అన్నాడీఎంకే ప్రచార సాధనంగా ఐప్యాడ్!
అన్నాడీఎంకే చీఫ్, ముఖ్యమంత్రి జయలలిత లేకుండా మొదటిసారి తమిళనాడులో ఉప ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీ కార్యకర్తలు, అమ్మ ఆశయాలు ప్రజలందరికీ తెలియాలని వినూత్న రీతిలో ప్రచారం ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి అమ్మ మెసేజ్‌ను ఐప్యాడ్‌లో వివరిస్తున్నారు. జయలలిత సీఎం అయిన తరువాత పేద ప్రజల కోసం ప్రవేశపెట్టిన అనేక పథకాలు, పూర్తి చేసిన అభివృద్ది పనుల వివరాలను ఐ ప్యాడ్‌లో తెలుపుతున్నారు. పార్టీ నిర్వహిస్తున్న ఈ ఐప్యాడ్ క్యాంపెయిన్‌ను ప్రజలు ఎంతగానో ఆహ్వానిస్తున్నారని కార్యకర్తలు చెబుతున్నారు. అమ్మ చొరవను మహిళలు ముందుకొచ్చి మెచ్చుకుంటున్నారని పేర్కొంటున్నారు.
టెక్నాలజీని వాడుకుని వినూత్న రీతిలో ప్రచారం నిర్వహించే మొదటి రాష్ట్రం తమిళనాడేనట. అయితే ఇప్పటికే పలుమార్లు టెక్నాలజీని వాడుకుని అన్నాడీఎంకే ఎన్నికల ప్రచారం నిర్వహించింది. 2014 ఎన్నికల సమయంలో అన్నాడీఎంకే టెలిఫోనిక్ మెసేజ్ పద్ధతిని తీసుకొచ్చి, అమ్మ ఆశయాలను ప్రజలకు తెలియజేశారు. అనంతరం 2016 ఎన్నికల సమయంలోనూ అన్నాడీఎంకే వాట్సాప్ ద్వారా క్యాంపెయిన్ నిర్వహించింది. నవంబర్ 15న తమిళనాడులో మూడు నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరుగనున్నాయి. అమ్మ లేకుండా నిర్వహించే ఈ ఎన్నికలు పార్టీకి ఎంతో కీలకంగా మారాయి. గత 44 రోజులుగా జయలలిత ఆరోగ్యం బాగోలేకపోవడంతో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.