శాస్త్రోక్తంగా అక్షర దీవెన
1800మంది విద్యార్థులు హాజరు
సర్వాంగ సుందరంగా గురు దక్షిణామూర్తి ముస్తాబు
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలో ప్రతి ఏటా నిర్వహించే అక్షర దీవెన ఉత్సవం పేరిట సామూహి క అక్షరాభ్యాసం బుధవారం శాస్త్రోక్తంగా నిర్వహిం చారు. మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ పేట రాధారెడ్డి, ఆలయ ఈవో బి.రామిరెడ్డి పిల్లలతో పలకపై ఓం నమఃశివాయ అని తొలి అక్షరం దిద్దించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని సర్వాంగసుందరంగా ముస్తాబు చేశారు. ప్రధానంగా సుపథ మండపం వద్ద పూలమాలలతో నిండైన స్వాగత తోరణాలను ఏర్పాటు చేశారు.
మొదట గురు దక్షిణామూర్తిని విశేషంగా అలంకరించారు. అనంతరం గురు దక్షిణామూర్తి వద్ద ఆలయ ప్రధాన అర్చకులు బాబు గురుకుల్ ఆధ్వర్యంలో వేదపండితులు సరస్వతీదేవి పూజలను మంత్రోచ్ఛారణలతో జరిపారు. శ్రీకాళహస్తి పట్టణంతోపాటు శ్రీకాళహస్తి మండలం, తొట్టంబేడు, ఏర్పేడు, బుచ్చినాయుడుకండ్రిగ మండలాల నుంచి పాఠశాలల విద్యార్థులు 1800 మంది బుధవారం ఆలయంలో జరిగిన సామూహిక అక్షరాభ్యాసంలో అధికారికంగా పాల్గొన్నారు. పూజారులు సంప్రదాయబద్ధంగా పూజలు చేసి అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులకు దేవస్థానం పలకలు, బలపాలు,పెన్నులు, 100 గ్రాముల బియ్యం, పులిహోర, లడ్డులను అందజేసింది. ఈ కార్యక్రమంలో ఆలయ మాజీ చైర్మన్ శాంతారామ్ జే పవార్, టీడీపీ సీనియర్ నాయకుడు పోతుగుంట గురవయ్యనాయుడు, మున్సిపల్ వైస్ చైర్మన్ ముత్యాల పార్థసారధి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చెంచయ్యనాయుడు, పలువురు కౌన్సిలర్ పులి మోనిక, టీడీపీ నాయకులు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కండ్రిగ ఉమ, ఆలయాధికారులు, పెద్ద ఎత్తున పలువురు భక్తులు పాల్గొన్నారు. 2500 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసారి 700 మంది విద్యార్థులు తగ్గారు. ఆలయాధికారులు అక్షరాభాస్యంపై సరైన ప్రచారం చేయకపోవడంతోనే విద్యార్థుల సంఖ్య తగ్గింది.