ఆ మూడు స్కిల్స్‌తోనే.. రూ.2 కోట్ల జీతం
ఐ ఫోన్ల తయారీ దిగ్గజ సంస్థ యాపిల్‌లో చిన్నపాటి కొలువు వచ్చినా చాలు.. కెరీర్ నల్లేరుపై నడకే అనే భావన. ఈ సంస్థలో ఉద్యోగం సొంతం చేసుకోవాలనేది ప్రతిభావంతులైన ప్రతి ఒక్క విద్యార్థి లక్ష్యం. అయితే ఏకంగా సంస్థ ప్రధాన కార్యాలయం (కాలిఫోర్నియా)లో ఉద్యోగం సొంతం చేసుకున్నాడు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇంటి దుర్గా లక్ష్మీనారాయణ స్వామి (దిలీప్ ఇంటి). ఇటీవలే అమెరికాలోని వర్జీనియా టెక్ యూనివర్సిటీ నుంచి ఎంఎస్ పూర్తిచేసి.. అక్కడ యాపిల్ సంస్థ నిర్వహించిన క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్‌లో నెగ్గి సత్తా చాటిన దిలీప్ మాటల్లోనే..
వర్జీనియా టెక్ యూనివర్సిటీలో 2015లో రెండేళ్ల ఎంఎస్ ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ కోర్సులో చేరాను. ఏటా ఇన్స్టిట్యూట్లో యాపిల్, గూగుల్ వంటి సంస్థలు క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్స్ నిర్వహిస్తాయి. అయితే నన్ను క్యాంపస్ ఇంటర్వూ్య డ్రైవ్‌కు పిలవడానికి ప్రధాన కారణం నా లింక్డ్ఇన్ ప్రొఫైల్. నేను అప్పటికే పూర్తిచేసిన ప్రాజెక్ట్‌లు, పని అనుభవం, అకడమిక్ రికార్డ్లను లింక్డ్ఇన్లో చూసిన యాపిల్ సంస్థ ప్రతినిధులు.. క్యాంపస్ ఇంటర్వూ్యకు హాజరు కావాలని ఈ–మెయిల్ పంపారు.
రెండు రౌండ్లలో ఇంటర్వ్యూ
వర్క్ ఎక్స్పీరియన్స్, వివిధ రీసెర్చ్ ప్రాజెక్టుల్లో పాల్గొనడం వల్ల ఎలాంటి ఆందోళన లేకుండా ఇంటర్వూ్యకు సిద్ధమయ్యాను. ఫండమెంటల్స్‌పై పట్టుండటంతో పూర్తి ఆత్మవిశ్వాసంతో ఇంటర్వూ్యకు హాజరయ్యాను. రెండు రౌండ్లలో ఇంటర్వూ్య జరిగింది. తొలి రౌండ్లో టెలిఫోనిక్ ఇంటర్వూ్యలో సంతృప్తికరంగా సమాధానాలు చెప్పడంతో.. యాపిల్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించే ఇంటర్వూ్యకు (ఆన్–సైట్) హాజరు కావాలని చెప్పారు. రెండు ఇంటర్వూ్యలు 30 నుంచి 45 నిమిషాల వ్యవధిలో జరిగాయి. ఇంటర్వూ్యలో ప్రొఫైల్ ఆధారిత ప్రశ్నలతోపాటు.. ప్రోగ్రామింగ్ నాలెడ్జ్‌పై పట్టును పరీక్షించే విధంగా ప్రశ్నలు అడిగారు. ఇంటర్వ్యూలో వేటిపై ప్రశ్నలు/అనుబంధ ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముందనే దానిపై ముందే కసరత్తు చేసి ఉండటంతో అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వగలిగాను. 2.85 లక్షల డాలర్ల (మన కరెన్సీలో రూ. రెండు కోట్ల) వార్షిక వేతనంతో జాబ్ సొంతమైంది.
ఆ మూడు నైపుణ్యాలు
యాపిల్ లేదా ఇతర ఏ సంస్థలోనైనా ఇంటర్వూ్య సమయంలో అభ్యర్థుల నుంచి మూడు లక్షణాలు గమనిస్తారు. అవి.. కోర్ నాలెడ్జ్, కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ స్కిల్స్. కోర్ నాలెడ్జ్ విషయంలో ఫండమెంటల్స్‌లో ఏ స్థాయిలో పట్టుందో పరిశీలిస్తారు. అంతేకాకుండా వాటిని అన్వయించే విషయంలో ఆలోచన సామర్థ్యాన్ని కూడా పరిశీలిస్తారు. అన్నీ బాగున్నాయనుకుంటేనే ఆఫర్ ఇస్తారు.
