రాజన్.. రాత మారుస్తారా!
ముంబై: రిజర్వ్ బ్యాంక్ కొత్త గవర్నర్‌గా నియమితులైన రఘురామ్ రాజన్ ప్రస్తుత ఆర్థిక మందగమనం నుంచి భారత్‌ను బైటపడేస్తారని ఆర్థికవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వానికి, రిజర్వ్ బ్యాంక్‌కు మధ్య మంచి సమన్వయం నెలకొనేలా ఆయన చూడగలరని వారు విశ్వసిస్తున్నారు. అయితే విధాన నిర్ణయాల్లో రాజన్ ఎలాంటి మార్పులు తెస్తారో ముందే వ్యాఖ్యానించడం తొందరపాటవుతుందని వీరు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఆర్థిక మంత్రిత్వ శాఖకు ముఖ్య సలహాదారుగా పనిచేస్తున్న రాజన్ ఆర్బీఐ 23వ గవర్నర్‌గా నియమితులైన విషయం తెలిసిందే.
అక్కరకు అనుభవం: ప్రస్తుత ఆర్థిక అనిశ్చిత పరిస్థితుల్లో రాజన్ నియామకం ఆశలు రేకెత్తించేదిగా ఉందని క్రెడిట్ సూసీ డెరైక్టర్(ఏషియన్ ఎకనామిక్స్ రీసెర్చ్) రాబర్ట్ ప్రియర్-వాండెస్ఫోర్డే వ్యాఖ్యానించారు. అవసరమైన నిర్ణయాలను త్వరితంగా తీసుకోవలసిన అవసరం ఇప్పుడుందని ఆయన చెప్పారు. ఆర్థిక మంత్రిత్వ శాఖలో పనిచేసిన అనుభవం కారణంగా ప్రభుత్వానికి, రిజర్వ్ బ్యాంక్‌కు మధ్య రాజన్ మంచి సమన్వయం సాధించగలరని నొముర ఫైనాన్షియల్ అడ్వైజరీ అండట్ సెక్యూరిటీస్ ఎకనామిస్ట్ సోనాల్ వర్మ చెప్పారు. మార్కెట్లు సానుకూలం
రాజన్ నియామకం పట్ల మార్కెట్లు కూడా సానుకూలంగా స్పందించాయని డీబీఎస్ బ్యాంక్ ఎకనామిస్ట్ రాధికా రావు విశ్లేషించారు.