బాక్సింగ్ గ్రేట్ కుమారుడికి అమెరికాలో అవమానం
బాక్సింగ్‌కు మారుపేరైన మహ్మద్ అలీ కుమారుడికి అమెరికాలోని ఒక విమానాశ్రయంలో తీవ్ర అవమానం ఎదురైంది. జమైకా పర్యటనకు వెళ్లి అక్కడి నుంచి తిరిగి వచ్చిన ఆయనను ఫ్లోరిడా విమానాశ్రయంలో అధికారులు రెండు గంటల పాటు ప్రశ్నించారు. కేవలం ఆయనది ముస్లిం పేరు కావడమే అందుకు కారణమని అమెరికా మీడియా తెలిపింది. మహ్మద్ అలీ జూనియర్ (44) ఫిలడెల్ఫియాలో పుట్టారు. ఆయనకు అమెరికా పాస్‌పోర్టు ఉంది. తన తల్లి, మహ్మద్ అలీ రెండో భార్య అయిన ఖైలాష్ కమాచో అలీతో కలిసి అలీ జూనియర్ జమైకా వెళ్లి వచ్చారు. ఫ్లోరిడాలోని ఫోర్ట్ లాడెర్డేల్ విమానాశ్రయంలో వాళ్లిద్దరినీ రెండు గంటల పాటు ప్రశ్నించారని వాళ్ల తరఫు న్యాయవాది చెప్పారు. తన భర్తతో కలిసి ఉన్న తన ఫొటోను అధికారులకు చూపించిన తర్వాత అలీ భార్యను వదిలిపెట్టారు.
అలీ జూనియర్ వద్ద మాత్రం అప్పటికి సిద్ధంగా అలాంటి ఫొటో ఏమీ లేదు. దాంతో 'నువ్వు ముస్లింవా.. ఈ పేరు నీకు ఎలా వచ్చింది'' అటూ ప్రశ్నలు వెల్లువెత్తించారు. తన తండ్రి నుంచే తనకు ముస్లిం మతం వచ్యచిందని చెప్పినప్పుడు మరిన్ని ప్రశ్నలు వేశారు. దీన్ని బట్టి చూస్తే ట్రంప్ అధికార యంత్రాంగం ముస్లింలను అమెరికా నుంచి పంపేయాలని గట్టిగా నిర్ణయించినట్లు తెలుస్తోందని అలీ జూనియర్ న్యాయవాది మాన్సిని తెలిపారు. 20వ శతాబ్దపు క్రీడా హీరోలలో ఒకరైన మహ్మద్ అలీ (74).. సుదీర్ఘ కాలం పాటు పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడి గత జూన్ 3వ తేదీన మరణించారు. ఆయనకు మూడు ప్రపంచ హెవీవెయిట్ టైటిళ్లున్నాయి. ఇక రింగ్ బయట ఆయన పౌర హక్కుల కోసం కూడా పోరాడారు. అలాంటి దిగ్గజం కుమారుడికే ఇప్పుడు పౌర హక్కుల సమస్య ఎదురు కావడం గమనార్హం.