రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. ప్రజా, విద్యార్థి సంఘాలు ఈ కర్కశ దాడిని తీవ్రంగా ఖండించాయి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ జిల్లా కేంద్రం కాకినాడలో ర్యాలీలు, ధర్నాలు చేపట్టాయి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ దుశ్చర్యను తీవ్రంగా పరిగణించింది. ఇటువంటి దారుణ ఘటనలు పునరావృతం కాకుండా
చూడాలని జిల్లా అధికారులను ఆదేశించింది.
కాకినాడ క్రైం :అంధ విద్యార్థులపై అమానుషంగా దాడి చేయడం అందర్నీ కలచివేసింది. ఈ ఘటనపై మీడియాలో వచ్చిన కథనాలు చూసి ఇటువంటి మూర్ఖులు కూడా ఉంటారా అంటూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఏ మాత్రం జాలి లేకుండా పసిమొగ్గలపై విరుచుకు పడతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధిత విద్యార్థులను పలువురు పరామర్శించారు. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం శివారు అచ్చంపేట జంక్షన్‌లోని గ్రీన్‌ఫీల్డ్ అంధుల పాఠశాలలో ముగ్గురు అంధ విద్యార్థులపై ప్రిన్సిపాల్, కరస్పాండెంట్ అమానుషంగా దాడి చేసిన విషయం విదితమే. అంధ విద్యార్థులు కూర్తి జాన్సన్, పాముల సురేంద్ర, పులప సాయి తమను కొట్టవద్దంటూ...
ఇంకెప్పుడూ తప్పు చేయబోమని... బతిమలాడుతున్నా పట్టించుకోకుండా కర్కశంగా దాడికి పాల్పడ్డ ప్రిన్సిపాల్ టేకుమూడి శ్రీనివాస్, కరస్పాండెంట్ కోలకొండ వెంకటేశ్వరరావు దుశ్చర్యను ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్, పీడీఎస్‌యూ తదితర విద్యార్థి సంఘాలు కాకినాడ నగరంతో పాటు వివిధ ప్రాంతాల్లో ర్యాలీలు, ధర్నాలు నిర్వహించాయి. బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. గ్రీన్‌ఫీల్డ్ ఉదంతాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా తీవ్రంగా పరిగణించింది. రాష్ట్ర మహిళా సాధికారత, స్త్రీ-శిశు సంక్షేమశాఖ మంత్రి పి. సుజాత ఘటనను ఖండించారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆమె ఫోన్‌లో ఆదేశించారు. విశాఖపట్నం ప్రభుత్వ అంధుల ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న కరస్పాండెంట్ కేవీ రావును సస్పెండ్ చేయాల్సిందిగా ఆదేశాలిచ్చారు.
పలువురి ఖండన
బాధిత విద్యార్థులను జిల్లా పరిషత్ చైర్మన్ నామన రాంబాబు, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి తదితరులు మంగళవారం పరామర్శించారు. వారి నుంచి సమాచారం సేకరించారు. బాధ్యులపై కఠినచర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోవడం దురదృష్టకరమని జడ్పీ చైర్మన్ రాంబాబు ఈ దాడిని ఖండించారు.
పోలీసుల తీరుపై ఆగ్రహం
ఇంత దారుణానికి ఒడిగట్టిన వారిని పోలీసులు రక్షించే ప్రయత్నం చేస్తున్నారంటూ ప్రజా, విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో జిల్లాలో జరిగిన ఇటువంటి సంఘటనల్లో కూడా పోలీసులు వ్యవహరించిన తీరు విమర్శల పాలైంది.