విదేశాల్లోని వారికి నగదు పంపాలా?
అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం కొనసాగుతూనే ఉంది. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోయి రెండు నెలలకుపైనే అవుతోంది. దీంతో విదేశీ పర్యటనలకు వెళ్లిన వారు, ఉపాధి ఇతర అవసరాల కోసం వెళ్లిన భారతీయులు తిరిగి రావాలనుకుంటున్నా.. రాలేని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో అక్కడి వారికి ఆర్థిక సాయం అవసరం కావచ్చు. ‘స్వేచ్ఛాయుత చెల్లింపుల పథకం’ (ఎల్ఆర్ఎస్) కింద భారతీయులు (మైనర్లు కూడా) ఒక ఆర్థిక సంవత్సరంలో 2,50,000 డాలర్లను విదేశాల్లో ఉన్న తమ సన్నిహితుల కోసం పంపుకోవచ్చు. విదేశీ విద్య, నిర్వహణ ఖర్చులు, బహుమతులు, విరాళాలు, పర్యటన ఖర్చులు తదితర అవసరాల కోసం నగదు పంపుకునేందుకు (ఫారిన్ అవుట్వార్డ్ రెమిటెన్స్) నిబంధనలు అనుమతిస్తున్నాయి. ఇంటి నుంచే ఈ లావాదేవీలను సులువుగా చేసుకునే అవకావం కూడా ఉంది.
చాలా బ్యాంకులు ఇంటర్నెట్ బ్యాంకింగ్ సాయంతో విదేశాల్లోని వారికి నగదు పంపుకునేందుకు (ఫారిన్ రెమిటెన్స్) అనుమతిస్తున్నాయి. కాకపోతే ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలకు నమోదు చేసుకుని ఉండాలి. ఎస్బీఐ వంటి కొన్ని బ్యాంకులు ఆన్లైన్ రెమిటెన్స్ కోసం ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరుతున్నాయి. ఇలా నమోదు చేసుకున్న తర్వాత దేశీయ లావాదేవీల మాదిరే విదేశాల్లోని తమ వారి ఖాతాకు నగదు బదిలీ చేసుకోవచ్చు. ఎవరికి అయితే నగదు పంపించాలని అనుకుంటున్నారో వారి పేరు, బ్యాంకు అకౌంట్ నంబర్‌తో బెనిఫీషియరీని నమోదు చేసుకోవాలి. ఇందుకు కొంత సమయం తీసుకుంటుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు అయితే బెనిఫీషియరీ నమోదుకు 30 నిమిషాలు చాలు. మధ్యాహ్నం 2.30 గంటల్లోపు నమోదైన అన్ని రెమిటెన్స్ అభ్యర్థనలను అదే రోజు హెచ్డీఎఫ్సీ బ్యాంకు పూర్తి చేసేస్తుంది. అదే ఎస్బీఐ అయితే నూతన బెనిఫీషియరీని నమోదు చేసుకున్న తర్వాత యాక్టివేషన్‌కు ఒక రోజు సమయం తీసుకుంటుంది. ఎస్బీఐ కస్టమర్లు ఒకే రోజు గరిష్టంగా మూడు బెనిఫీషియరీలను నమోదు చేసుకోవచ్చు.
పరిమితులు..
ఎల్ఆర్ఎస్ కింద ఆన్లైన్ ఫారీన్ రెమిటెన్స్ (విదేశీ చెల్లింపులు) పరిమితి ఒక ఆర్థిక సంవత్సరంలో 2,50,000 డాలర్లుగా ఉంది. ఆన్లైన్ కొనుగోళ్లకూ ఇదే పరిమితి అమలవుతుంది. అయితే, బ్యాంకులు ఫారిన్ రెమిటెన్స్ లావాదేవీలకు సంబంధించి పలు రకాల పరిమితులను నిర్దేశిస్తున్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంకు అయితే కనిష్టంగా ఒక లావాదేవీలో 100 డాలర్లు, గరిష్టంగా 12,500 డాలర్ల వరకే పంపుకునేందుకు అనుమతిస్తోంది. రెమిట్నౌ అనే ఆన్లైన్ సదుపాయం ద్వారా ఒక కస్టమర్ ఈ మేరకు లావాదేవీలు చేసుకోవచ్చు. ఒకవేళ ఇంతకు మించిన మొత్తాల్లో విదేశాల్లోని తమ వారికి పంపించాలని అనుకుంటే అప్పుడు బ్యాంకు శాఖకు వెళ్లాల్సి వస్తుంది. యాక్సిస్ బ్యాంకు అయితే ఒక కస్టమర్ ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా గరిష్టంగా 25,000 డాలర్ల వరకు విదేశాలకు పంపించుకునేందుకు అనుమతిస్తోంది. ఎస్బీఐ కస్టమర్‌కు ఆన్లైన్ ఫారీన్ రెమిటెన్స్ పరిమితి ఒక లావాదేవీలో రూ.10 లక్షలుగా అమల్లో ఉంది.
