చాకోబార్... తింటే హూషార్..
సెప్టెంబర్ 13 ఇంటర్నేషనల్ చాక్లెట్ డే సందర్భంగా
చిన్నారులు మారాం చేస్తున్నారా..? చక్కగా చాక్లెట్ తినిపించండి. మీకే మూడ్ బాగాలేదా..? మరేం ఫర్వాలేదు... శుభ్రంగా చాక్లెట్ తినండి. జోష్ తగ్గినా, జోరు తగ్గినా... బేఫికర్‌గా చాక్లెట్ తినండి... హుషారు గ్యారంటీ!
చాక్లెట్లు అల్ట్రామోడర్న్గా కనిపిస్తాయే గాని, వాటి వెనుక మూడువేల సంవత్సరాల నేపథ్యం ఉంది. క్రీస్తుకు 1400 సంవత్సరాల పూర్వమే అజ్టెక్లు కోకో వాడుకను కనుగొన్నారు. మాయన్ నాగరికత కాలంలోనూ కోకో వినియోగంలో ఉండేదనేందుకు ఆధారాలు ఉన్నాయి. అప్పట్లో వాళ్లు కోకో గింజలతో పానీయం తయారు చేసుకునేవారు.
అప్పటి అజ్టెక్ సామ్రాజ్యం మెసోఅమెరికన్ ప్రాంతంలో... అంటే ఇప్పటి మెక్సికో, గ్వాటెమాలా, ఎల్ సాల్వడార్, హోండురాస్, నికరగ్వా తదితర దేశాల వరకు విస్తరించి ఉండేంది. అక్కడి అడవుల్లో కోకో చెట్లు విరివిగా ఉండేవి. అజ్టెక్లు కోకో గింజలను ముద్దలా నూరుకుని నీటిలో కలిపి, ఆ పానీయాన్ని కాస్త పులియబెట్టిన తర్వాత తాగేవారు. దీనిని వారు దేవతా పానీయంగా భావించేవారు. కోకో గింజలకు ఔషధ గుణాలు ఉండేవని నమ్మేవారు. వారి నమ్మకంలో నిజం లేకపోలేదని ఆధునిక పరిశోధకులు కూడా గుర్తించారు. అజ్టెక్లు, మాయన్లు కోకో గింజలను కరెన్సీగా కూడా ఉపయోగించేవారు. కోకో గింజల మహత్తు చాలాకాలం వరకు బయటి ప్రపంచానికి తెలియకుండానే ఉండిపోయింది.
కోకో... కొలంబస్...
కొలంబస్ అనే మగానుభావుడి పుణ్యాన అమెరికా ఉనికి మాత్రమే కాదు, కోకో గింజల మహత్తు కూడా బయటి ప్రపంచానికి తెలిసింది. క్రీస్తుశకం 1502లో కొలంబస్ అమెరికా వెళ్లినప్పుడు అక్కడ మొదటిసారిగా కోకోతో తయారు చేసే చాక్లెట్ పానీయాన్ని రుచి చూశాడు. కోకో గింజల గురించి, అక్కడి కోకో చెట్ల గురించి తెలుసుకున్నాడు. అనతి కాలంలోనే స్పానిష్ వలస పాలకుల కారణంగా చాక్లెట్ పానీయం స్పెయిన్‌కు, ఆ తర్వాత మిగిలిన యూరోపియన్ ప్రాంతాలకు పరిచయమైంది.
ఘనీభవనమే కీలక పరిణామం
దాదాపు పంతొమ్మిదో శతాబ్ది వరకు కోకో గింజలతో చాక్లెట్ పానీయమే వాడుకలో ఉండేది. కాఫీ, టీ మాదిరిగానే చాక్లెట్ పానీయాన్ని తాగేవారు. అయితే, స్విస్ కంపెనీ ‘లింట్ అండ్ స్ప్రంగ్లి ఏజీ’ తొలిసారిగా 1845లో చాక్లెట్‌ను ఘనరూపంలో తయారు చేయడం ప్రారంభించింది. చాక్లెట్ బార్లు ఎక్కువకాలం నిల్వ ఉండటం, వాటికి అదనంగా తీపి రుచి చేర్చడంతో త్వరలోనే ఇవి ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి. చాక్లెట్ పానీయంగా కంటే చాక్లెట్ బార్లే విపరీతంగా జనాదరణ పొందాయి. పారిశ్రామిక విప్లవంతో రకరకాల ఆకారాల్లో, రకరకాల పరిమాణాల్లో చాక్లెట్ల తయారీ పుంజుకుంది. చాక్లెట్‌తో కళాకృతులు తయారుచేసి సంబరపడే కళాపోషకులూ పెరిగారు. అజ్టెక్ల హయాంలో మెసోఅమెరికన్ ప్రాంతాలు కోకో పంటకు ఆలవాలంగా ఉంటూ వచ్చినా, ఇప్పుడు మాత్రం కోకో ఉత్పత్తిలో పశ్చిమాఫ్రికా దేశాలదే ఆధిపత్యం.
