Internet banking services
-
బ్యాంకింగ్ వ్యవస్థలోకి పోస్టాఫీస్ బ్యాంక్
ముంబై, సాక్షి: సుమారు 150 ఏళ్ల చరిత్ర కలిగిన పోస్టల్ శాఖ 2020లో అత్యంత కీలకంగా వ్యవహరించింది. కోవిడ్-19 తలెత్తడంతో దేశవ్యాప్తంగా లాక్డవున్లు అమలయ్యాయి. ఈ సమయంలో వైమానిక, రైల్వే, రోడ్డు రవాణా దాదాపుగా నిలిచిపోయినప్పటికీ పోస్టల్ శాఖ పలు సర్వీసులు అందించింది. ప్రధానంగా మెడికల్ తదితర కీలకమైన పార్సిల్ డెలివరీలలో ముందు నిలిచింది. లాక్‌డవున్ సమయంలో 10 లక్షల మెడికల్ ఆర్టికల్స్‌ను డెలివరీ చేసింది. వీటిలో మెడికల్ పరికరాలు, వెంటిలేటర్లు, పీపీఈ కిట్లు, ఔషధాలున్నాయి. ఈ బాటలో పార్సిల్ హ్యాండ్లింగ్ సామర్థ్యాన్ని 2020 డిసెంబర్‌కల్లా వార్షికంగా 6 కోట్ల నుంచి 7.5 కోట్లకు పెంచుకుంది. కాగా.. ఈ ఏడాది(20201) ఏప్రిల్‌కల్లా పోస్టాఫీస్ సేవింగ్స్ బ్యాంక్.. దేశంలోని ఇతర బ్యాంకు ఖాతాలతో కలసికట్టుగా నిర్వహించేందుకు వీలు కలగవచ్చని పీఎస్‌యూ దిగ్గజం ఇండియా పోస్ట్ భావిస్తోంది. ఇందుకు వీలుగా ఇటీవల పలు సర్వీసులను డిజిటైజేషన్ బాట పట్టించిన పోస్టల్ శాఖ 2021లో అన్ని సర్వీసులనూ ఆన్లైన్ చేయాలని భావిస్తోంది. (తొలుత మనకే వ్యాక్సిన్లు: సీరమ్) 50 కోట్ల ఖాతాలు పోస్ట్ ఆఫీస్‌కు కీలకమైన బ్యాంకింగ్ సొల్యూషన్(సీబీఎస్) ప్రపంచంలోనే అతిపెద్ద నెట్‌వర్క్‌ను కలిగి ఉన్నట్లు పోస్టల్ శాఖ సెక్రటరీ ప్రదీప్త కుమార్ తాజాగా పేర్కొన్నారు. 23,483 పోస్టాఫీసులు ఇప్పటికే ఈ నెట్వర్క్ పరిధిలోకి చేరినట్లు తెలియజేశారు. దేశవ్యాప్తంగా 1.56 లక్షల పోస్టాఫీసులున్నాయి. వీటి ద్వారా పోస్టాఫీస్ సేవింగ్స్ బ్యాంక్‌లో 50 కోట్లమందికి ఖాతాలున్నాయి. పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లావాదేవీల నిర్వహణకు 1.36 లక్షల యాక్సెస్ పాయింట్లను ఏర్పాటు చేసింది. తద్వారా గ్రామీణ ప్రాంతాలలోనూ ఇంటివద్దనే బ్యాంకింగ్ సర్వీసులను అందిస్తోంది. (4 నెలల గరిష్టానికి రూపాయి) పలు పథకాలు పోస్టాఫీస్ పొదుపు పథకాలలో భాగంగా సేవింగ్స్ ఖాతా, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సుకన్య సమృద్ధి(ఎస్ఎస్వై), నేషనల్ సేవింగ్(ఎన్ఎస్సీ), కిసాన్ వికాస్ పత్ర, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ తదితరాలను అందిస్తున్న విషయం విదితమే. ఈ పథకాల కింద రూ. 10,81,293 కోట్ల ఔట్‌స్టాండింగ్ బ్యాలన్స్‌ను కలిగి ఉంది. సీబీఎస్ ద్వారా 24 గంటలూ ఏటీఎం, ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్‌కు వీలు కల్పిస్తోంది. పీవోఎస్‌బీ పథకాలన్నిటినీ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకుకు అనుసంధానించింది. దీంతో మొబైల్ యాప్ డాక్‌పే ద్వారా లావాదేవీల నిర్వహణకు వీలు కల్పించింది. మొబైల్ యాప్ పోస్ట్‌మ్యాన్ మొబైల్ యాప్‌లో 1.47 పీవోఎస్‌లను భాగం చేసింది. తద్వారా 14 కోట్ల స్పీడ్ పోస్ట్, రిజిస్టర్డ్ పార్సిల్ ఆర్టికల్స్ స్టేటస్‌ను వాస్తవిక సమాయానుగుణంగా పరిశీలించేందుకు వీలు కల్పించింది. డాక్ఘర్ నిర్యత్ కేంద్ర పేరుతో ఈకామర్స్కూ మద్దతు పలుకుతోంది. తద్వారా ఎంఎస్ఎంఈ ప్రొడక్టుల ఎగుమతులకు ప్రోత్సాహాన్నిస్తోంది. అంతేకాకుండా పోస్టల్ జీవిత బీమా, ప్రభుత్వ పథకాల లబ్దిదారులకు ప్రత్యక్ష చెల్లింపులు తదితరాలలో గ్రామీణ ప్రాంతాలనూ డిజిటలైజేషన్లో భాగం చేస్తోంది. -
ఎస్ బ్యాంక్ ఇంటర్నెట్ సేవలు 4రోజులు బంద్
