ఆ సిమ్కార్డ్ పనిచేయకపోతే భారీ పెనాల్టీ
న్యూఢిల్లీ: టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఇంటర్నేషనల్ రోమింగ్ సిమ్ కార్డ్, గ్లోబల్ కార్డ్ ప్రొవైడర్లకు భారీ షాక్ ఇచ్చింది. ఈమేరకు టెలికాం డిపార్ట్మెంట్ (డాట్)కు కీలక ప్రతిపాదనలు చేసింది.అంతర్జాతీయ సిమ్ కార్డు విఫలమైతే రూ. 5వేల నష్టపరిహారం చెల్లించాలని రికమెండ్ చేసింది. w పెనాల్టీ తోపాటు, కస్టమర్ చెల్లించిన ఫీజును 15రోజుల్లో వారికి చెల్లించాలని ప్రతిపాదించింది.
ఖాతాదారుల విదేశీ ప్రయాణాల్లో సర్వీసుల్లో సేవల్లో అంతరాయం కలిగితే ప్రిపెయిడ్, పోస్ట్ పెయిడ్ ఖాతాదారులకు ఈ పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుందని సూచించింది. అంతేకాదు ఆయా సర్వీసు ప్రొవైడర్ల అనుమతిని రద్దు చేయాలని కూడా సూచించింది. విక్రయించిన మొత్తం అంతర్జాతీయ సిమ్ కార్డులలో 10 శాతం పనిచేయకపోతే అటువంటి కంపెనీల అనుమతి రద్దు చేయవచ్చని కూడా రెగ్యులేటరీ సూచించింది. ఈ మేరకు అంతర్జాతీయ సిమ్ కార్డు విక్రేతలు గ్రీవెన్స్ రెడ్రెస్సల్ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని రెగ్యులేటర్ సిఫార్సు చేసింది. తద్వారా కస్టమర్ల ఫిర్యాదులను సతర్వమే పరిష్కరించాలని కోరింది.
అలాగే డిజిటల్ మోడ్లో మాత్రమే అంతర్జాతీయ కాలింగ్ కార్డులను, అంతర్జాతీయ సిమ్ కార్డులను కొనుగోలు చేయాలని ట్రాయ్ సిఫార్సు చేసింది. ముఖ్యంగా నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ లేదా డెబిట్ కార్డు, ఇ-వాలెట్ ద్వారా ఈ కోనుగోళ్లు చేయాలని కోరింది. మరోవైపు ఈ సమస్యపై చర్చల పిలుపునకు స్పందించని 23 కంపెనీల అనుమతి రద్దు చేయాలని కూడా ట్రాయ్ ఆలోచిస్తోంది.
కాగా ఈ కార్డులపై ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలోఇటీవల రెగ్యులేటర్ నిర్వహించిన ఎస్ఎంస్ ఆధారిత సర్వే లో దాదాపు సగం మంది వినియోగదారుల ఇంటరర్నేషనల్ కార్డు సేవలు అస్సలు పనిచేయకపోవడం లేదా పాక్షికంగా పని చేస్తున్నాయని తేలింది. దీంతో ట్రాయ్ ఇంటర్నేషనల్ రోమింగ్ సిమ్ కార్డ్, గ్లోబల్ కార్డ్ ప్రొవైడర్లతో చర్చలు నిర్వహించింది.