దీర్ఘకాలంలో రియల్ లాభాలు
కొద్దిరోజులుగా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులు (రీట్స్) చర్చనీయాంశంగా ఉంటున్నాయి. వీటికి కేంద్రం ఆమోదముద్ర వేయడంతో రియల్టీ రం గంలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారి కోసం మరో కొత్త సాధనం అందుబాటులోకి వచ్చినట్లయింది. అయితే, ఇలాంటి ప్రత్యామ్నాయ పెట్టుబడి సాధనాల్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు వాటిల్లో సాధకబాధకాలు గురించి ముందుగా తెలుసుకోవడం అవసరం. వాటి గురించి తెలియజేసేదే ఈ కథనం.
స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ దగ్గర ట్రస్టుల కింద రీట్స్ నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. ఇవి ఇనీషియల్ ఆఫర్ల ద్వారా నిధులు సమీకరిస్తాయి. నిధులకు ప్రతిగా యూనిట్లను కేటాయిస్తాయి. ఇవి స్టాక్ ఎక్స్చేంజీల్లో లిస్టవుతాయి. ఇక ఇనీషియల్ ఆఫర్ల ద్వారా సమీకరించిన నిధులను ఉపయోగించి తక్షణమే అద్దెకు ఇచ్చేందుకు వీలున్న ప్రాపర్టీలను రీట్స్ కొంటాయి. సదరు ప్రాపర్టీలపై రీట్స్ అద్దె రూపంలో ఆదాయం పొందుతాయి. ఆ ప్రయోజనాలను ఇన్వెస్టర్లకు బదలాయిస్తాయి.
మ్యూచువల్ ఫండ్స్ తరహాలోనే కనిపించినా.. రీట్స్, ఫండ్స్ ఇన్వెస్ట్ చేసే సాధనాలు వేర్వేరుగా ఉంటాయి. ఫండ్స్ ప్రధానంగా స్టాక్స్, డెట్ మొదలైన వాటిలో ఇన్వెస్ట్ చేస్తే, రీట్స్ ప్రధానంగా కమర్షియల్ రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేస్తాయి. ఫండ్ విషయానికొస్తే.. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా పోర్ట్‌ఫోలియోలో స్టాక్లను మార్చుకునే వెసులుబాటు ఫండ్ మేనేజర్లకు ఉంటుంది. అయితే, రీట్స్కి ఇలాంటి వెసులుబాటు ఉండదు.
నిబంధనల ప్రకారం ఇవి కచ్చితంగా కమర్షియల్ రియల్ ఎస్టేట్‌పైనే ఇన్వెస్ట్ చేయాలి. ఇవి దీర్ఘకాలికమైనవి కావడంతో పాటు లావాదేవీల సంఖ్యపై పరిమితులు ఉంటాయి. అలాగే, సెబీ నిబంధనల ప్రకారం రీట్స్ సమీకరించిన మొత్తం నిధిలో దాదాపు 90 శాతాన్ని అప్పటికే నిర్మాణం పూర్తయిపోయి, ఆదాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్న ప్రాపర్టీల్లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. రీట్స్‌లో చేసే ఇన్వెస్ట్మెంట్కి లాకిన్ వ్యవధి ఉంటుంది. గడువు తీరిన తర్వాత .. వచ్చిన రాబడిని ఇన్వెస్టర్లకు రీట్స్ పంచుతాయి. ఉదాహరణకు, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టు.. ఒక పదేళ్ల వ్యవధికి ఇన్వెస్ట్ చేసిందనుకుందాం. ఆ పదేళ్లు గడిచిన తర్వాత సదరు ప్రాపర్టీని విక్రయించి, వచ్చిన మొత్తాన్ని ఇన్వెస్టర్లకు అందజేస్తాయి.
సాధారణంగా రెసిడెన్షియల్ ప్రాపర్టీతో పోలిస్తే కమర్షియల్ ప్రాపర్టీపై వచ్చే అద్దె ఆదాయాలు ఎక్కువగానే ఉంటాయి. కనుక సక్రమమైన నిర్వహణ ఉంటే రీట్ ద్వారా మెరుగైన రాబడే అందుకోవచ్చు. అయితే, రీట్స్‌లో ఇన్వెస్ట్ చేయదల్చుకున్న వారు వీటిలో పెట్టుబడి దీర్ఘకాలం పాటు లాకిన్ అయి ఉంటుందని గుర్తుంచుకోవాలి. పెట్టుబడుల్లో వైవిధ్యం కోసం రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టాలనుకునే వారు ఈ రిస్క్‌కు సిద్ధపడితే ఈ సాధనాన్ని ఎంచుకోవచ్చు.