పశ్చిమగాజాలో పాలస్తీనియన్లు సహాయక ట్రక్కులను చుట్టుముట్టిన వీడియో దృశ్యం
ఆహారం కోసం వస్తే దారుణం
పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ కాల్పుల మోత
100 మందికిపైగా దుర్మరణం
760 మందికి గాయాలు
రఫా: యుద్ధంలో సర్వం కోల్పోయి ఉండటానికి ఇల్లు, తింటానికి తిండి లేక అంతర్జాతీయ సాయం కోసం పొట్టచేతబట్టుకుని అర్ధిస్తున్న అభాగ్యులపైకి ఇజ్రాయెల్ తుపాకీ గుళ్ల వర్షం కురిపింది. గురువారం పశ్చిమ గాజాలో ఇజ్రాయెల్ జరిపిన ఈ అమానవీయ దారుణ దాడి ఘటనలో 100 మందికిపైగా పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 66 మంది మహిళలు, చిన్నారులే ఉన్నారు. 760కిపైగా గాయపడ్డారు.
మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మానవత్వాన్ని కాలరాస్తూ హమాస్–ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతున్న తీరును తాజా ఘటన మరోసారి కళ్లకు కట్టింది. పశ్చిమ గాజాలోని షేక్ అజ్లీన్ ప్రాంతంలోని హరౌన్ అల్ రషీద్‌వీధి ఈ రక్తపుటేళ్లకు సాక్షీభూతమైంది. తాజాగా దాడితో ఇప్పటివరకు ఇజ్రాయెల్ భూతల, గగనతల దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన పాలస్తీనియన్ల సంఖ్య 30,000 దాటింది. క్షతగాత్రుల సంఖ్య 70,457 దాటేసింది.
Gaza: l'esercito israeliano spara sulla popolazione che cercava un pezzo di pane
— Rete Italiana Antifascista (@Italiantifa) February 29, 2024
Oltre cento i morti..
Basta mentire
Basta assassinare la popolazione civile che chiede cibo e acqua.
Una sola parola :" assassini#GazaMassacare#GazaHoloucast #Gazaagenocide #Gaza
Le Nazioni Unite… pic.twitter.com/aECgoHaU7S
మృతదేహాలు గాడిదలపై..
ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాల ప్రకారం.. రోజుల తరబడి సరైన తిండిలేక అలమటించిపోతున్న పాలస్తీనియన్లకు పంచేందుకు ఆహార పొట్లాలు, సరుకు నిండిన ట్రక్కులు అల్ రషీద్ వీధికొచ్చాయి. అప్పటికే వందలాదిగా అక్కడ వేచి ఉన్న పాలస్తీనియన్లు ట్రక్కుల చుట్టూ గుమికూడారు. ఇజ్రాయెల్ సైన్యం పర్యవేక్షణలో ట్రక్కుల నుంచి ఆహార పంపిణీ జరగాల్సి ఉంది.
అయితే క్యూ వరసల్లో నిల్చున్న వ్యక్తులను కాదని చాలా మంది ట్రక్కులపైకి ఎగబడి గోధుమ పిండి, క్యాన్లలో ప్యాక్ చేసిన ఆహారాన్ని లూటీ చేశారు. దీంతో పరిస్థితి అదుపు తప్పి గందరగోళం నెలకొంది. తోపులాట, తొక్కిసలాట జరిగాయి. వారించబోయిన ఇజ్రాయెల్ సైనికులపై వారు దాడికి పాల్పడ్డారని వార్తలొచ్చాయి. ‘‘ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఇజ్రాయెల్ బలగాలు పాలస్తీనియన్లపైకి తుపాకీ గుళ్లవర్షం కురిపించాయి.
జనం పిట్టల్లా రాలి పడ్డారు. ఎక్కడ చూసినా మృతదేహాలే. మృతదేహాలు, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించేందుకు సరిపడా అంబులెన్సులు మా దగ్గర లేవు. విధిలేక గాడిదలపై, గాడిద బండ్లపై మృతదేహాలు, గాయపడిన వారిని తరలించాం’’ అని కమల్ అద్వాన్ ఆస్పత్రిలో అంబులెన్స్ సేవల అధికారి ఫరేస్ అఫానా చెప్పారు. లూటీ నుంచి తప్పించుకునేందుకు ట్రక్కులు ముందుకు కదలడంతో వాటి కింద పడి కొందరు మరణించారని వార్తలొచ్చాయి.
మళ్లీ మళ్లీ కాల్పులు
ఘటన వివరాలను ప్రత్యక్ష సాక్షి, క్షతగాత్రుడు కమెల్ అబూ నహేల్ చెప్పారు. ‘ రెండు నెలలుగా పశుగ్రాసం తిని బతుకుతున్నాం. రాత్రిపూట ఆ వీధిలో ఆహారం పంచుతున్నారంటే వెళ్లాం. వందల మందిపై కాల్పులు జరిపారు. తప్పించుకునేందుకు కార్ల కింద దాక్కున్నాం. కాల్పులు ఆగిపోయాక మళ్లీ ట్రక్కుల దగ్గరకు పరుగెత్తాం. ఇజ్రాయెల్ సైనికులు మళ్లీ కాల్పులు జరిపారు. నా కాలికి బుల్లెట్ తగలడంతో కింద పడ్డా. అప్పటికే ముందుకు కదలిన ట్రక్కు నా కాలిని ఛిద్రంచేసింది’ అని నహేల్ చెప్పారు.
చదవండి: ఇజ్రాయెల్ కీలక ప్రకటన
Comments
Please login to add a commentAdd a comment