అలాగే, ఎస్బీఐ కస్టమర్లు నూతన బెనిఫీషియరీని నమోదు చేసుకున్న తర్వాత మొదటి ఐదు రోజుల్లో మాత్రం కేవలం 50,000 వరకే పంపుకోగలరు. ఇక ఎల్ఆర్ఎస్ కింద కొన్ని దేశాలకు నగదు పంపుకునే అవకాశం లేదు. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ నిషేధించిన దేశాలు లేదా యూఎస్ ట్రెజరీ ఆంక్షలు అమలు చేస్తున్న దేశాలకు ఈ ఆంక్షలు వర్తిస్తాయి. ఉదాహరణకు ఎస్బీఐ కస్టమర్లకు పాకిస్తాన్, ఇరాన్ దేశాల్లోని వారికి నగదు పంపుకునే అవకాశం ఉండదు. ఇక కొన్ని బ్యాంకులు కొన్ని రకాల ఫారిన్ కరెన్నీ రెమిటెన్స్లకే పరిమితం చేస్తున్నాయి. ఉదాహరణకు ఐసీఐసీఐ బ్యాంకు 20 కరెన్సీల్లో ఫారిన్ రెమిటెన్స్‌లను ఆఫర్ చేస్తోంది. అదే ఎస్బీఐ కస్టమర్లు అయితే యూఎస్ డాలర్, యూరో, గ్రేట్ బ్రిటన్ పౌండ్, సింగపూర్ డాలర్, ఆస్ట్రేలియా డాలర్ మారకంలో రెమిటెన్స్‌లు చేసుకోవచ్చు.
కమీషన్, చార్జీలు..
బ్యాంకులు ఫారిన్ కరెన్సీ రెమిటెన్స్‌లకు సంబంధించి మారకం రేట్లను రోజువారీగా ప్రకటిస్తుంటాయి. ఈ వివరాలను బ్యాంకు వెబ్సైట్ల నుంచి తెలుసుకోవచ్చు. ఫారీన్ అవుట్వార్డ్ రెమిటెన్స్‌ల లావాదేవీలకు బ్యాంకులు చార్జీలు, కమీషన్లను వసూలు చేస్తున్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంకు 500 డాలర్ల వరకు లావాదేవీపై రూ.500 చార్జీని వసూలు చేస్తోంది. అదే 500 డాలర్లకు మించిన లావాదేవీలపై ఈ చార్జీ రూ.1,000గా ఉంది. ఎస్బీఐ కస్టమర్లు అయితే వివిధ కరెన్సీల్లో వివిధ రకాల చార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. యూఎస్ డాలర్ రూపంలో అయితే చార్జీ 11.25 డాలర్లు, బ్రిటన్ పౌండ్ రూపంలో చార్జీ 10 పౌండ్లు ఇలా చార్జీలు మారిపోతుంటాయి. యాక్సిస్ బ్యాంకు మాత్రం ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫారీన్ రెమిటెన్స్ లావాదేవీలపై చార్జీలను ఎత్తివేసింది.
ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేని వారికి..