ముంబై: ప్రముఖ ప్రయివేట్ బ్యాంక్ ఎస్ బ్యాంక్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు తాత్కాలికంగా అందుబాటులో ఉండవట. సిస్టం అప్‌గ్రేడేషన్ కారణంగా తమ ఇంటర్నెట్ సేవలకు తాత్కాలికంగా అంతరాయం కలగనున్నట్టు సంస్థ తెలిపింది. తమ ఖాతాదారులకు మరింత ఉన్నతమైన బ్యాంకింగ్ అనుభవాన్ని అందించే దిశగా సిస్టంను అప్ గ్రేడ్ చేస్తున్న కారణంగా నాలుగురోజుల పాటు తమ సేవలు అందుబాటులో ఉండవని ఇ-మెయిల్ నోటిఫికేషన్ ద్వారా వినియోగదారులకు బ్యాంకు సమాచారం అందించింది. ఫిబ్రవరి 6 సోమవారం ఉదయం 9గంటల నుంచి ఫిబ్రవరి 13వతేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు తమ సేవలు అందుబాటులో ఉండవని ఎస్ బ్యాంక్ చెప్పింది. ముఖ్యంగా నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఎలక్ట్రానిక్ చెల్లింపులు (NEFT / RTGS / IMPS), ఎస్ ఎమ్ ఎస్ బ్యాంకింగ్, ఎస్ఎస్డి లాంటి బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండవు. ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామనీ, ఖాతాదారుల పూర్తి సహకారాన్ని అభ్యర్థిస్తున్నామని యెస్ బ్యాంక్ ఇ-మెయిల్ నోటిఫికేషన్ లో తెలిపింది. -
చుక్కలు చూపిస్తున్న ఆన్లైన్ ఎస్బీఐ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆన్లైన్ ఖాతాదారులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మూడు రోజులుగా చుక్కలు చూపిస్తోంది. ఆన్లైన్ఎస్బీఐ డాట్‌కామ్ ద్వారా అందిస్తున్న ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు సరిగా పనిచేయకపోవడంతో మూడు రోజులుగా వివిధ బిల్లులు చెల్లించడానికి, నగదు బదిలీలు చేయడానికి ప్రయత్నించిన కస్టమర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటికి తోడు అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపులకు డిసెంబర్ 15వ తేదీ ఆఖరు తేదీ కావటంతో... మంగళవారం రోజున పెద్ద ఎత్తున కస్టమర్లు వీటిని ఆన్లైన్లో చెల్లించడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. ‘‘కొన్ని రోజులుగా ఎస్బీఐ ఆన్లైన్ సేవలు సరిగా పనిచేయడం లేదు. సరే! అదే సర్దుబాటు అవుతుందిలే అని ఊరుకున్నాం. కానీ అడ్వాన్స్ ట్యాక్స్ చివరి రోజున వెబ్సైట్ పూర్తిగా పనిచేయకపోవడంతో ముందస్తు ట్యాక్స్ సకాలంలో చెల్లించలేకపోయా’’ అని ఓ వ్యాపారి ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధి వద్ద వాపోయారు. అలాగే ఈఎంఐలు వంటి ఇతర చెల్లింపులు చేయలేకపోవడంతో పెనాల్టీల వాత పడుతుందన్న ఆందోళనను పలువురు ఖాతాదారులు వ్యక్తం చేశారు. వీటిపై బ్యాంకు ఉన్నతాధికారి ఒకరిని ‘సాక్షి’ సంప్రతించగా... గత కొన్ని రోజులుగా ఆన్లైన్ బ్యాంకింగ్‌లో ఇబ్బందులు ఎదురవుతున్న మాట వాస్తవమేనని అంగీకరించారు. ‘‘వీటిని సరిదిద్దడానికి ముంబైలోని బృందం యుద్ధప్రాతిపదికన కృషి చేస్తోంది. ప్రస్తుతం ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు అందుతున్నాయి కానీ మధ్యమధ్యలో ఆగిపోతున్నాయి. మంగళవారం అర్థరాత్రిలోగా ఈ సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉంది’’ అని వివరించారు. సకాలంలో చెల్లింపులు చేయలేని వారిపై పెనాల్టీలు విధించకూడదన్న దానిపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. బ్యాంక్ తప్పిదం వల్ల చెల్లింపులు చేయలేకపోవడంతో పెనాల్టీ విధించకుండా బ్యాంకు తగు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు.