Investment Trusts
-
ఇన్వి ట్స్‌లో పెట్టుబడులు జూమ్..
న్యూఢిల్లీ: ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులు (ఇన్వి ట్స్), రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులపై (రీట్స్) మదుపుదార్ల ఆసక్తి పెరుగుతోంది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో వీటిలో రూ. 17,116 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. స్థిరమైన రాబడులు అందిస్తుండటంతో ఈ సాధనాల్లో పెట్టుబడులు 14 రెట్లు పెరిగినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ప్రైమ్ డేటాబేస్డాట్కామ్ క్రోడీకరించిన గణాంకాల ప్రకారం 2023–24లో రీట్స్, ఇన్వి ట్స్ రూ. 17,116 కోట్లు సమీకరించాయి. 2022–23లో ఇది రికార్డు కనిష్ట స్థాయి రూ. 1,166 కోట్లుగా నమోదైంది. ఇక గత ఆర్థిక సంవత్సరంలో తొలిసారిగా ఒక ఇన్వి ట్ ఓఎఫ్ఎస్ (ఆఫర్ ఫర్ సేల్) కూడా చేపట్టింది. డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్ సంస్థ ఓఎఫ్ఎస్ మార్గంలో రూ. 2,071 కోట్లు సమీకరించింది. సెబీ ఇటీవల నిబంధనలను సవరించిన నేపథ్యంలో ఈ విభాగం ఏయూఎం (నిర్వహణలోని ఆస్తులు) 500 మిలియన్ డాలర్ల స్థాయి నుంచి 2030 నాటికి 5 బిలియన్ డాలర్లకు చేరవచ్చని వైజ్ఎక్స్ సీఈవో ఆర్యమాన్ వీర్ తెలిపారు. కొత్తగా వచ్చే పెట్టుబడుల్లో 75 శాతం వాటాతో రహదారుల రంగం ప్రధాన లబి్ధదారుగా ఉండగలదని పేర్కొన్నారు. -
రీట్, ఇన్విట్.. పెరుగుతున్న ఆకర్షణ
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్), ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (ఇన్విట్) పట్ల ఇన్వెస్టర్లలో అవగాహన పెరుగుతున్న కొద్దీ.. వీటిల్లోకి మరిన్ని పెట్టుబడులు తరలివస్తున్నాయి. ఇందుకు గతేడాది గణాంకాలే నిదర్శనం. 2023లో రీట్, ఇన్విట్లలోకి రూ.11,474 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 2022లో వచి్చన రూ.1,166 కోట్లతో పోలిస్తే పది రెట్ల వృద్ధి గతేడాది నమోదైనట్టు తెలుస్తోంది. సెబీ తీసుకున్న చర్యలు, ఆకర్షణీయమైన రాబడులు ఈ సాధనాల దిశగా ఇన్వెస్టర్లను ఆలోచింపజేస్తున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఏడాది కూడా ఈ సాధనాలు భారీగా పెట్టుబడులను ఆకర్షించొచ్చన్న అంచనాను వ్యక్తం చేస్తున్నారు. వడ్డీ రేట్ల కోత అంచనా, విధానాల్లో వచి్చన మార్పులను ప్రస్తావిస్తున్నారు. ‘‘ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో వడ్డీ రేట్లను తగ్గించే చర్యలు చేపట్టొచ్చు. దీర్ఘకాలం కోసం ఇన్వెస్ట్ చేసే వారికి రీట్, ఇన్విట్లు ఆకర్షణీయంగా మారతాయి’’అని క్లారావెస్ట్ టెక్నాలజీస్ సహ వ్యవస్థాపకుడు మనకి పరులేకర్ పేర్కొన్నారు. రీట్, ఇన్విట్ సాధనాల్లోకి భారీగా 2020లో రూ.29,715 కోట్ల పెట్టుబడులు రావడం గమనార్హం. 2021లో రూ.17,641 కోట్లు వచ్చాయి. రీట్,ఇన్విట్‌లను ఏడెనిమిదేళ్ల క్రితం ప్రవేశపెట్టారు. ప్రస్తుతం దేశంలో 23 రిజిస్టర్డ్ ఇన్విట్లు, ఐదు రీట్లు ఉన్నాయి. వీటి నిర్వహణలో మొత్తం రూ.30,000 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. రీట్ల ద్వారా వాణిజ్య రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో, ఇన్విట్ల ద్వారా ఇన్ఫ్రా ప్రాజెక్టుల్లో పెట్టుబడుల అవకాశాలను సొంతం చేసుకోవచ్చు. -
