IOT market
-
దేశంలో దిగ్గజ కంపెనీల పెట్టుబడుల సునామీ..!
న్యూఢిల్లీ: దేశీయంగా డేటా సెంటర్ల మార్కెట్ గణనీయంగా వృద్ధి చెందుతోంది. దేశ, విదేశ సంస్థలు తమ కార్యకలాపాలను మరింతగా విస్తరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే అయిదేళ్లలో ఈ విభాగంలోకి దాదాపు రూ.1.2 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా ఒక నివేదికలో తెలిపింది. అమెజాన్ వెబ్ సర్వీసెస్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్, ఐబీఎం, ఉబర్, డ్రాప్‌బాక్స్ మొదలైన బడా సంస్థలు తమ డేటా స్టోరేజీని థర్డ్ పార్టీ డేటా సెంటర్ ప్రొవైడర్లకు అవుట్సోర్సింగ్ చేస్తున్నాయని వివరించింది. హీరనందానీ గ్రూప్, అదానీ గ్రూప్ లాంటి దేశీ కార్పొరేట్ దిగ్గజాలతో పాటు అమెజాన్, ఎడ్జ్‌కనెక్స్, మైక్రోసాఫ్ట్, క్యాపిటలాండ్, మంత్ర గ్రూప్ వంటి విదేశీ ఇన్వెస్టర్లు కూడా భారతీయ డేటా సెంటర్లలో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించాయి. ‘వాటితో పాటు ఎన్టీటీ, కంట్రోల్ఎస్, ఎన్ఎక్స్ట్రా, ఎస్టీటీ ఇండియా మొదలైనవి తమ సామర్థ్యాలను మరింతగా పెంచుకుంటున్నాయి. మొత్తం మీద రాబోయే అయిదేళ్లలో 3900–4100 మెగావాట్ల సామర్థ్యం సాధించేందుకు సుమారు 1.05–1.20 లక్షల కోట్ల మేర పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది‘ అని ఇక్రా తెలిపింది. ఆదాయాల వృద్ధి.. 2022–24 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో పరిశ్రమ ఆదాయాలు వార్షికంగా 18–19 శాతం వృద్ధి రేటు నమోదు చేయవచ్చని అంచనాలు ఉన్నాయి. ర్యాక్ సామర్థ్యాల వినియోగం పెంచుకోవడం, కొత్త డేటా సెంటర్ల విస్తరణ ఇందుకు దోహదపడనున్నాయి. ఆదాయాలు పెరగడం, స్థిర వ్యయాలను తగ్గించుకోగలగడం వంటి అంశాల ఊతంతో డేటా సెంటర్ కంపెనీల నిర్వహణ మార్జిన్లు మెరుగుపడవచ్చని ఇక్రా పేర్కొంది. 40–42 శాతం శ్రేణిలో ఉండొచ్చని తెలిపింది. ‘నియంత్రణ విధానాలపరంగా తోడ్పాటు, భారీగా పెరుగుతున్న క్లౌడ్ కంప్యూటింగ్, ఇంటర్నెట్ వినియోగం, డిజిటల్ ఎకానమీపై .. కొత్త టెక్నాలజీలపై (ఐవోటీ, 5జీ మొదలైనవి) ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెడుతుండటం వంటి అంశాలు దేశీయంగా డేటా సెంటర్ల డిమాండ్‌కు తోడ్పడగలవు‘ అని ఇక్రా కార్పొరేట్ రేటింగ్స్ గ్రూప్ హెడ్ రాజేశ్వర్ బర్ల తెలిపారు. 2022–23 బడ్జెట్లో డేటా సెంటర్లకు కేంద్రం ఇన్ఫ్రా రంగ హోదా కల్పించింది. తక్కువ వడ్డీ రేట్లపై దీర్ఘకాలిక రుణాలు పొందేందుకు, నిర్దిష్ట మార్గాల ద్వారా విదేశీ నిధులను సమకూర్చుకునేందుకు ఇది వాటికి ఉపయోగపడుతుంది. -
