ఆశ పెట్టి.. మోసగించి!
ఆశ పెట్టి.. మోసగించి!
Published Tue, Jul 18 2017 12:42 AM | Last Updated on Tue, Sep 5 2017 4:15 PM
- ఇన్‌స్టాల్‌మెంట్ స్కీమ్ అంటూ మోసం
- డిప్ తగిలితే ఎలకా్ట్రనిక్ వస్తువులు ఉచితమని ప్రచారం
- బోగస్ అడ్రస్‌తో బురిడి
ఆదోని అగ్రికల్చర్: జిల్లాలో ఎన్నో బోగస్ సంస్థలు పేదల డబ్బులు వసూలు చేసి బోర్డు తిప్పేస్తున్నా ఇంకా ప్రజల్లో చైతన్యం, అధికారుల్లో చలనం కొరవడిందని మరో సారి రుజువైంది. తాజాగా ఆదోని అడ్రస్‌తో కొందరు వ్యక్తులు ఓ బ్రోచర్‌ను ముద్రించి ఇన్‌స్టాల్‌మెంట్‌కు ఎలక్ట్రానిక్ వస్తువులు తక్కువ ధరకు ఇస్తామని పేదలను నమ్మించి భారీగా డబ్బులు వేసి చివరకు ఉడాయించారు.
కంతులు పూర్తయినా వస్తువులు ఇవ్వకపోవడంతో అనుమానంతో వచ్చి బ్రోచర్‌లో ఉన్న అడ్రస్ మేరకు విచారించగా అటువంటి కార్యాలయం లేకపోవడంతో మోసపోయినట్లు గ్రహించారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. ఆదోని పట్టణం అంబేద్కర్ నగర్ వీధిలో నివాసముంటున్నామని, శ్రీమారెమ్మ దేవీ ఇన్‌స్టాల్‌మెంట్ కంపెనీలో వారానికి కొంత మొత్తం ఇన్‌స్టాల్‌మెంటుగా చెల్లించి సభ్యులుగా చేరితే ఫ్యాన్, బీరువా, మంచాలు ఇస్తామని కొందరు వ్యక్తులు నమ్మబలికారు. డిప్ మధ్యలో తగిలితే ఆ తర్వాత కంతులు చెల్లించకుండానే వస్తువులు ఇస్తామని ఆశ పెట్టారు. ప్రొప్రెటర్‌గా నందిత అని బ్రోచర్ పేర్కొన్నారు.
అడ్రస్‌లో కార్యాలయం లేదు.. బ్రోచర్‌లో ఫోన్ నంబర్ లేదు
ఆదోని శివారు ప్రాంతం, కోసిగి మండలం వందగల్లు గ్రామంలో చాలా మందితో కంతులు కట్టించారు. వందగల్లు గ్రామంలోనే దాదాపు 60 మంది వారానికి రూ.200, రూ.500, రూ.1000 చొప్పున ఎవరికి చేతనైనంత వారు చెల్లించారు. 22 వారాలు పూర్తిగా చెల్లించిన వారికి 21 అంగుళాల కలర్ టీవీ లేదా 220 గ్రాముల బంగారు ఇస్తామని బ్రోచర్‌లో పొందుపరిచారు. మొదట రెండు మూడు వారాలు డిప్ తీసి కుక్కర్, ప్లేట్లు లాంటి చిన్న వస్తువులను అందజేశారు.
ఇది నిజమని నమ్మి చాలా మంది మహిళలు స్కీమ్‌లో చేరారు. కాగా కంతులు పూర్తయినా పరికరాలు ఇవ్వక పోవడంతో వందగల్లు గ్రామానికి చెందిన వెంకోబ, బుడ్డమ్మ, బజారమ్మ, శివమ్మ ఆదోని చేరుకుని కార్యాలయం కోసం ఆన్వేషించారు. బ్రోచర్‌లో ఉన్న అడ్రస్‌లో అటువంటి కార్యాలయం లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. సంప్రదించేందుకు ఎటువంటి ఫోన్ నంబర్ లేకపోవడంతో కట్టిన సొమ్ము తిరిగి వస్తుందా లేదోనని అయోమయంలో పడ్డారు. స్థానికులు సూచన మేరకు కోసిగి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు.
Advertisement
Advertisement