పాకిస్తాన్‌కు బిగ్ షాక్.. స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్
పాకిస్తాన్ స్టార్ మహిళా క్రికెటర్ నహిదా ఖాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ క్రికెట్‌కు నహిదా ఖాన్ రిటైర్మెంట్ ప్రకటించింది. 2009లో పాకిస్తాన్ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేసిన నహిదా ఖాన్ 100కి పైగా మ్యాచ్‌లు ఆడింది. అదే విధంగా అంతర్జాతీయ వన్డేల్లో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన రికార్డు నహిదా ఖాన్ పేరిటే ఉంది.
2018లో శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌లో నహిదా ఏకంగా నాలుగు క్యాచ్‌లు అందుకుంది. పాకిస్తాన్ తరపున 66 వన్డేలు, 54 టీ20లు ఆడిన నహిదా.. వరుసగా 1410, 604 పరుగులు చేసింది. 36 ఏళ్ల నహిదా మూడు వన్డే ప్రపంచకప్‌లు(2013, 2017, 2022), నాలుగు టీ20 ప్రపంచకప్‌లలో (2012, 2014, 2016 ,2018) పాకిస్తాన్ తరపున ఆడింది.
ఇక 14 ఏళ్ల ప్రయాణంలో మద్దతుగా నిలిచిన అభిమానులకు, పాక్ క్రికెట్ బోర్డుకు నహిదా ధన్యవాదాలు తెలిపింది. ఇక నహిదా ఖాన్ నిర్ణయంపై పాకిస్తాన్ ఉమెన్స్ క్రికెట్ హెడ్ తానియా మల్లిక్ స్పందించింది. పాకిస్తాన్ క్రికెట్‌కు నహిదా ఖాన్ అందించిన సేవలు ఎప్పటికీ మర్చిపోలేనవి అని తానియా పేర్కొంది. ఎంతో మంది యువ క్రికెటర్లకు నహిదా ఆదర్శంగా నిలిచిందని ఆమె తెలిపింది.
చదవండి: #DevonConway: 'టైటిల్ గెలిచిన మత్తులో ఎక్కాల్సిన ఫ్లైట్ మిస్సయ్యాం'