1,600 కోట్లతో 400 వంతెనలు
బషీరాబాద్ (తాండూరు): రాష్ట్రంలో మూడున్నర ఏళ్లలో రూ. 1,600 కోట్లతో 400 వంతెనల నిర్మాణం చేపట్టినట్లు రోడ్లు, భవనాల శాఖ చీఫ్ ఇంజనీర్ రవీందర్రావు తెలిపారు. ఇందులో ఇరిగేషన్ కోసం 150 చెక్‌డ్యామ్‌లను నిర్మించినట్లు చెప్పారు. ప్రధానంగా గోదావరి నదిపై 5, కృష్ణానదిపై 2 భారీ వంతెనల పనులు శరవేగంగా జరుగుతున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటికే 162 వంతెనల నిర్మాణాలు పూర్తిచేసినట్లు చెప్పారు. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో 82 భారీ వంతెనల నిర్మాణం జరుగుతోందన్నారు.
గురువారం ఆయన వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం జీవన్గీలో కాగ్నా నదిపై రూ.13.40 కోట్లతో నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడారు. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న వంతెనలను వచ్చే ఏడాది జూన్‌లోపు పూర్తిచేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 6,017 కి.మీ. పొడవున ఉన్న డబుల్‌లేన్ రోడ్లను రాష్ట్ర ప్రభుత్వం రూ. 4,500 కోట్ల నిధులు ఖర్చు చేసి 4 రెట్ల మేర విస్తరించినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 10,450 కి.మీ. డబుల్‌లేన్ రోడ్లు నిర్మాణం అయినట్లు పేర్కొన్నారు.
10 సంవత్సరాల వరకు మరమ్మతులకు గురికాకుండా ఉండే విధంగా నాణ్యత ప్రమాణాలు తీసుకుంటున్నామని చెప్పారు. రాబోయే రోజుల్లో ఆధునిక సాంకేతిక పద్ధతులను ఉపయోగించి రోడ్ల నిర్మాణాలు చేపట్టనున్నట్లు తెలిపారు. నిజామాబాద్ జిల్లా లో ప్రయోగాత్మకంగా ‘సాయిల్ స్టెబిలైజేషన్’ పద్ధతిలో రోడ్ల నిర్మాణం చేసినట్లు పేర్కొన్నారు. మిషన్ భగీరథ పైపులైన్ల కోసం తవ్విన రోడ్లను కాంట్రాక్టర్లే సీసీతో మరమ్మతులు చేయాల్సి ఉందని, దీనికి సంబంధించి ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఆర్అండ్బీ ఎస్ఈ రమేశ్‌బాబు ఉన్నారు.