ప్రైవేటు వైద్య సీట్లలో ఇంటర్ వెయిటేజీకి మంగళం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రైవేటు వైద్య, దంత కళాశాలల యాజమాన్యాల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక వైద్య ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఎం-సెట్) ద్వారా భర్తీ అయ్యే 35 శాతం యాజమాన్య వైద్య సీట్లలో ఇంటర్ మార్కుల వెయిటేజీకి మంగళం పాడారు. సాధారణ ఎంసెట్‌లో ఉన్న 25 శాతం ఇంటర్ వెయిటేజీని ప్రత్యేక ఎం-సెట్ ద్వారా భర్తీ అయ్యే యాజమాన్యాల సీట్ల విషయంలో ఎత్తివేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
సొంత పరీక్ష... అంతకుముందే సీట్ల విక్రయం... ఫీజుల పెంపు వంటి విషయాల్లో వివాదాల్లో చిక్కుకుపోయిన ప్రైవేటు కాలేజీలు.. ఇంటర్ మార్కుల వెయిటేజీని చాకచక్యంగా రద్దు చేయించుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం కూడా వారికి వత్తాసు పలకడంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు మైనారిటీ వైద్య కళాశాల్లోని యాజమాన్య సీట్ల భర్తీకి ఇంటర్ మార్కుల వెయిటేజీని ఏకంగా 50 శాతం చేస్తే... నాన్ మైనారిటీ ప్రైవేటు వైద్య యాజమాన్య సీట్లలో వెయిటేజీని పూర్తిగా ఎత్తివేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇక ఎం-సెట్ పరీక్ష జరిగి వారం కావస్తున్నా ర్యాంకింగ్ ఉంటుందా లేదా అన్న విషయంలో స్పష్టత రాకపోవడంపై విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఇంటర్ వెయిటేజీ ఉంటుందని... ఆ ప్రకారమే ర్యాంకింగ్ ఖరారు అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఎం-సెట్‌లోని మార్కుల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయాన్ని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌చందా ధ్రువీకరించారు.
గాలికి వదిలేసిన సర్కారు
ప్రత్యేక ఎం-సెట్ ముగిసినా ఇంకా కౌన్సెలింగ్ తేదీలను ఖరారు చేయలేదు. ఈ విషయంలో యాజమాన్యాలు స్పష్టత ఇవ్వడం లేదు. వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు కూడా సమాచారం లేదు. ఎం-సెట్ కన్వీనర్ ఎలా ఉంటారు? ఆయన ఫోన్ నంబర్ కూడా అధికారుల వద్ద సమాచారం లేకపోవడం విస్మయం కలిగిస్తోంది. మొదటి నుంచీ గోప్యత పాటిస్తున్న ప్రైవేటు యాజమాన్యాలు ఏ విషయాన్నీ అధికారికంగా ప్రకటించడం లేదు. వెబ్‌సైట్లో ప్రకటించి వదిలేస్తున్నాయి. ఇప్పటికే 35 శాతం కోటా సీట్లు అమ్మేసుకున్న యాజమాన్యాలు గోప్యత పాటిస్తూ మరిన్ని అక్రమాలకు తెరలేపుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కౌన్సెలింగ్‌కు ప్రభుత్వ ప్రతినిధి..
ప్రత్యేక ఎం-సెట్ నేపథ్యంలో జరగబోయే కౌన్సెలింగ్‌కు ప్రభుత్వం తరపున ఒక ప్రతినిధిని పంపుతామని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌చందా తెలిపారు. కౌన్సెలింగ్ తేదీలు తమకు తెలియదన్నారు.