శాస్త్రి భవితవ్యంపై తుది నిర్ణయం!
లంకకు వెళ్లిన అనురాగ్ ఠాకూర్
న్యూఢిల్లీ : భారత జట్టు టీమ్ డెరైక్టర్ రవిశాస్త్రి భవితవ్యంపై మరికొద్ది రోజుల్లో తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ మేరకు ఈ అంశాన్ని చర్చించేందుకు బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ బుధవారం శ్రీలంకకు బయలుదేరి వెళ్లారు. రెండో టెస్టు సందర్భంగా ఈ విషయంపై శాస్త్రితో ఆయన కూలంకశంగా చర్చించనున్నట్లు సమాచారం. అయితే బీసీసీఐ తరఫున సంగక్కరను సన్మానించేందుకు లంకకు వెళ్తున్నానని ఠాకూర్ అధికారికంగా వెల్లడించినా... పర్యటన వెనుక ఉద్దేశం మాత్రం శాస్త్రితో చర్చలు జరపడమేనని క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. అక్టోబర్లో మొదలుకానున్న దక్షిణాఫ్రికా పర్యటన వరకు ఈ అంశంపై ఓ కొలిక్కి రావాలని బోర్డు భావిస్తోంది.
మరోవైపు ఢిల్లీలో జరిగిన ఐపీఎల్ వర్కింగ్ గ్రూప్ కమిటీ సమావేశంలో సౌరవ్ గంగూలీతో ప్రత్యేకంగా సమావేశమైన ఠాకూర్... చీఫ్ కోచ్ అంశంపై చర్చించినట్లు సమాచారం. జస్టిస్ లోథా కమిటీ తీర్పును పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన వర్కింగ్ గ్రూప్ కమిటీ ఈనెల 28లోపు తమ తుది నివేదికను ఇవ్వనుంది. భాగస్వాములందరి నుంచి సలహాలు, సూచనలు స్వీకరించామని, వర్కింగ్ కమిటీ సమావేశంలోపు తుది నివేదికను అందజేస్తామని ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా వెల్లడించారు.