ఆ ఐపీఎస్కి మరో నెలలో పెళ్లి... అంతలోనే...
చెన్నై, సాక్షి ప్రతినిధి:పోలీస్‌శాఖలో ఉన్నతమైన ఉద్యోగం, మరో నెలలో పెళ్లి....ఇంతలోనే ఏమైందో ఏమో ఐపీఎస్ అధికారి హరీష్ ఆకస్మిక మృతి. అవినీతి నిరోధక శాఖ (చెన్నై) అదనపు ఎస్పీ హరీష్ (33) చెన్నైలోని తన పోలీస్ క్వార్టర్స్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం ఆయన బంధువులను కలవరపాటుకు గురిచేసింది. చెన్నై ఏసీబీ విభాగంలో అదనపు ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఎన్ హరీష్‌ది ఆత్మహత్య లేక గుండెపోటా అనే కోణంలో విచారణ జరుగుతోంది. అయితే పోలీసులు అన్ని విషయాలను గోప్యంగా ఉంచుతున్నారు. హరీష్ మృతి నేపథ్యంలో శాఖాపరంగా సాగుతున్న విచారణ ఇతర అంశాలు వెలుగు చూడకున్నా కుటుంబ పరంగా అనేక విషాద కోణాలు వెల్లడయ్యాయి.
ఆత్మహత్యకు పాల్పడిన హరీష్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన హరీష్ 2009లో ఐపీఎస్ ముగించి, తమిళనాడు, తూత్తుకూడిలో శిక్షణ పూర్తిచేసుకున్నారు. ఐపీఎస్ అధికారులు తాము పనిచేస్తున్న రాష్ట్రానికి చెందిన భాషలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంది. ఈ నిబంధన ప్రకారం హరీష్ తమిళ భాషా పరీక్షలకు అనేకసార్లు హాజరయ్యారు. తొమ్మిది సార్లు పరీక్ష రాసినా ఫెయిల్ అయినట్లు తెలుస్తోంది. తన పదోన్నతికి తమిళ పరీక్ష ఆటంకంగా మారిందనే వ్యథతో మద్యానికి బానిసైనట్లు సమాచారం. అంతేగాక విధుల్లో ఆయన పాటిస్తున్న నిబద్దతను కొందరు ఉన్నతాధికారులు సహించలేక పోయినట్లు సమాచారం. ఈ విషయాన్ని మనసులో పెట్టుకుని గత డీజీపీ రామానుజం శాఖాపరమైన విచారణకు ఆదేశించడం, కొందరు ఉన్నతాధికారులు అకారణంగా వేధింపులకు పాల్పడడంతో హరీష్ ఆవేదన చెందేవాడని చెబుతున్నారు.
ఓదార్చేవారు కరువైన ఒంటరి జీవితం ఆయనకు మరింతగా కృంగదీసింది. ఇదిలా ఉండగా, బంధువుల అమ్మాయితో వచ్చేనెల 21వ తేదీన హరీష్‌కు వివాహం నిశ్చయమైంది. వధువు సైతం ఇంజనీరింగ్ పూర్తిచేసింది. పెళ్లి ఆహ్వాన పత్రికలు సైతం అచ్చువేసి ఉన్నారు. ఐపీఎస్ అధికారితో వివాహమని వధువు తల్లిదండ్రులు మురిసిపోతూ పెళ్లి ఘడియ కోసం ఎదురుచూస్తున్నారు. ఆలస్యంగానైనా మంచి సంబంధం కుదిరిందని హరీష్ తల్లిదండ్రులు సైతం ఆనందించారు. ఇంతలో పిడుగులాంటి వార్త విని హతాశులయ్యారు. హరీష్ అనుమానాస్పద స్థితిలో మరణించాడని తెలుసుకున్న వధువు బాధతో కుప్పకూలిపోయింది. తండ్రి నాగప్పరాజ బంధువులు గురువారం రాత్రి చెన్నై చేరుకున్నారు. పోస్ట్‌మార్టం ముగిసిన అనంతరం శుక్రవారం హరీష్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. హరీష్ మృతదేహానికి సమీపంలో బిరియానీ పొట్లం, మద్యం బాటిల్ కనుగొన్నారు.
మద్యంలో విషం కలుపుకుని ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అనుమానిస్తున్నారు. అయితే హరీష్ బంధువులు హత్యగా అనుమానిస్తున్నారు. అతనికి ఎటువంటి చెడు అలవాట్లు లేవు కాబట్టి అనారోగ్యంతో మరణించే అవకాశాలు లేవని చెప్పారు. ఆత్మహత్యకు పాల్పడేంత పిరికివాడు కాదని పేర్కొన్నారు. పోలీస్‌శాఖలో హరీష్ అంటే గిట్టని వారు కడతేర్చారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. మరణానికి దారితీసిన కారణాలు ఏవైనా తమ బిడ్డ దూరమయ్యాడని మీడియా వద్ద హరీష్ తండ్రి నాగరాజప్ప భోరుమని విలపించాడు.
వేధింపులకు పాల్పడలేదు: మాజీ డీజీపీ రామానుజం
తాను వేధింపులకు పాల్పడడం, పదోన్నతి కల్పించక పోవడం వల్లనే హరీష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని వస్తున్న ఆరోపణలను మాజీ డీజీపీ రామానుజం శనివారం ఒక ప్రకటనలో ఖండించారు. ఇవి పూర్తిగా నిరాధారమైన ఆరోపణలని అన్నారు. తమిళ పరీక్షలో ఉత్తీర్ణత సాధించనందునే హరీష్‌కు పదోన్నతి కల్పించలేదని అన్నారు. అంతేగానీ అతనిపై ఉద్దేశపూర్వకమైన వేధింపులు, సాధింపులకు అవకాశం లేదని చెప్పారు. అతను ఎంతో నెమ్మదస్తుడు, భయస్తుడని, అతనికున్న సమస్యలను కర్ణాటక ఐపీఎస్ అధికారులతో చెప్పి పరిష్కరించి సహకరించానని తెలిపారు.