ఎంఎస్‌లో ప్రవేశం ఇలా..
వర్జీనియా టెక్ యూనివర్సిటీలో ఎంఎస్‌లో చేరడమే అనూహ్యంగా జరిగింది. వాస్తవానికి బిట్స్–పిలానీలో బీఈ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్) పూర్తయ్యాక హైదరాబాద్‌లోనే ఇమాజినేషన్ టెక్నాలజీస్ సంస్థలో వైర్లెస్ పీహెచ్వై ఫిర్మ్వేర్ ఇంజనీర్‌గా రెండేళ్లు పనిచేశాను. ఆ సమయంలోనే ఎంబీఏ చదవాలనే ఆసక్తితో క్యాట్‌కు హాజరై 99.3 పర్సంటైల్ కూడా సొంతం చేసుకున్నాను. వాస్తవానికి ఆ పర్సంటైల్‌కు ఏదో ఒక ఐఐఎంలో సీటు వచ్చేదే. కానీ అప్పటికే.. వైర్లెస్ కమ్యూనికేషన్స్‌పై ఆసక్తి పెరగడం, అందులో నైపుణ్యాలు సైతం లభించడంతో.. ఎలక్ట్రానిక్స్‌లోనే ఉన్నత విద్యనభ్యసించాలనే లక్ష్యంతో ఎంఎస్‌పై దృష్టిసారించాను. 2015లో వర్జీనియా టెక్ యూనివర్సిటీకి దరఖాస్తు చేసుకోవడంతో ప్రవేశం లభించింది. ఇప్పుడు యాపిల్ సంస్థలో రూ. 2కోట్ల వేతనంతో ఉద్యోగం సొంతమైంది.
ప్రాక్టికాలిటీకి ప్రాధాన్యం
ఇంజనీరింగ్, టెక్నాలజీ రంగాల్లో కెరీర్ పరంగా ఉన్నత హోదాలు లభించాలంటే ప్రాక్టికాలిటీకి ప్రాధాన్యం ఇవ్వాలి. ఎంఎస్ చేస్తున్న సమయంలోనే రెండు సంస్థల్లో ఇంటర్న్‌షిప్ చేశాను. అదే విధంగా గత డిసెంబర్ నుంచి వర్జీనియా టెక్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఎ.ఎ. లూయిస్ బీక్స్ వద్ద గ్రాడ్యుయేట్ రీసెర్చ్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాను. మనదేశంలో ఉన్నప్పుడు కూడా ఐఐటీ–ఢిల్లీ, బార్క్ (బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్)– ముంబైలలో రీసెర్చ్ ఇంటర్న్‌గా పనిచేశాను.
ఎంబీఏ చదవడమే లక్ష్యం
ఈ నెల 22 నుంచి విధులకు హాజరుకావాలని చెప్పారు. కానీ, జాబ్ ప్రొఫైల్ గురించి చెప్పలేదు. అయితే ఎలాంటి విధులనైనా నిర్వర్తించగలననే నమ్మకం ఉంది. ప్రస్తుతం యాపిల్ సంస్థలో ఉద్యోగంలో చేరినా.. ఎంబీఏ చదవడమే నా భవిష్యత్తు లక్ష్యం. ఇంజనీరింగ్ నైపుణ్యాలకు.. నిర్వహణ నైపుణ్యాలు కలిస్తే సాంకేతిక రంగంలో ఉన్నత స్థానాలు అధిరోహించేందుకు ఆస్కారం ఉంటుంది.
విజయాలు
ఎంహెచ్ఆర్డీ మెరిట్ స్కాలర్షిప్– 2013
ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ మెరిట్ స్కాలర్షిప్– 2012
ఆదిత్య బిర్లా మెరిట్ స్కాలర్షిప్, బిట్స్ పిలానీ– 2009–2013
అకడమిక్ రికార్డ్
పదో తరగతి: 556 మార్కులు
ఇంటర్మీడియెట్: 980 మార్కులు
బీఈ (ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్) – 9.41/10 జీపీఏ
ఎంఎస్ (వర్జీనియా టెక్ యూనివర్సిటీ) – 3.9/4 జీపీఏ
కుటుంబ నేపథ్యం
తండ్రి: ఇంటి సుబ్బారావు (పోస్టల్ డిపార్ట్మెంట్ ఉద్యోగి)
తల్లి: సూర్య కుమారి (గృహిణి)
స్వస్థలం: వీకే రాయపురం (సామర్లకోట మండలం, తూర్పు గోదావరి జిల్లా)