‘మీరూ జాగ్రత్తగా ఉండాలి’
పెట్టుబడుల విషయంలో నియంత్రణ నిబంధనలు మాత్రమే మదుపరులను కాపాడలేవని, ఇన్వెస్టర్లు కూడా తప్పకుండా తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని బీఎస్ఈ ఎండీ సుందరరామన్ రామమూర్తి తెలిపారు. సొంతంగా విషయాలను ఆకళింపు చేసుకోకుండా, వాళ్లూ వీళ్లు చెప్పిన మాటల మీద ఆధారపడి ఇన్వెస్ట్ చేసే ధోరణి మంచిది కాదని వ్యాఖ్యానించారు.‘కూరగాయలు కొనుక్కునేటప్పుడు ముందుగానే చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. కానీ మీ జీవితకాల ఆదాయాన్ని పెట్టుబడి పెట్టేటప్పుడు మాత్రం ఎవరో చెప్పిన మాటలు విని ముందూ, వెనకా చూసుకోకుండా ఇన్వెస్ట్ చేస్తారు. అలా చేయొద్దు. మీకు అర్థమైనదే ట్రేడ్ చేయండి. ఏం ట్రేడ్ చేస్తున్నారో అర్థం చేసుకోండి. లేకపోతే సమస్యలు తప్పవు. మిమ్మల్ని మీరు కాపాడుకోదల్చుకోకపోతే ఎన్ని నిబంధనలున్నా ఏవీ మిమ్మల్ని రక్షించలేవు. కాబట్టి అలర్టుగా ఉండండి’ అని రిటైల్ ఇన్వెస్టర్ల కోసం కలకత్తా చాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా హెచ్చరించారు. ఇదీ చదవండి: అనుకున్నదొకటి అయినదొకటి..మార్కెట్‌పై అవగాహన లేని రిటైల్ ఇన్వెస్టర్లు పెట్టుబడుల కోసం మ్యుచువల్ ఫండ్ మార్గాన్ని ఎంచుకోవడం శ్రేయస్కరమని సూచించారు. అప్పుడు కూడా థీమ్యాటిక్ ఫండ్స్ జోలికి వెళ్లకుండా విస్తృత సాధనాల్లో ఇన్వెస్ట్ చేసే మ్యుచువల్ ఫండ్లు లేదా లార్జ్ క్యాప్ ఫండ్లను ఎంచుకోవడం మంచిదని పేర్కొన్నారు. కెరియర్ ప్రారంభించిన తొలినాళ్ల నుంచే పెట్టుబడులు పెట్టడాన్ని అలవర్చుకోవాలని మహిళలు, యువతకు రామమూర్తి సూచించారు. నియంత్రణ సంస్థలు, స్టాక్ ఎక్సే్చంజీలు ఎంత అప్రమత్తంగా ఉన్నా కొన్ని ఎస్ఎంఈ లిస్టింగ్‌లలో అవకతవకలు జరిగే అవకాశాలను తోసిపుచ్చలేమని పేర్కొన్నారు. ఐపీవో పత్రాల్లో అనుమానాస్పద అంశాలను పసిగట్టేందుకు ఏఐ, లార్జ్ ల్యాంగ్వేజ్ మోడల్స్‌ను బీఎస్ఈ ట్రయల్ ప్రాతిపదికన ఉపయోగిస్తోందని రామమూర్తి చెప్పారు.