ఇంటర్ ప్రైవేటు విద్యార్థులకు హాజరు మినహాయింపు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాయాలనుకునే ప్రైవేటు ఆర్ట్స్ విద్యార్థులకు హాజరు మినహాయింపు సదుపాయం కల్పిస్తున్నట్లు ఇంటర్మీడియెట్ బోర్డు శనివారం ప్రకటి ంచింది. హాజరు మినహాయింపు కోరుకునే అభ్యర్థులు రూ. 500 ఫీజు చెల్లించి ఏప్రిల్ 10వ తేదీ లోగా ఇంటర్ బోర్డు సెక్రటరీకి దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్హతలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు సరిగా లేకున్నా, వివరాలు అసంపూర్తిగా ఉన్న దరఖాస్తులను తిరస్కరిస్తారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కాకుండా ఇతర రాష్ట్రాల్లో పదో తరగతి చదివిన వారు తప్పనిసరిగా మైగ్రేషన్ సర్టిఫికెట్ జతపరచాల్సి ఉంటుంది. 10వ తరగతి పాసై ఏడాది గడిచిన అభ్యర్థులు నేరుగా ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు, రెండేళ్లు గ్యాప్ ఉన్న వారు ఒకేసారి ఫస్టియర్, సెకండియర్ పరీక్షలు రాయవచ్చు. ఇంటర్ బైపీసీతో పరీక్షలు రాసిన విద్యార్థులు మేథమేటిక్స్ సబ్జెక్టును కూడా రాయాలనుకుంటే దరఖాస్తు చేసుకోవచ్చు. www.bie.telangana.gov.in వెబ్సైట్ నుంచి దరఖాస్తు ఫారాలను విద్యార్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చు.