ఆ ఆరుగురినీ రిలీవ్ చేయం
ఐదుగురు ఐఏఎస్‌లు, ఐపీఎస్ అనురాధపై కేంద్రానికి ఏపీ ప్రభుత్వం లేఖ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు కేటాయించిన ఐదుగురు ఐఏఎస్ అధికారులతో పాటు ఐపీఏస్ అధికారి, అదనపు డీజీ అనురాధను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు బుధవారం కేంద్ర వ్యక్తిగత సిబ్బంది శిక్షణ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి భాస్క ర్ కుల్బేకు లేఖ రాశారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న సిద్ధార్థ జైన్‌ను తెలంగాణకు కేటాయించగా ఏపీ ప్రభుత్వానికి ఆయన సేవలు అవసరమని,ఆంధ్రాలోనే కొనసాగించాలని సీఎస్ లేఖలో వివరించారు.
అలాగే సీఎం ముఖ్యకార్యదర్శిగా పనిచేస్తున్న అజయ్ సహానీని తెలంగాణకు కేటాయించారు. అజయ్‌నూ ఏపీలోని కొనసాగించాలని సీఎస్ ఆ లేఖలో కోరారు. మదనపల్లి డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న ఆర్.వి. కర్ణన్, పారిశ్రామిక మౌలిక సదుపాయాలు పెట్టుబడుల శాఖ కార్యదర్శి అజయ్‌జైన్, ఏపీ.భవన్లో రెసిడెంట్ కమిషనర్‌గా పనిచేస్తున్న ఏకే సింఘాల్‌ను ఐఏఎస్‌ల పంపిణీలో తెలంగాణకు కేటాయించారు. వారి సేవలు ఆంధ్రప్రదేశ్‌కు అవసరముందని, ఈ నేపథ్యంలో ఈ ఐదుగురు ఐఏఎస్‌లను రిలీవ్ చేయబోమని, ఇందుకు అనుమతించాల్సిందిగా సీఎస్ రాసిన లేఖలో కేంద్రాన్ని కోరారు. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ అదనపు డీజీగా పనిచేస్తున్న అనురాధను ఐపీఎస్‌ల పంపిణీలో తెలంగాణకు కేటాయించారు.అమె సేవలు ఏపీలోఅవసరం ఉన్నందున ఆమెను కూడా రిలీవ్ చేయబోమని, ఇందుకు అనుమతించాలని సీఎస్ లేఖలో కోరారు. తెలంగాణకు కేటాయించిన 50 మంది ఐఏఎస్ అధికారులను ఈ నెల 2వ తేదీన కేబినెట్ భేటీ ముగిసేవరకూ రిలీవ్ చేయకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. సాధారణంగా డిసెంబర్ నెలాఖరులోగా రిలీవ్ చేసినట్లైతే వేతనాలు సమస్య ఉండదనే అభిప్రాయం అధికార వర్గాల్లో వ్యక్తమైంది. మంత్రివర్గ సమావేశం వల్ల రిలీవ్ చేయడాన్ని వాయి దా వేశారు.
కొత్త పారిశ్రామిక విధానం...
సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ నెల 2వ తేదీన జరిగే మంత్రివర్గ సమావేశంలో కొత్త పారిశ్రామిక విధానాన్ని అమోదించనున్నారు. ఇతర రాష్ట్రాల్లో కన్నా అత్యధిక రాయితీలతోపాటు విద్యుత్ రాయితీలతో కూడిన పారిశ్రామిక విధానాన్ని రూపొందించారు. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించనున్నారు.అత్యధిక రాయితీలతో పెట్టుబడిదారులను ఆకర్షించే విధంగా విధానం ఉండనుందని తెలుస్తోంది.