International hockey tournament
-
‘షూటౌట్’లో భారత పురుషుల హాకీ జట్టు గెలుపు!
అంట్వర్ప్ (బెల్జియం): అంతర్జాతీయ హాకీ సమాఖ్య ప్రొ లీగ్‌లో భారత జట్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల జట్టు ‘షూటౌట్’లో 5–4తో అర్జెంటీనాపై నెగ్గింది. నిర్ణీత సమయం ముగిసే సరికి ఇరుజట్లు 2–2తో సమంగా నిలిచాయి.భారత్ తరఫున మన్దీప్ (11వ ని.లో), లలిత్ (55వ ని.లో)... అర్జెంటీనా తరఫున మార్టినెజ్ (20వ ని.లో), థామస్ డొమినె (60వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. ‘షూటౌట్’లో హర్మన్‌ప్రీత్, సుఖ్జీత్ చెరో రెండు గోల్స్ చేయగా, అభిషేక్ ఒక గోల్ చేశాడు. రాజ్‌కుమార్, లలిత్ విఫలమయ్యారు.ప్రత్యర్థి జట్టులో మైకో రెండు గోల్స్ కొట్టగా, లుకాస్, టోబియస్ ఒక్కో గోల్ చేశారు. ముగ్గురు విఫలమవడంతో భారత్ నెగ్గింది. ఇదే వేదికపై జరిగిన మరో మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 0–5 గోల్స్‌తో అర్జెంటీనా చేతిలో ఓడింది.ఇవి చదవండి: ప్రిక్వార్టర్స్‌లో సింధు -
రెండోసారీ రన్నరప్‌తో సరి
హామిల్టన్: నాలుగు దేశాల అంతర్జాతీయ హాకీ రెండో అంచె టోర్నమెంట్లోనూ భారత్ రన్నరప్‌గా నిలిచింది. ప్రపంచ మూడో ర్యాంకర్ బెల్జియంతో ఆదివారం జరిగిన ఫైనల్లో టీమిండియా పెనాల్టీ షూటౌట్లో 0–3తో పరాజయం పాలైంది. తొలి అంచె టోర్నమెంట్ ఫైనల్లోనూ భారత్‌కు బెల్జియం చేతిలో ఓటమి ఎదురైన సంగతి విదితమే. రెండో అంచె టోర్నీ లీగ్ దశలో బెల్జియంపై సంచలన విజయం సాధించిన భారత్ ఈసారి ఫైనల్లోనూ ఆ జట్టుకు గట్టిపోటీనే ఇచ్చింది. నిర్ణీత సమయానికి రెండు జట్లు 4–4తో సమఉజ్జీగా నిలువడంతో ఫలితం తేలడానికి షూటౌట్‌ను నిర్వహించారు. షూటౌట్లో బెల్జియం తరఫున ఫెలిక్స్, సెబాస్టియన్, అర్థుర్ వాన్ డోరెన్ సఫలమయ్యారు. భారత్ తరఫున ఎవరూ గోల్ చేయలేదు. అంతకుముందు నిర్ణీత సమయంలో రెండు జట్లు నువ్వా నేనా అన్నట్లుగా తలపడ్డాయి. పోటా పోటీగా సాగిన పోరులో ఎక్కువ శాతం భారత్‌దే పైచేయి అయింది. భారత్ తరఫున రమణ్‌దీప్ సింగ్ (29వ, 53వ ని.లో) రెండు గోల్స్, నీలకంఠ శర్మ (42వ ని.లో), మన్దీప్ సింగ్ (49వ ని.లో) చెరో గోల్ చేశారు. బెల్జియం తరఫున తాంగై కాసిన్స్ (41వ ని.లో), కెడ్రిక్ చార్లైర్ (43వ ని.లో), అమౌరి కౌస్టర్స్ (51వ ని.లో), ఫెలిక్స్ (56వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. -
ఓటమితో ముగింపు
డసెల్డార్ఫ్ (జర్మనీ): మూడు దేశాల అంతర్జాతీయ హాకీ టోర్నమెంట్‌ను భారత పురుషుల జట్టు ఓటమితో ముగించింది. జర్మనీతో మంగళవారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 0–2 గోల్స్ తేడాతో ఓడిపోయింది. జర్మనీ తరఫున ఒలెప్రింజ్ (7వ నిమిషంలో), హెర్జ్‌బ్రచ్ (60వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. మూడో జట్టుగా బెల్జియం బరిలోకి దిగిన ఈ టోర్నీలో జర్మనీ మొత్తం ఏడు పాయింట్లతో విజేతగా నిలిచింది. భారత్ ఒక విజయం, ఒక ‘డ్రా’తో నాలుగు పాయింట్లు సాధించి మూడో స్థానంతో సరిపెట్టుకుంది. రెండు విజయాలు సాధించిన బెల్జియం ఆరు పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకుంది. -
భారత్‌కు ఆరో స్థానం
హాస్టింగ్స్(న్యూజిలాండ్): హాక్స్‌బే కప్ అంతర్జాతీయ హాకీ టోర్నమెంట్లో భారత మహిళల జట్టు ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. 5-6 స్థానాల కోసం ఆదివారం జరిగిన వర్గీకరణ పోరులో భారత్ ‘పెనాల్టీ షూటౌట్’లో 3-4 గోల్స్ తేడాతో ఐర్లాండ్ చేతిలో ఓటమి పాలైంది. తుదివరకు పోటాపోటీగా సాగిన ఈ మ్యాచ్‌లో నిర్ణీత సమయం ముగిసే సరికి ఇరుజట్లు 2-2 తో సమవుజ్జీలుగా నిలిచాయి. దీంతో పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. ఇందులోనూ భారత క్రీడాకారిణులు విఫలమయ్యారు. మొత్తం ఎనిమిది జట్లు పాల్గొన్న ఈ టోర్నీలో న్యూజిలాండ్ విజేతగా నిలిచింది. ఫైనల్లో న్యూజిలాండ్ 3-2తో జపాన్‌పై గెలిచింది.