ఆ మోదీ గురించి ఈ మోదీ ఏం చేస్తారు?
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ మూడు రోజుల పర్యటనకు బ్రిటన్ వెళ్లారు. మరి ఆయన కళంకిత క్రికెట్ బాస్ లలిత్ మోదీని భారత్‌కు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తారా? అంటూ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. ఐఎపీఎల్ అవినీతి వ్యవహారంలో దేశంలో పలు కేసులను ఎదుర్కొంటున్న లలిత్ మోదీ 2010 నుంచి లండన్‌లో నివసిస్తున్నారు. 'గత విదేశీ పర్యటనల ద్వారా సెల్ఫీలు తీసుకోవడం, బ్రాండ్ మోదీని పెంపొందించుకోవడం తప్ప దేశానికి సాధించింది ఏమీ లేదని విశ్లేషణలు చాటుతున్నాయి' అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా అన్నారు.
ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీని భారత్‌కు తిరిగి రప్పించకపోతే.. చిన్న మోదీకి పెద్ద మోదీ సహాయం చేస్తున్నారని దేశ ప్రజలు భావించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రయాణ పత్రాలు పొందడంలో లలిత్ మోదీకి విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ సహకరించారనే ఆరోపణలపై మరోసారి పార్లమెంటు సమావేశాలను అడ్డుకుంటారా? అన్న ప్రశ్నకు.. లలిత్ మోదీని భారత్‌కు తీసుకొచ్చి విచారణ జరిపితే.. ఆ అవసరం రాదని సుర్జేవాలా పేర్కొన్నారు. ఈ నెల 26 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి.