Inter weightage of marks
-
ఏపీ ఈఏపీసెట్‌లో ఇంటర్ వెయిటేజీ రద్దు
సాక్షి, అమరావతి: ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశానికి ఉద్దేశించిన ఏపీ ఈఏపీసెట్ 2022–23లో ఇంటర్ మార్కుల వెయిటేజీని రద్దుచేశారు. ఈఏపీ సెట్లో వచ్చిన మార్కులనే పూర్తిగా వందశాతం వెయిటేజీ కింద తీసుకోనున్నారు. ఈ మేరకు ఉన్నత విద్యామండలి కార్యదర్శి ప్రొఫెసర్ బి. సుధీర్‌ప్రేమ్‌కుమార్ మంగళవారం ప్రకటన విడుదల చేశారు. ఏపీ ఈఏపీసెట్‌లో ఇప్పటివరకు ఇంటర్ మార్కులకు 25 శాతం.. ఈఏపీసెట్‌లోని మార్కులకు 75 శాతం వెయిటేజీ ఇచ్చి విద్యార్థులకు ర్యాంకులను ప్రకటించేవారు. అయితే.. కరోనా కారణంగా ఇంటర్మీడియెట్ తరగతుల నిర్వహణకు ఆటంకాలు ఏర్పడడం, పరీక్షల నిర్వహణ కూడా అస్తవ్యస్థంగా మారడం తెలిసిందే. దీంతో ఇంటర్ బోర్డు ‘ఆల్‌పాస్’ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో.. 2021–22 ఈఏపీ సెట్లో ఇంటర్ మార్కులకు వెయిటేజీని ప్రభుత్వం రద్దు చేసింది. ప్రస్తుత సెకండియర్ ఇంటర్ విద్యార్థులకు గతేడాది పరీక్షల నిర్వహణలేక వారిని ఆల్‌పాస్‌గా ప్రకటించింది. మార్కుల బెటర్మెంట్ కోసం వారికి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించింది. ఈ పరిస్థితుల్లో ఈ విద్యా సంవత్సరం (2022–23)లో కూడా ఈఏపీసెట్‌లో ఇంటర్ మార్కులకు వెయిటేజీ ఇవ్వాలా? వద్దా అనే అంశంపై ఉన్నత విద్యామండలి ఇటీవల ప్రభుత్వానికి లేఖ రాసింది. దీనిని పరిశీలించిన ఉన్నత విద్యాశాఖ ఈసారి కూడా ఈఏపీసెట్‌లో సెట్లో వచ్చిన మార్కులకే వందశాతం వెయిటేజీ ఇచ్చి వాటి మెరిట్ ఆధారంగా ర్యాంకులు ప్రకటించాలని ఉన్నత విద్యామండలికి సూచించింది. దీంతో మండలి తాజాగా ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. 2.60 లక్షల మందికి పైగా విద్యార్థుల దరఖాస్తు ఇక ఏపీ ఈఏపీసెట్‌కు ఉన్నత విద్యామండలి ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 10వ తేదీతో ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు గడువు ముగియగా మొత్తం 2.60 లక్షల మంది దరఖాస్తు చేశారు. ఇంజనీరింగ్ స్ట్రీమ్‌కు 1,88,417 మంది, బైపీసీ స్ట్రీమ్‌కు 86వేల మందికి పైగా విద్యార్థులు దరఖాస్తు చేశారు. ఆలస్య రుసుముతో ఈ సంఖ్య మరికొంత పెరగనుంది. జూలై 4 నుంచి 8 వరకు పది సెషన్లలో ఇంజనీరింగ్ స్ట్రీమ్ విద్యార్థులకు.. అలాగే, జూలై 11, 12 తేదీల్లో నాలుగు సెషన్లలో బైపీసీ స్ట్రీమ్ విద్యార్థులకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. -
సెంట్రల్ వర్సిటీల ఎంట్రన్స్‌లో ఇంటర్ వెయిటేజి రద్దు