చాక్లెట్టా... మజాకా!
చాక్లెట్‌లోని రసాయనాలు నేరుగా భావోద్వేగాలపై ప్రభావం చూపుతాయి. దిగులు, స్తబ్దత వంటి ప్రతికూల భావోద్వేగాలను పారదోలి ఉత్సాహాన్ని కలిగిస్తాయి. కోకో గింజల్లోని ట్రిప్టోఫాన్ అనే రసాయనం మెదడుపై చూపే ప్రభావం వల్ల చాక్లెట్ తీసుకుంటే సంతోషంగా అనిపిస్తుందని పలు పరిశోధనల్లో తేలింది.
కోకో గింజల్లోని ‘ఫినైల్ ఈథైలమిన్’ అనే రసాయనం వల్ల చాక్లెట్ తిన్న వెంటనే అలజడి, ఆందోళన సద్దుమణిగి, మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. సానుకూల భావోద్వేగాలు పెరుగుతాయి.
చాక్లెట్లు తినొద్దంటూ చాలామంది పెద్దలు పిల్లలను వారిస్తూ ఉంటారు. ఎందుకొద్దని ప్రశ్నిస్తే, పిప్పిపళ్లు వస్తాయని చెబుతుంటారు. అయితే, అదంతా అపోహ మాత్రమే. నిజానికి చాక్లెట్లు దంతక్షయాన్ని నిరోధిస్తాయని, కోకో గింజల్లోని రసాయనాలు నోట్లోని హానికరమైన బ్యాక్టీరియాను అరికడతాయని కూడా పరిశోధనల్లో తేలింది.
రోజూ 12 గ్రాముల బరువుండే చాక్లెట్బార్ తింటూ ఉంటే, క్రమంగా రక్తపోటు అదుపులోకి వస్తుంది. చాక్లెట్లలో పుష్కలంగా లభించే మెగ్నీషియం ప్రభావం వల్ల టైప్-2 డయాబెటిస్, గుండెజబ్బుల ముప్పు కూడా గణనీయంగా తగ్గుతాయని పలు పరిశోధనలు చెబుతున్నాయి.
చాక్లెట్లలో ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది. రక్తహీనతతో బాధపడేవారికి చాక్లెట్ చక్కని ఔషధంలా పనిచేస్తుంది. చాక్లెట్లలో ఉండే రాగి వల్ల పక్షవాతం, గుండెజబ్బుల ముప్పు తగ్గుతుందని కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
విస్తీర్ణంలో అతిపెద్ద చాక్లెట్బార్
ప్రపంచంలోనే అత్యంత సువిశాలమైన చాక్లెట్ బార్ ఇది. స్లోవేనియాలోని రాడోవ్జికా నగరంలో కోకోలాడ్నికా కక్రెక్ సంస్థ దీనిని రూపొందించింది. ఈ ఏడాది ఏప్రిల్ 15న ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దీనిని ప్రదర్శించింది. ఈ కార్యక్రమానికి స్లోవేనియా ప్రధాని కూడా హాజరయ్యారు. దీని విస్తీర్ణం దాదాపు రెండు సాదాసీదా అపార్ట్మెంట్ ఫ్లాట్లంత ఉండటంతో దీనిని తిలకించిన జనాలు నోళ్లెళ్లబెట్టారు. దీని విస్తీర్ణం ఎంతంటారా..? కేవలం 1531.9 చదరపు మీటర్లు మాత్రమే. విస్తీర్ణంలో అత్యంత పెద్ద చాక్లెట్బార్గా ఇది గిన్నెస్‌బుక్‌లోకి ఎక్కింది.
అత్యంత బరువైన చాక్లెట్బార్
ప్రపంచంలోనే అత్యంత బరువైన చాక్లెట్ బార్ ఇది. దీనిని తరలించాలంటే మనుషుల వల్ల కాదు. క్రేన్ల సాయం తీసుకోవాల్సిందే! బ్రిటన్‌లోని డెర్బీషైర్‌కు చెందిన థార్న్టన్స్ సంస్థ దీనిని తయారు చేసింది. నాలుగు మీటర్ల పొడవు, నాలుగు మీటర్ల వెడల్పు, 0.35 మీటర్ల మందం గల ఈ భారీ చాక్లెట్ బార్‌ను 2011 అక్టోబర్ 7న ప్రదర్శనకు ఉంచింది. దీని బరువు 5,792.5 కిలోలు. అత్యంత బరువైన చాక్లెట్‌గా ఇది గిన్నెస్ రికార్డు సాధించింది.