మహిళా గ్రూపులకు 7 శాతం వడ్డీకే రుణాలు
ముంబై: మహిళా స్వయం సహాయక గ్రూపు (ఎస్‌హెచ్‌జీ)లకు వార్షికంగా 7 శాతం వడ్డీకే రుణాలు ఇవ్వాలని ప్రభుత్వరంగ (పీఎస్‌యూ) బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆదేశించింది. 150 జిల్లాలకు వర్తించే విధంగా ఆర్బీఐ ఈ మేరకు ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం సంబంధిత జిల్లాల్లో మహిళా స్వయం సహాయక గ్రూపులకు స్వర్ణజయంతి గ్రామ్ స్వరాజ్గార్ యోజనాఆజీవికా (ఎస్జీఎస్వై) పథకం వడ్డీ రాయితీ పథకం (ఇంట్రస్ట్ సబ్వెన్షన్ స్కీమ్) ప్రయోజనాలు వర్తిస్తాయి.
ఈ పథకం కింద బ్యాంకులపై పడే వడ్డీ భారాన్ని (5.5 శాతం పరిమితికి లోబడి) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రభుత్వం భరిస్తుంది. రూ. 3 లక్షల వరకూ ఈ ఆర్థిక సంవత్సరంలో ఇకపై తీసుకునే రుణాలతోపాటు, పాత రుణాలను సైతం ఈ పథకం కిందకు మార్చడం జరుగుతుంది. గ్రామీణ ప్రాంతీయ బ్యాంకులకూ(ఆర్ఆర్బీ) ఈ నిర్ణయం వర్తిస్తుంది. రుణాలను సకాలంలో తిరిగి చెల్లించే ఎస్‌హెచ్‌జీలకు 3 శాతం అదనపు రాయితీ కూడా ఇవ్వడం జరుగుతుంది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సబ్వెన్షన్ పరిమితి పొడిగింపునకు సంబంధించి అంశాన్ని ప్రత్యేకంగా తెలియజేయడం జరుగుతుందని ఆర్బీఐ తెలిపింది.