రీట్ హోల్డర్లకు ప్రత్యేక హక్కులు
న్యూఢిల్లీ: రియల్టీ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్(రీట్)లలో యూనిట్లు కలిగిన పెట్టుబడిదారులకు ప్రత్యేక హక్కులను కలి్పంచేందుకు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా నడుం బిగించింది. కార్పొరేట్ సుపరిపాలనకు మరింత బూస్ట్‌నిస్తూ రీట్ బోర్డులలో తమ ప్రతినిధుల(నామినీ)ను ఎంపిక చేసుకునేందుకు యూనిట్ హోల్డర్లకు వీలు కలి్పంచింది. ఇందుకు తాజా నిబంధనలను విడుదల చేయడంతోపాటు.. సవరణలకు తెరతీసింది. దీంతో ఇకపై సెల్ఫ్ స్పాన్సర్డ్ రీట్లకూ మార్గమేర్పడనుంది. యూనిట్ హోల్డర్లు నామినేట్ చేసే సభ్యులకు ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ల నిర్వహణా సంబంధ నిబంధనలు అమలుకానున్నట్లు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగా సెబీ రీట్ నిబంధనల్లో సవరణలు చేపట్టింది. ఏదైనా ఒక రీట్‌లో 10 శాతానికంటే తక్కువకాకుండా వ్యక్తిగతంగా లేదా సామూహికంగా యూనిట్లు కలిగిన యూనిట్ హోల్డర్లు సంస్థ బోర్డులో ఒక డైరెక్టర్‌ను నియమించవచ్చు. గత కొన్నేళ్లుగా ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్(ఇని్వట్)లు, రీట్లలో రిటైల్ ఇన్వెస్టర్ల ఆసక్తి పెరుగుతూ వస్తోంది. అయితే ఇన్వెస్ట్మెంట్ మేనేజర్లు తీసుకునే నిర్ణయాలపై యూనిట్ హోల్డర్లకు ఎలాంటి హక్కులూ లభించడంలేదు. దీంతో ట్రస్ట్‌లు తదితర భారీ పెట్టుబడిదారు సంస్థలు బోర్డులో సభ్యత్వాన్ని కోరుతూ వస్తున్నాయి. కాగా.. సెబీ తాజా నిబంధనలతో ఇన్వెస్టర్లలో వి శ్వాసం మెరుగుపడుతుందని ఎన్డీఆర్ ఇన్విట్ మేనేజర్స్ సీఎఫ్‌వో సందీప్ జైన్ పేర్కొన్నారు. అటు క్యాపిటల్ మార్కెట్లు పుంజుకోవడంతోపాటు, ఇటు కంపెనీకి లబ్ది చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. -
ఎన్హెచ్ఏఐ రూ. 1,217 కోట్ల సమీకరణ
న్యూఢిల్లీ: ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (ఇన్విట్) ద్వారా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) తాజాగా రూ. 1,217 కోట్ల నిధులు సమీకరించింది. ఈ నిధులను రహదారి ప్రాజెక్టుల అవసరాల కోసం వినియోగించనుంది. కేంద్ర రహదారి రవాణా, హైవేస్ శాఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్లో ఈ మేరకు ట్వీట్ చేసింది. ఎన్హెచ్ఏఐ గతేడాది తమ తొలి ఇన్విట్ ద్వారా రూ. 5,000 కోట్ల పైచిలుకు నిధులను సమీకరించింది. కొత్తగా మూడు రహదారి ప్రాజెక్టుల కోసం ఈ ఏడాది అక్టోబర్‌లో ఎన్హెచ్ఏఐ రూ. 2,500 కోట్లు సమీకరించనున్నట్లు రహదారి శాఖ సీనియర్ అధికారి ఇటీవల వెల్లడించారు. -
ఈ నెల18 నుంచి తొలి రీట్
న్యూఢిల్లీ: భారత్‌లో తొలి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్) ఈ నెల 18 నుంచి ఆరంభం కానున్నది. ఈ నెల 20న ముగిసే ఈ రీట్ ఆఫర్‌కు రూ.299– 300 ధరల శ్రేణిని కంపెనీ నిర్ణయించింది. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్కంపెనీ బ్లాక్‌స్టోన్, రియల్టీ కంపెనీ ఎంబసీల జాయింట్ వెంచర్, ఎంబసీ ఆఫీస్ పార్క్స్ ఈ రీట్‌ను ఆఫర్ చేస్తోంది. మొత్తం 12.95 కోట్ల యూనిట్లను విక్రయించనున్నారు. ఈ రీట్ ద్వారా రూ.4,750 కోట్లు సమీకరించాలని ఎంబసీ ఆఫీస్ పార్క్స్ యోచిస్తోంది. ఇప్పటికే రూ.876 కోట్ల మేర వ్యూహాత్మక ఇన్వెస్టర్ల నుంచి ఇన్వెస్ట్మెంట్ హామీని పొందింది. అమెరికన్ ఫండ్స్ ఇన్సూరెన్స్ సిరీస్, న్యూ వరల్డ్ ఫండ్ ఐఎన్‌సీ, స్మాల్‌క్యాప్ వరల్డ్ ఫండ్ ఇన్‌కార్పొ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ సంస్థలకు 2.92 కోట్ల యూనిట్లను కేటాయించి రూ.876 కోట్లు సమీకరిస్తారు. రీట్ అంటే.... అద్దెలు ఆర్జించే రియల్ ఎస్టేట్ ఆస్తులను నిర్వహించే ఇన్వెస్ట్మెంట్ సాధనాన్ని రీట్‌గా వ్యవహరిస్తారు. ఎవరైనా దీంట్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇవి చాలా ప్రాచుర్యం పొందాయి. రీట్స్‌కు సంబంధించిన నిబంధనలను 2014లోనే సెబీ నోటిఫై చేసింది. 9 శాతం రాబడి... ఈ రీట్పై తొలి ఏడాది ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ (ఐఆర్ఆర్) 9 శాతంగా, ఐదేళ్ల కాలానికి 18 శాతం మేర ఉండొచ్చని నిపుణుల అంచనా. ఈ ప్రతిపాదిత రీట్‌లో 33 మిలియన్ చదరపుటడుగుల ఆఫీస్, హాస్పిటాలిటీ అసెట్స్ ఉన్నాయి. ముంబై, బెంగళూరు, పుణే, నోయిడాలోని ఏడు బిజినెస్ పార్క్‌లు, నాలుగు సిటీ– సెంట్రిక్ బిల్డింగ్స్ భాగంగా ఉన్నాయి. దీంట్లో 24 మిలియన్ చదరపుటడుగుల అసెట్స్ ద్వారా ఏడాదికి రూ.2,000 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది. 3 మిలియన్ చదరపుటడుగుల రియల్ ఎస్టేట్ ఆస్తులు నిర్మాణంలో ఉండగా, మరో 6 మిలియన్ చదరపుటడుగుల రియల్టీ ఆస్తులు వివిధ దశల్లో ఉన్నాయి. రానున్న మూడేళ్లలో అద్దె ఆదాయం 55 శాతం పెరగగలదన్న అంచనాలున్నాయి. ఎంబసీ ఆఫీస్ పార్క్స్‌కు వచ్చే అద్దె ఆదాయాల్లో సగానికి పైగా ఫారŠూచ్యన్ 500 కంపెనీల నుంచే వస్తున్నాయి. మైక్రోసాఫ్ట్, గూగుల్, వెల్స్‌ఫార్గో, జేపీ మోర్గాన్ తదితర సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. -
దీర్ఘకాలంలో రియల్ లాభాలు
కొద్దిరోజులుగా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులు (రీట్స్) చర్చనీయాంశంగా ఉంటున్నాయి. వీటికి కేంద్రం ఆమోదముద్ర వేయడంతో రియల్టీ రం గంలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారి కోసం మరో కొత్త సాధనం అందుబాటులోకి వచ్చినట్లయింది. అయితే, ఇలాంటి ప్రత్యామ్నాయ పెట్టుబడి సాధనాల్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు వాటిల్లో సాధకబాధకాలు గురించి ముందుగా తెలుసుకోవడం అవసరం. వాటి గురించి తెలియజేసేదే ఈ కథనం. స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ దగ్గర ట్రస్టుల కింద రీట్స్ నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. ఇవి ఇనీషియల్ ఆఫర్ల ద్వారా నిధులు సమీకరిస్తాయి. నిధులకు ప్రతిగా యూనిట్లను కేటాయిస్తాయి. ఇవి స్టాక్ ఎక్స్చేంజీల్లో లిస్టవుతాయి. ఇక ఇనీషియల్ ఆఫర్ల ద్వారా సమీకరించిన నిధులను ఉపయోగించి తక్షణమే అద్దెకు ఇచ్చేందుకు వీలున్న ప్రాపర్టీలను రీట్స్ కొంటాయి. సదరు ప్రాపర్టీలపై రీట్స్ అద్దె రూపంలో ఆదాయం పొందుతాయి. ఆ ప్రయోజనాలను ఇన్వెస్టర్లకు బదలాయిస్తాయి. మ్యూచువల్ ఫండ్స్ తరహాలోనే కనిపించినా.. రీట్స్, ఫండ్స్ ఇన్వెస్ట్ చేసే సాధనాలు వేర్వేరుగా ఉంటాయి. ఫండ్స్ ప్రధానంగా స్టాక్స్, డెట్ మొదలైన వాటిలో ఇన్వెస్ట్ చేస్తే, రీట్స్ ప్రధానంగా కమర్షియల్ రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేస్తాయి. ఫండ్ విషయానికొస్తే.. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా పోర్ట్‌ఫోలియోలో స్టాక్లను మార్చుకునే వెసులుబాటు ఫండ్ మేనేజర్లకు ఉంటుంది. అయితే, రీట్స్కి ఇలాంటి వెసులుబాటు ఉండదు. నిబంధనల ప్రకారం ఇవి కచ్చితంగా కమర్షియల్ రియల్ ఎస్టేట్‌పైనే ఇన్వెస్ట్ చేయాలి. ఇవి దీర్ఘకాలికమైనవి కావడంతో పాటు లావాదేవీల సంఖ్యపై పరిమితులు ఉంటాయి. అలాగే, సెబీ నిబంధనల ప్రకారం రీట్స్ సమీకరించిన మొత్తం నిధిలో దాదాపు 90 శాతాన్ని అప్పటికే నిర్మాణం పూర్తయిపోయి, ఆదాయాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్న ప్రాపర్టీల్లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. రీట్స్‌లో చేసే ఇన్వెస్ట్మెంట్కి లాకిన్ వ్యవధి ఉంటుంది. గడువు తీరిన తర్వాత .. వచ్చిన రాబడిని ఇన్వెస్టర్లకు రీట్స్ పంచుతాయి. ఉదాహరణకు, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టు.. ఒక పదేళ్ల వ్యవధికి ఇన్వెస్ట్ చేసిందనుకుందాం. ఆ పదేళ్లు గడిచిన తర్వాత సదరు ప్రాపర్టీని విక్రయించి, వచ్చిన మొత్తాన్ని ఇన్వెస్టర్లకు అందజేస్తాయి. సాధారణంగా రెసిడెన్షియల్ ప్రాపర్టీతో పోలిస్తే కమర్షియల్ ప్రాపర్టీపై వచ్చే అద్దె ఆదాయాలు ఎక్కువగానే ఉంటాయి. కనుక సక్రమమైన నిర్వహణ ఉంటే రీట్ ద్వారా మెరుగైన రాబడే అందుకోవచ్చు. అయితే, రీట్స్‌లో ఇన్వెస్ట్ చేయదల్చుకున్న వారు వీటిలో పెట్టుబడి దీర్ఘకాలం పాటు లాకిన్ అయి ఉంటుందని గుర్తుంచుకోవాలి. పెట్టుబడుల్లో వైవిధ్యం కోసం రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టాలనుకునే వారు ఈ రిస్క్‌కు సిద్ధపడితే ఈ సాధనాన్ని ఎంచుకోవచ్చు.