కొత్త కేంద్రం ఏర్పాటులో అంతర్జాతీయ ఐవోటీ సంస్థ హోగర్ కంట్రోల్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్‌లో అసెంబ్లింగ్ యూనిట్, ఆర్అండ్డీ కేంద్రాలున్న అంతర్జాతీయ ఐవోటీ సంస్థ హోగర్ కంట్రోల్స్ తాజాగా కొత్త కేంద్రం ఏర్పాటుపై కసరత్తు చేస్తోంది. దీనితో ప్రత్యక్షంగా 50 పైగా ఉద్యోగాల కల్పన జరగగలదని సంస్థ సీఈవో విష్ణు రెడ్డి తెలిపారు. హోమ్ ఆటోమేషన్ సంబంధ స్మార్ట్ డివైజ్‌ల తయారీ తదితర కార్యకలాపాలకు ఇది ఉపయోగపడనుందని వివరించారు. ప్రస్తుతం ఉప్పల్‌లోని తమ కేంద్రంలో .. 100 మంది పైచిలుకు ఉద్యోగులు ఉన్నారని చెప్పారు. దీని వార్షిక తయారీ సామర్థ్యం 6 లక్షల యూనిట్లని పేర్కొన్నారు. 2019లో హైదరాబాద్‌లో కార్యకలాపాలు ప్రారంభించినప్పట్నుంచి సుమారు రూ. 100 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు విష్ణు రెడ్డి వివరించారు. ప్రస్తుతం టర్నోవరు 2.5 మిలియన్ డాలర్లుగా ఉండగా దీన్ని రెట్టింపు స్థాయికి 5 మిలియన్ డాలర్లకు పెంచుకోనున్నట్లు చెప్పారు. హోమ్ ఆటోమేషన్ సంబంధ ప్రైమాప్లస్ స్మార్ట్ టచ్ ప్యానెల్ ఉత్పత్తుల శ్రేణిని ఈ సందర్భంగా ఆయన ఆవిష్కరించారు. సాధారణ లైట్లు, ఫ్యాన్లు మొదలైన వాటిని కూడా స్మార్ట్ ఉపకరణాలుగా మార్చేందుకు ఇది ఉపయోగపడగలదని విష్ణు రెడ్డి పేర్కొన్నారు. -
జోరుగా భారత ఐఓటీ మార్కెట్
•2020 కల్లా 1,500 కోట్ల డాలర్లకు •నాస్కామ్-డెలాయిట్ నివేదిక న్యూఢిల్లీ: ఇంటర్నెట్ ఆఫ్ ధింగ్స్(ఐఓటీ) మార్కెట్ భారత్‌లో జోరుగా పెరగనున్నదని నాస్కామ్ అంచనా వేస్తోంది. తయారీ, వాహన, రవాణా, లాజిస్టిక్స్ తదితర రంగాల్లో ఐఓటీ అనువర్తనం కారణంగా భారత్‌లో ఐఓటీ మంచి వృద్ధిని సాధిస్తుందని డెలాయిట్‌తో నాస్కామ్ రూపొందించిన నివేదిక పేర్కొంది. ఇంటర్నెట్ యాక్సెస్ ఉన్న పరికరాలు ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉన్న నెట్‌వర్క్‌ను ఐఓటీ అంటారు. ఉదాహరణకు, రోడ్ల మీద ఎలాంటి ట్రాఫిక్ లేకపోతే వీధిలైట్లు వాటంతట అవే ఆఫ్ అయిపోతాయి. ఫలితంగా విద్యుత్తు ఆదా అవుతుంది. వినియోగదారుల, పారిశ్రామిక రంగాల్లో ఐఓటీ వినియోగం ప్రారంభమైందని ఐఓటీని ఆవిష్కరించిన కెవిన్ ఆష్టన్ పేర్కొన్నారు. ఈ నివేదిక పేర్కొన్న కొన్ని ముఖ్యాంశాలు... ప్రస్తుతం 560 కోట్ల డాలర్లుగా ఉన్న ఐఓటీ మార్కెట్ 2020 కల్లా 1,500 కోట్ల డాలర్లకు పెరుగుతుంది. వివిధ రంగాలకు చెందిన 120కు పైగా సంస్థలు ఐఓటీ ఈకో సిస్టమ్‌లో ఉన్నాయి. ఈ ఏడాది 20 కోట్ల యూనిట్లతో అనుసంధానమై ఉన్న భారత ఐఓటీ మార్కెట్ 2020 కల్లా 270 కోట్ల యూనిట్లకు పెరుగుతుంది. ఇదే తరహా వృద్ధి ప్రపంచవ్యాప్తంగా ఉంటుందని అంచనా. ఐఓటీ వృద్ధికి వినియోగదారుల, పారిశ్రామిక రంగాలు చోదక శక్తిగా పనిచేస్తాయి.