instalment
-
ధర తగ్గిస్తే ఇల్లు కొంటాం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇల్లు కొనాలంటే డిస్కౌంట్ ఇవ్వాల్సిందే. అలాగే సులభ వాయిదాలూ ఉండాల్సిందేనని 73 శాతం కస్టమర్లు చెబుతున్నారని హౌజింగ్.కామ్, నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ (నరెడ్కో) సంయుక్తంగా చేపట్టిన సర్వేలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా 3,000 మంది ఈ సర్వేలో పాలుపంచుకున్నారు. 2022 జనవరి–జూన్ రెసిడెన్షియల్ రియల్టీ కన్జూమర్ సెంటిమెంట్ ఔట్లుక్ ప్రకారం.. రియల్టీలో పెట్టుబడులకు 47 శాతం మంది మొగ్గుచూపుతున్నారు. స్టాక్స్, గోల్డ్, ఫిక్స్డ్ డిపాజిట్లతో పోలిస్తే ఇదే అత్యధికం. 2020 జూలై–డిసెంబర్ కాలానికి చేపట్టిన సర్వేలో ఇల్లు, స్థలంలో పెట్టుబడులకు ఆసక్తి చూపినవారి సంఖ్య 35 శాతం మాత్రమే. వినియోగానికి సిద్ధంగా ఉన్న ఇంటిని కొనేందుకు 57 శాతం మంది మొగ్గుచూపుతున్నారు. విశ్వసనీయత లేమి కారణంగా కాబోయే కొనుగోలుదార్లు నిర్మాణంలో ఉన్న భవనాల్లో ఫ్లాట్‌ను బుక్ చేయడానికి ఇప్పటికీ జాగ్రత్తగానే ఉన్నారని చెప్పడానికి ఇది ఉదాహరణ అని నరెడ్కో చెబుతోంది. డెవలపర్లు తమ నిబద్ధతతో కూడిన గడువుకు అనుగుణంగా ఉండేలా చూసుకోవడంపై దృష్టి సారిస్తుండటంతో పరిస్థితి మారవచ్చని వివరించింది. ధరలు పెరుగుతాయ్..: ముడిసరుకు వ్యయాలు పెరుగుతున్నందున వచ్చే ఆరు నెలల్లో ఇళ్ల ధరలు అధికం అవుతాయని 51 శాతం మంది వినియోగదార్లు భావిస్తున్నారు. కోవిడ్–19 మహమ్మారి వ్యాప్తి చెందినప్పటి నుండి రియల్ ఎస్టేట్ రంగంలో సాంకేతికత వినియోగంలో వేగం ఊపందుకుంది. ఆన్లైన్లో ఇల్లు చూసి కొనడం లేదా ఒకసారి ఇంటిని పరిశీలించిన వెంటనే ఒప్పందాన్ని పూర్తి చేయడానికి 40 శాతం మంది కస్టమర్లు సిద్ధంగా ఉన్నారు. ఎనిమిది ప్రధాన నగరాల్లోని గృహ కొనుగోలుదారులు విద్యా సంస్థలు, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు, వినోద స్థలాలకు సమీపంలో ఇంటిని కోరుకుంటున్నారు. అత్యధికులు తమ ఇళ్ల నుండి 1–1.5 కిలోమీటరు దూరంలో ఇటువంటి సౌకర్యాలు ఉండాలంటున్నారు. గృహ రుణాల వడ్డీపై రిబేట్ పెంపు, నిర్మాణ సామగ్రిపై గూడ్స్, సర్వీస్ ట్యాక్స్ తగ్గింపు, చిన్న డెవలపర్లకు రుణ లభ్యత విస్తరణ, స్టాంప్ డ్యూటీ కుదింపు వంటి నిర్ణయాలు ప్రభుత్వం తీసుకోవాలని హౌజింగ్.కామ్, నరెడ్కో చెబుతున్నాయి. కోవిడ్ ముందస్తు స్థాయికి..: రానున్న 6 నెలల్లో ఆర్థిక వ్యవస్థ వృద్ధి కొనసాగుతుందని 79% మంది అభిప్రాయపడ్డారని సర్వే పేర్కొంది. మహమ్మారి ఫస్ట్ వేవ్‌లో 41%తో పోలిస్తే ఆర్థిక వ్యవస్థ అధ్వాన్నంగా ఉంటుందని 21% మంది మాత్రమే సూచించారు. 63% మంది గృహ కొనుగోలుదారులు రాబోయే 6 నెలలకు తమ ఆదాయంపై నమ్మకంతో ఉన్నారు. డిమాండ్ తిరిగి పుంజుకోవడంతో 2021 లో ఇళ్ల అమ్మకాలు 13% పెరిగాయి. ఈ ఏడాది అమ్మకాలు కోవిడ్‌కు ముందు స్థాయిలను దాటతాయని గట్టిగా విశ్వసిస్తున్నాం’ అని హౌజింగ్.కామ్ గ్రూప్ సీఈవో ధ్రువ్ అగర్వాల్ తెలిపారు. -
స్పైస్‌జెట్ బంపర్ ఆఫర్, డబ్బులు లేవా.. తర్వాతే ఇవ్వండి
ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్ జెట్ ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇప్పటికే బ్యాంకింగ్, రీటైల్, ఈ కామర్స్‌తో పాటు వినియోగదారులకు అందుబాటులో ఉన్న ఈఎంఐ సదుపాయాన్ని స్పైస్ జెట్ ఇప్పుడు విమాన ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చింది. విమాన ప్రయాణికులు ఈఎంఐ సౌకర్యంతో స్పైస్ జెట్ ఫ్లైట్ టికెట్లను కొనుగోలు చేయొచ్చు. 3,6,12 నెలల పాటు వాయిదా పద్దతుల్లో వడ్డీ లేకుండా, కొనుగోలు చేసిన టికెట్ల ధర మొత్తాన్ని ఈఎంఐలో చెల్లించుకోవచ్చు. ప్రయాణికులు చేయాల్సిందల్లా ఒక్కటే స్పైస్ జెట్ విమాన టికెట్లకు ఈఎంఐ సదుపాయం కావాలంటే ప్రయాణికులు పాన్ నెంబర్, ఆధార్ కార్డ్, వీఐడీ వివరాల్ని నమోదు చేయాలి. వన్‌టైమ్ పాస్వర్డ్ తో యాక్టీవ్ చేసుకోవాలి. వినియోగదారులు యూపీఐ ఐడీ ద్వారా ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. ఈఎంఐ స్కీమ్‌ను పొందేందుకు ప్రయాణికులు ఎలాంటి క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ వివరాలను అందించాల్సిన అవసరం లేదని స్పైస్ జెట్ పేర్కొంది. చదవండి:ఇకపై ఎంచక్కా..ఫ్లైట్ జర్నీలోనే క్యాబ్ బుక్ చేసుకోవచ్చు -
ఆశ పెట్టి.. మోసగించి!