విదేశీ రెమిటెన్స్ లావాదేవీల కోసం ఆన్లైన్ బ్యాంకింగ్‌లో నమోదు చేసుకోని వారి పరిస్థితి ఏంటి..? అటువంటప్పుడు ‘డీసీబీ బ్యాంకు రెమిట్ ఫెసిలిటీ’ని పరిశీలించొచ్చు. డీసీబీ బ్యాంకు ఖాతా దారులతోపాటు ఇతరులు అందరికీ ఇది అందుబాటులో ఉన్న సదుపాయం. పైగా విదేశీ రెమిటెన్స్ లావాదేవీలకు డీసీబీ బ్యాంకు ఎటువంటి చార్జీలను లేదా కమీషన్లను వసూలు చేయడం లేదు. పాన్ కార్డు ఉన్న వారు డీసీబీ బ్యాంకులో డీసీబీ రెమిట్ సదుపాయం కోసం బ్యాంకుకు వెళ్లనవసరం లేకుండా ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. కాకపోతే వీరికి డీసీబీ బ్యాంకు లేదా ఇతర బ్యాంకులో ఖాతా ఉండాలి. డీసీబీ బ్యాంకు ఒక ఆర్థిక సంవత్సరంలో 25,000 డాలర్ల వరకు ఒక కస్టమర్ విదేశాలకు పంపుకునేందుకు అనుమతిస్తోంది. ఇంతకు మించి పంపించుకోవాలంటే డీసీబీ బ్యాంకు శాఖకు వెళ్లాలి. ఐసీఐసీఐ బ్యాంకు మనీ2వరల్డ్ కూడా ఇటువంటి సదుపాయమే. ఇతర బ్యాంకు కస్టమర్లు విదేశాలకు నగదు పంపుకునేందుకు ఐసీఐసీఐ బ్యాంకు మనీ2వరల్డ్ ఉపయోగపడుతుంది. కాకపోతే ఐసీఐసీఐ బ్యాంకు శాఖకు వెళ్లి నమోదు చేసుకోవాలి. కేవైసీ వివరాలు కూడా సమర్పించాలి. మనీ2వరల్డ్ ద్వారా రెమిటెన్స్‌లపై రూ.750 కమీషన్‌గా చెల్లించాలి.
ఏజెంట్లు...
నెట్ బ్యాంకింగ్ సదుపాయాల్లేని వారు నాన్ బ్యాంకింగ్ ఏజెంట్ల సేవలను ఫారిన్ రెమిటెన్స్ కోసం వినియోగించుకోవచ్చు. థామస్‌కుక్, ఎబిక్స్‌క్యాష్ వరల్డ్ మనీ తదితర సంస్థలను ఫారీన్ రెమిటెన్స్ సేవలకు ఆర్బీఐ అనుమతించింది. అయితే, రెమిటెన్స్ లావాదేవీల పరంగా పరిమితులు సంస్థలను బట్టి మారిపోవచ్చు. చార్జీలు కూడా వేర్వేరుగా ఉన్నాయి. థామస్‌కుక్ ద్వారా ఆన్లైన్లో 5,000 వరకు డాలర్లను పంపుకోవాలంటే అందుకు గాను 8 డాలర్ల ఫీజును చెల్లించుకోవాలి. అంతకుమించిన లావాదేవీలపై ఫీజు రూ.11 డాలర్లుగా ఉంది.
పన్నులు ఉన్నాయా..?
విదేశీ రెమిటెన్స్‌పై కమీషన్లు/చార్జీలు, కరెన్సీ మారకం చార్జీలను పక్కన పెడితే.. పన్నుల భారం కూడా ఉంటుంది. పన్ను వర్తించే విలువపై 18% జీఎస్టీ చెల్లించాలి. పన్ను వర్తించే విలువ కనిష్టంగా రూ.250 నుంచి గరిష్టంగా రూ.60,000 వరకు ఉంటుంది. కనుక ఈ మొత్తంపై జీఎస్టీ రూ.45–10,800 మధ్య చెల్లించాల్సి రావచ్చు. 2020 అక్టోబర్ 1 నుంచి ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.7లక్షలకు మించి విదేశాలకు పంపితే 5% మూలం వద్ద పన్నును వసూలు (టీసీఎస్) చేస్తారు. ఒకవేళ విదేశీ విద్య కోసం బ్యాంకు నుంచి రుణం తీసుకుని రెమిటెన్స్ చేస్తుంటే మాత్రం టీసీఎస్ 0.5 శాతమే.