సాక్షి, అమరావతి: కేంద్రీయ వర్సిటీల్లో ప్రవేశాలకు ఇంటర్ మార్కులకు ఎలాంటి వెయిటేజి ఉండదని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) వెల్లడించింది. కొన్ని సెంట్రల్ వర్సిటీల్లో అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ) కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్టు (సీయూఈటీ)పై యూజీసీ ఇటీవల పబ్లిక్ నోటీసు విడుదల చేస్తూ ఈ విషయాన్ని ప్రకటించింది. సీయూఈటీ పరిధిలోకి ఈసారి 45 సెంట్రల్ వర్సిటీలు ఉన్నాయి. ఇప్పటివరకు కొన్ని వర్సిటీలు ఇంటర్ మార్కులను కూడా వెయిటేజిగా తీసుకొంటున్నాయి. ఇకపై ఇంటర్ మార్కులకు వెయిటేజి ఉండదని, ఆయా వర్సిటీలు ఇంటర్మీడియట్‌ను అర్హత పరీక్షగా మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని యూజీసీ పేర్కొంది. ప్రవేశాలు పూర్తిగా సీయూఈటీలో అభ్యర్థులకు వచ్చిన మార్కుల ఆధారంగా ఉంటాయని స్పష్టంచేసింది. అయితే, యూనివర్సిటీలో ప్రవేశానికి ఇంటర్మీడియట్ అర్హత మార్కులను ఏ మేరకు తీసుకోవాలో ఆ వర్సిటీలే నిర్ణయించుకుంటాయి. అంటే విశ్వవిద్యాలయం నిర్ణయించిన అర్హత మార్కులు పొందిన విద్యార్థులకు మాత్రమే సీయూఈటీలో వచ్చిన మెరిట్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ఇంటర్మీడియట్ (12వ తరగతి) మూల్యాంకన విధానం ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధంగా ఉండటం, కొన్ని రాష్ట్రాలు తమ విద్యార్థులకు మేలు చేసేలా ఎక్కువ మార్కులు వేస్తుండడం వల్ల వాటిని పరిగణనలోకి తీసుకోవడం సరికాదని యూజీసీ అభిప్రాయపడింది. ప్రభుత్వ, ప్రైవేటు వర్సిటీలకూ సీయూఈటీతో ప్రవేశాలకు అవకాశం 2022–23 విద్యా సంవత్సరానికి సీయూఈటీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) 13 భాషల్లో నిర్వహిస్తుంది. హిందీ, మరాఠీ, గుజరాతీ, తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం, ఉర్దూ, అస్సామీ, బెంగాలీ, పంజాబీ, ఒడియా, ఇంగ్లిష్ భాషల్లో పరీక్ష ఉంటుంది. కేంద్రీయ విశ్వవిద్యాలయాలే కాకుండా రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేటు, డీమ్డ్ యూనివర్సిటీలు కూడా సీయూఈటీని అనుసరించి ప్రవేశాలు నిర్వహించవచ్చని యూజీసీ పేర్కొంది. సీయూఈటీ ఆన్లైన్ దరఖాస్తులు ఏప్రిల్‌లో ఎన్టీఏ వెబ్సైట్లో ఉంచుతారు. పూర్తి నోటిఫికేషన్ ఎన్టీఏ విడుదల చేస్తుంది. సీయూఈటీలో మార్కుల ప్రాతిపదికగా ఎన్టీఏ మెరిట్ జాబితా విడుదల చేస్తుంది. వర్సిటీలు తమ రిజర్వేషన్ విధానాన్ని అనుసరిస్తూనే సీయూఈటీ మెరిట్ ఆధారంగా ప్రవేశాలు నిర్వహిస్తాయని యూజీసీ ప్రకటించింది. ఎన్సీఈఆర్టీ 12వ తరగతి పాఠ్యపుస్తకాల ఆధారంగా సీయూఈటీకి బహుళైచ్ఛిక విధానంలో ప్రశ్నలు ఉంటాయి. ఈ పరీక్షల్లో నెగెటివ్ మార్కులుంటాయి. తప్పుడు సమాధానాలకు మార్కుల్లో కోత పడుతుంది. -
ఏపీ ఉన్నత విద్యా మండలి కీలక నిర్ణయం
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఎంసెట్‌లో ఇంటర్ వెయిటేజ్ తొలగించింది. ప్రతీ ఏటా ఇంటర్ మార్కులు ఆధారంగా ఎంసెట్‌లో 25శాతం వెయిటేజ్ ఇస్తున్న ఉన్నత విద్యామండలి.. కోవిడ్ కారణంగా ఇంటర్ పరీక్షలు రద్దు నేపథ్యంలో ఈ ఏడాది వెయిటేజ్ తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వంద శాతం ఎంసెట్ ప్రవేశ పరీక్షలో ప్రతిభ ఆధారంగానే.. అగ్రికల్చర్, ఇంజినీరింగ్ విభాగాల్లో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు ఉన్నత విద్యామండలి వెల్లడించింది. -
ప్రైవేటు వైద్య సీట్లలో ఇంటర్ వెయిటేజీకి మంగళం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రైవేటు వైద్య, దంత కళాశాలల యాజమాన్యాల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక వైద్య ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఎం-సెట్) ద్వారా భర్తీ అయ్యే 35 శాతం యాజమాన్య వైద్య సీట్లలో ఇంటర్ మార్కుల వెయిటేజీకి మంగళం పాడారు. సాధారణ ఎంసెట్‌లో ఉన్న 25 శాతం ఇంటర్ వెయిటేజీని ప్రత్యేక ఎం-సెట్ ద్వారా భర్తీ అయ్యే యాజమాన్యాల సీట్ల విషయంలో ఎత్తివేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. సొంత పరీక్ష... అంతకుముందే సీట్ల విక్రయం... ఫీజుల పెంపు వంటి విషయాల్లో వివాదాల్లో చిక్కుకుపోయిన ప్రైవేటు కాలేజీలు.. ఇంటర్ మార్కుల వెయిటేజీని చాకచక్యంగా రద్దు చేయించుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం కూడా వారికి వత్తాసు పలకడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు మైనారిటీ వైద్య కళాశాల్లోని యాజమాన్య సీట్ల భర్తీకి ఇంటర్ మార్కుల వెయిటేజీని ఏకంగా 50 శాతం చేస్తే... నాన్ మైనారిటీ ప్రైవేటు వైద్య యాజమాన్య సీట్లలో వెయిటేజీని పూర్తిగా ఎత్తివేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఎం-సెట్ పరీక్ష జరిగి వారం కావస్తున్నా ర్యాంకింగ్ ఉంటుందా లేదా అన్న విషయంలో స్పష్టత రాకపోవడంపై విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఇంటర్ వెయిటేజీ ఉంటుందని... ఆ ప్రకారమే ర్యాంకింగ్ ఖరారు అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఎం-సెట్లోని మార్కుల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయాన్ని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌చందా ధ్రువీకరించారు. గాలికి వదిలేసిన సర్కారు ప్రత్యేక ఎం-సెట్ ముగిసినా ఇంకా కౌన్సెలింగ్ తేదీలను ఖరారు చేయలేదు. ఈ విషయంలో యాజమాన్యాలు స్పష్టత ఇవ్వడం లేదు. వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు కూడా సమాచారం లేదు. ఎం-సెట్ కన్వీనర్ ఎలా ఉంటారు? ఆయన ఫోన్ నంబర్ కూడా అధికారుల వద్ద సమాచారం లేకపోవడం విస్మయం కలిగిస్తోంది. మొదటి నుంచీ గోప్యత పాటిస్తున్న ప్రైవేటు యాజమాన్యాలు ఏ విషయాన్నీ అధికారికంగా ప్రకటించడం లేదు. వెబ్సైట్లో ప్రకటించి వదిలేస్తున్నాయి. ఇప్పటికే 35 శాతం కోటా సీట్లు అమ్మేసుకున్న యాజమాన్యాలు గోప్యత పాటిస్తూ మరిన్ని అక్రమాలకు తెరలేపుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కౌన్సెలింగ్‌కు ప్రభుత్వ ప్రతినిధి.. ప్రత్యేక ఎం-సెట్ నేపథ్యంలో జరగబోయే కౌన్సెలింగ్‌కు ప్రభుత్వం తరపున ఒక ప్రతినిధిని పంపుతామని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌చందా తెలిపారు. కౌన్సెలింగ్ తేదీలు తమకు తెలియదన్నారు.