- ఇన్స్టాల్మెంట్ స్కీమ్ అంటూ మోసం - డిప్ తగిలితే ఎలకా్ట్రనిక్ వస్తువులు ఉచితమని ప్రచారం - బోగస్ అడ్రస్‌తో బురిడి ఆదోని అగ్రికల్చర్: జిల్లాలో ఎన్నో బోగస్ సంస్థలు పేదల డబ్బులు వసూలు చేసి బోర్డు తిప్పేస్తున్నా ఇంకా ప్రజల్లో చైతన్యం, అధికారుల్లో చలనం కొరవడిందని మరో సారి రుజువైంది. తాజాగా ఆదోని అడ్రస్‌తో కొందరు వ్యక్తులు ఓ బ్రోచర్‌ను ముద్రించి ఇన్‌స్టాల్‌మెంట్‌కు ఎలక్ట్రానిక్ వస్తువులు తక్కువ ధరకు ఇస్తామని పేదలను నమ్మించి భారీగా డబ్బులు వేసి చివరకు ఉడాయించారు. కంతులు పూర్తయినా వస్తువులు ఇవ్వకపోవడంతో అనుమానంతో వచ్చి బ్రోచర్లో ఉన్న అడ్రస్ మేరకు విచారించగా అటువంటి కార్యాలయం లేకపోవడంతో మోసపోయినట్లు గ్రహించారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. ఆదోని పట్టణం అంబేద్కర్ నగర్ వీధిలో నివాసముంటున్నామని, శ్రీమారెమ్మ దేవీ ఇన్స్టాల్మెంట్ కంపెనీలో వారానికి కొంత మొత్తం ఇన్స్టాల్మెంటుగా చెల్లించి సభ్యులుగా చేరితే ఫ్యాన్, బీరువా, మంచాలు ఇస్తామని కొందరు వ్యక్తులు నమ్మబలికారు. డిప్ మధ్యలో తగిలితే ఆ తర్వాత కంతులు చెల్లించకుండానే వస్తువులు ఇస్తామని ఆశ పెట్టారు. ప్రొప్రెటర్గా నందిత అని బ్రోచర్ పేర్కొన్నారు. అడ్రస్‌లో కార్యాలయం లేదు.. బ్రోచర్లో ఫోన్ నంబర్ లేదు ఆదోని శివారు ప్రాంతం, కోసిగి మండలం వందగల్లు గ్రామంలో చాలా మందితో కంతులు కట్టించారు. వందగల్లు గ్రామంలోనే దాదాపు 60 మంది వారానికి రూ.200, రూ.500, రూ.1000 చొప్పున ఎవరికి చేతనైనంత వారు చెల్లించారు. 22 వారాలు పూర్తిగా చెల్లించిన వారికి 21 అంగుళాల కలర్ టీవీ లేదా 220 గ్రాముల బంగారు ఇస్తామని బ్రోచర్లో పొందుపరిచారు. మొదట రెండు మూడు వారాలు డిప్ తీసి కుక్కర్, ప్లేట్లు లాంటి చిన్న వస్తువులను అందజేశారు. ఇది నిజమని నమ్మి చాలా మంది మహిళలు స్కీమ్‌లో చేరారు. కాగా కంతులు పూర్తయినా పరికరాలు ఇవ్వక పోవడంతో వందగల్లు గ్రామానికి చెందిన వెంకోబ, బుడ్డమ్మ, బజారమ్మ, శివమ్మ ఆదోని చేరుకుని కార్యాలయం కోసం ఆన్వేషించారు. బ్రోచర్లో ఉన్న అడ్రస్‌లో అటువంటి కార్యాలయం లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. సంప్రదించేందుకు ఎటువంటి ఫోన్ నంబర్ లేకపోవడంతో కట్టిన సొమ్ము తిరిగి వస్తుందా లేదోనని అయోమయంలో పడ్డారు. స్థానికులు సూచన మేరకు కోసిగి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు.