irrigation associations election
-
ఎన్నికలు బహిష్కరణ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సాగు నీటి సంఘాల ఎన్నికలను అప్రజాస్వావిుకంగా నిర్వహిస్తున్న కూటమి ప్రభుత్వ వైఖరికి నిరసనగా, ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ రీజనల్ కో – ఆర్డినేటర్లు, అన్ని జిల్లాల అధ్యక్షులతో పార్టీ స్టేట్ కో– ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సాగు నీటి సంఘాల ఎన్నికల్లో ప్రభుత్వ సూచనలతో ఆయా జిల్లాల్లో అధికార యంత్రాంగం వ్యవహరించిన తీరును సమీక్షించారు. టెలి కాన్ఫరెన్స్‌లో పలువురు నేతలు మాట్లాడుతూ.. ‘సాగునీటి సంఘాల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ పోటీ చేస్తున్న చోట్ల రెవెన్యూ, పోలీస్ యంత్రాంగాన్ని ప్రయోగించి, కూటమి ప్రభుత్వం దారుణంగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. పోటీ ఉన్న చోట సీక్రెట్ బ్యాలెట్ ప్రకారం ఎన్నికలు జరపాలి. ఆ బాధ్యత ప్రభుత్వ యంత్రాగానిది. అయితే అందుకు పూర్తి భిన్నంగా కూటమి ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు ఏకపక్షంగా నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారు. ఈ ఎన్నికల్లో పాల్గొనాలని నిర్ణయించిన వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై దౌర్జన్యాలకు దిగుతున్నారు. పోలీసులను ప్రయోగించి తప్పుడు కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. అభ్యర్థులకు నీటి పన్నుకు సంబంధించి నో డ్యూ సర్టిఫికెట్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. ఇదేంటని ప్రశ్నించిన నేతలను హౌస్ అరెస్ట్‌లు చేయడం వంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. కూటమి పార్టీలకు చెందిన వారు గెలిచే అవకాశం లేకపోయినా, దౌర్జన్యంతో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎలాగైనా సరే గెలవాలని రౌడీయిజానికి దిగుతున్నారు. వాటిని వెలుగులోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నించిన మీడియాపై కూడా దాడులకు తెగబడుతున్నారు. కూటమి ప్రభుత్వ దాష్టీకానికి నిరసగా ఈ ఎన్నికలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉండాలి’ అని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల్లోని నేతల నుంచి వచ్చిన స్పందన, అభిప్రాయాలను సజ్జల రామకృష్ణారెడ్డి.. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌కు నివేదించారు. అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకున్న వైఎస్ జగన్.. కూటమి ప్రభుత్వ దుర్మార్గ వైఖరికి నిరసనగా సాగు నీటి సంఘాల ఎన్నికలను వైఎస్సార్సీపీ బహిష్కరించాలని నిర్ణయించారని సజ్జల తెలిపారు. -
మా ప్రభుత్వం.. మా ఇష్టం!
సాక్షి, అమరావతి :రాష్ట్రంలో సాగు నీటి సంఘాల ఎన్నికలను సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అపహాస్యం చేస్తోంది. సాగు నీటి వినియోగదారుల సంఘాలు, డిస్ట్రిబ్యూటరీ కమిటీలు, ప్రాజెక్టు కమిటీలను తమ మద్దతుదారులకే కట్టబెట్టి, దోచుకోవాలనే దురాలోచనతో అరాచకాలకు తెరలేపింది. ఆ క్రమంలోనే ‘చేతులెత్తి ఎన్నుకునే విధానం’ ద్వారా వాటికి ఎన్నికలు నిర్వహించేలా చట్టాన్ని సవరించింది. దీనిపై రైతులు హైకోర్టును ఆశ్రయించడంతో ఏకాభిప్రాయం వ్యక్తం కాని చోట రహస్య బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది.ఇతర పార్టీల మద్దతుదారులు పోటీకి సిద్ధమైతే రహస్య బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతుంది. అలా ఎన్నికలు నిర్వహిస్తే ఫలితాలు ఎలా ఉంటాయన్నది గుర్తెరిగిన కూటమి ప్రభుత్వం అరాచకాలకు తెరతీసింది. ఇతర పార్టీల మద్దతుదారులు సాగు నీటి సంఘాల ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేకుండా గ్రామ సచివాలయాల్లో నో డ్యూ సర్టిఫికెట్లు ఇవ్వకుండా అడ్డుకుని కుట్ర చేస్తోంది. నో డ్యూ సర్టిఫికెట్ల కోసం తహసిల్దార్ కార్యాలయానికి వచ్చిన ఇతర పార్టీల మద్దతుదారులపై పోలీసుల సమక్షంలోనే టీడీపీ నేతలు దాడులకు దిగుతూ భయోత్పాతం సృష్టిస్తున్నారు. శుక్రవారం వైఎస్సార్ జిల్లా పులివెందుల, జమ్మలమడుగు నియోజకవర్గాల్లో చోటుచేసుకున్న ఘటనలే ఇందుకు నిదర్శనం.కూటమి నేతలకే పదవులు! సంప్రదింపులు, ఏకాభిప్రాయం ముసుగులో టీడీపీ కూటమి నేతలు, కార్యకర్తలకు పదవులు పంచి పెట్టేలా 2018లో సవరించిన సాగు నీటి సంఘాల చట్టాన్ని ఆయుధంగా వాడుకుంటోంది. ఈ మేరకు సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించేలా 2019 ఫిబ్రవరి 8న జారీ చేసిన ఉత్తర్వుల (జీవో ఎంఎస్ నంబరు 20)ను ఉపయోగించుకుంటోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం 49,020 ప్రాదేశిక నియోజకవర్గాలు (టీసీ), 6,149 సాగునీటి వినియోగదారుల సంఘాలు (డబ్ల్యూయూఏ), 245 డిస్ట్రిబ్యూటరీ కమిటీలు, 53 ప్రాజెక్టు కమిటీలకు ఎన్నికలు నిర్వహించడానికి 26 జిల్లాల కలెక్టర్లు ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేశారు. సాగునీటి వినియోగదారుల సంఘాలకు శనివారం.. డిస్ట్రిబ్యూటరీ కమిటీలకు ఈనెల 17న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల పేరుతో తాము ఎంపిక చేసిన నేతలు, కార్యకర్తలకే సాగు నీటి సంఘాల పదవులను టీడీపీ కూటమి పెద్దలు కట్టబెట్టడానికి రంగం సిద్ధం చేశారు. రాష్ట్రంలో భారీ ప్రాజెక్టుల కింద 21,03,825 హెక్టార్లు, మధ్య తరహా ప్రాజెక్టుల కింద 1,85,804 హెక్టార్లు, చిన్న నీటి వనరుల విభాగంలో 5,55,056 హెక్టార్లు.. వెరసి 28,44,685 హెక్టార్ల ఆయకట్టు ఉంది. నీటి వృథాకు అడ్డుకట్ట వేసి.. యాజమాన్య పద్ధతుల ద్వారా ఆయకట్టు చివరి భూములకు నీళ్లందించి, దిగుబడులు పెంచాలన్న లక్ష్యంతో సాగు నీటి సంఘాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వాటికి 2014 వరకు సాధారణ ఎన్నికల తరహాలోనే ఎన్నికలు నిర్వహించింది. ఆయకట్టు రైతులు తమ ఓటు ద్వారా ప్రాదేశిక నియోజకవర్గాల ప్రతినిధులు, సాగునీటి సంఘాలు, డిస్ట్రిబ్యూటరీ, ప్రాజెక్టు కమిటీల అధ్యక్షులను ఎన్నుకునేవారు. కానీ.. టీడీపీ కూటమి ప్రభుత్వం 2018లో ఆ విధానానికి స్వస్తి పలుకుతూ సంప్రదింపులు, ఏకాభిప్రాయం ముసుగులో తమ వారికే పదవులు కట్టబెట్టేలా చట్టాన్ని సవరించి, సాగునీటి సంఘాలను నీరుగార్చింది. » వైఎస్సార్ జిల్లాలో సాగునీటి వినియోగదారుల సంఘాల ఎన్నికల నేపథ్యంలో తహసీల్దార్ కార్యాలయాల వద్ద టీడీపీ శ్రేణులు మోహరించాయి. ఎక్కడికక్కడ వీఆర్వోల నుంచి వైఎస్సార్సీపీ మద్దతుదారులైన రైతులకు నో డ్యూస్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఒత్తిడి తెచ్చారు. చక్రాయపేట, వేముల, వేంపల్లెల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగింది. వేంపల్లెలో నో డ్యూస్ సర్టిఫికెట్లు ఇచ్చేందుకు సిద్దమైన వీఆర్వోలను మండల టీడీపీ నాయకుడి కుమారుడు బూతు పురాణం అందుకున్నారు. జమ్మలమడుగు నియోజకవర్గంలోని పెద్దముడియంలో వీఆర్వోలందరినీ ప్రత్యేక వాహనంలో ఎక్కించుకుని టీడీపీ నేతలు సమయం ముగిసేంతవరకు తమ ఆధీనంలో పెట్టుకున్నారు. అలా చేయడంపై ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి అధికారులకు ఫిర్యాదు చేశారు.నీటి తీరువా బకాయిలు ఉంటే పోటీకి నో..సాగు నీటి సంఘాల ఎన్నికల్లో పోటీ చేయాలంటే నీటి తీరువా బకాయిలు ఉండకూడదు. ఎన్నికల్లో పోటీ చేసే వారు నీటి తీరువా బకాయిలు లేవని వీఆర్వోల నుంచి నో డ్యూ సర్టిఫికెట్లు తీసుకోవాలి. సాధారణంగా నో డ్యూ సర్టిఫికెట్లను ఆ సాగునీటి సంఘాల పరిధిలోని గ్రామ సచివాలయాల్లో వీఆర్వోలు జారీ చేస్తారు. అయితే ఇప్పుడు సాగు నీటి సంఘాల ఎన్నికల నేపథ్యంలో నో డ్యూ సర్టిఫికెట్లు జారీ చేయవద్దని వీఆర్వోలకు కూటమి ప్రజాప్రతినిధులు హుకుం జారీ చేశారు. దాంతో నో డ్యూ సర్టిఫికెట్ల కోసం ఆ మండల తహసిల్దార్ కార్యాలయాలకు వెళ్లిన ఇతర పార్టీల మద్దతుదారులపై పోలీసుల సమక్షంలోనే కూటమి శ్రేణులు దాడులు చేసి.. భయోత్పాతానికి గురిచేస్తున్నాయి.అంతటా అదే తీరుసాక్షి నెట్వర్క్ : సాగు నీటి సంఘాల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారులపై పోటీ చేసి గెలవలేమనే భయంతో అధికార కూటమి పార్టీల నేతలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ కుట్రలకు తెరలేపారు. కర్నూలు జిల్లా కోడుమూరు ఎల్ఎల్సీ పరిధిలోని గోరంట్ల 45 డిస్ట్రిబ్యూటరీ కింద 10 టీసీలకు నీటి తీరువ పన్ను కట్టేందుకు మండలంలోని వెంకటగిరి గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ మద్దతుదారులైన రైతులు వెళ్లారు. అయితే తహసీల్దార్ పన్ను కట్టించుకోవద్దని చెప్పారంటూ కోడుమూరు, ముడుమలగుర్తి, ఎర్రదొడ్డి వీఆర్వోలు వారిని తిప్పి పంపేందుకు యత్నించారు. దీంతో ఆగ్రహించిన రైతులు తహసీల్దార్ వెంకటేష్ నాయక్ కార్యాలయం బయట రోడ్డుపై బైఠాయించారు.» ఏలేరు పరీవాహక ప్రాంతాల్లో అత్యంత కీలకమైన నియోజకవర్గం పిఠాపురం. ఏలేరు ఆధునీకరణకు భారీగా నిధులు విడుదల చేసే అవకాశం ఉండడంతో వాటిపై పెత్తనం చెలాయించడానికి మెట్ట ప్రాంత టీడీపీ నేత ప్రోద్బలంతో డిస్ట్రిబ్యూటరీ కమిటీ(డీసీ)ల సంఖ్యను ఆరుకు, నీటి సంఘాలను 30కి పెంచేశారు. ఈ విభజన కూడా అస్తవ్యస్తంగా చేశారు. పిఠాపురం మండలం రాపర్తి, భోగాపురం, బి.ప్రత్తిపాడు గ్రామాల్లో 400 మంది రైతుల పేర్లు జాబితా నుంచి తొలగించారు. పిఠాపురం నియోజకవర్గంలోని 36 నీటి సంఘాల్లో 16 టీడీపీ, 20 జనసేన మద్దతుదారులు గెలిచేలా లక్ష్యంగా పెట్టుకుని దౌర్జన్యాలకు తెరలేపారు. » చిత్తూరు జిల్లా పెద్ద పంజాణి మండలం చలమంగళం పెద్ద చెరువు సాగునీటి వినియోగదారుల సంఘం ఎన్నిక పోటీ చేసేందుకు రైతులకు అవసరమైన సర్టిఫికెట్లు ఇవ్వడంలో వీఆర్వో రత్నప్ప ఏకపక్షంగా వ్యవహరించాడని రైతులు మండిపడ్డారు. శుక్రవారం ఉదయం సచివాలయానికి వచ్చిన ఆయన అవసరమైన రైతులకు ఓటరు లిస్టు మాత్రం అందజేసి, భోజనం తర్వాత నో డ్యూ సర్టిఫికెట్లు ఇస్తానని చెప్పి వెళ్లిపోయారు. సాయంత్రం వరకు రైతులు వేచి ఉన్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అయితే టీడీపీ సానుభూతి పరులకు మాత్రం నో డ్యూ సర్టిఫికెట్లు ఇవ్వడం గమనార్హం.» కృష్ణా జిల్లాలో అధికార పార్టీ కనుసన్నల్లో నీటి సంఘాల ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన శాసనసభ్యులు.. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నుంచి ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలో, ఎవర్ని ఎన్నుకోవాలో కింది స్థాయి నాయకులకు ఇప్పటికే ఆదేశించినట్లు తెలుస్తోంది. అధ్యక్షులు, ఉపాధ్యక్షుల పేర్లు కూడా ఆయా నియోజకవర్గాల శాసనసభ్యులు సూచించి, ఆ విధంగా ఎన్నిక నిర్వహించాలని అధికారులకు దిశా నిర్దేశం చేసినట్లు సమాచారం» ఎన్టీఆర్ జిల్లాలో 1978 ప్రాదేశిక నియోజకవర్గాలకు(టీసీ), 242 సాగునీటి సంఘాలకు సంబంధించి ఎవరెవరిని ఎన్నుకోవాలో ఆయా ప్రాంత ఎమ్మెల్యేలు ఇప్పటికే పేర్లు ఖరారు చేశారు. ఆ మేరకు వారు ఎన్నికయ్యేలా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. » చిత్తూరు జిల్లా ఐరాల మండలం పుల్లూరులో నేరేడు చెరువు సాగు నీటి సంఘం పరిధిలోని 70 మంది రైతుల పేర్లను ఓటర్ల జాబితాలోంచి తొలగించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ఓట్లు వేశారనే నెపంతో ఇలా చేశారు. బాధిత రైతులు ఎంఎస్.లోకనాథ్‌రెడ్డి, బీఎం.గోవింద్‌రెడ్డి, పీఎం.సుధాకర్‌రెడ్డి, ఎం.సురేంద్రరెడ్డి, రవి, గణపతి ఆచారి, సురేంద్ర తదితరులు తహసీల్దార్ కార్యాలయాన్ని సంప్రదించగా అక్కడ ఎవరూ స్పందించలేదు. రైతుల అర్జీని ఫిర్యాదుల బాక్స్‌లో వేసి వెళ్లాలని కంప్యూటర్ ఆపరేటర్ సూచించగా తుదకు అలానే చేయాల్సి వచ్చింది. -
ప్రజాస్వామ్యం అపహాస్యం
అనంతపురం అగ్రికల్చర్ : సాగునీటి సంఘాల ఎన్నికల్లో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలయింది. అధికార పార్టీ నేతలకు యంత్రాంగం దాసోహం కావడంతో చాలా చోట్ల ఎన్నికలు ఏకపక్షంగా సాగాయి. అధికార పెత్తనంతో తెలుగుతమ్ముళ్లు సంఘాలను దక్కించుకున్నారు. సాధ్యంకాని ప్రాంతాల్లో ఏదో సాకు చూపి ఎన్నికలను అధికారులు వాయిదా వేశారు. అడుగడుగునా సాగిన అధికార దుర్వినియోగానికి నిరసనగా చాలా చోట్ల వైఎస్సార్సీపీ మద్ధతు దారులు ఎన్నికలను బాయ్‌కాట్ చేయడంతో ఏకపక్షంగా సాగాయి. జిల్లా వ్యాప్తంగా శనివారం సాగునీటి సంఘాల ఎన్నికలు ప్రారంభమయ్యాయి. జిల్లాలో మొత్తం 373 సాగునీటి సంఘాలు ఉండగా అందులో 48 సంఘాలు హెచ్ఎల్సీ పరిధిలో ఉన్నాయి. తొలిరోజు ఆ సంఘాలకు ఎన్నికలు నిర్వహించారు. సాధారణ ఎన్నికలను తలపించేలా ప్రజాస్వామ్య బద్ధంగా గతంలో వీటికి బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించగా ప్రస్తుత ప్రభుత్వం తమకు అనుకూలంగా ఎన్నిక విధానంలో మార్పు చేశారు. సంఘాల కార్యవర్గాన్ని 12 మంది నుంచి ఆరుగురికి కుదించడంతో పాటు అందరినీ సమావేశ పరిచి ఎంపిక ప్రక్రియ నిర్వహించాలని ఆదేశించారు. దీంతో మొదటి రోజే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన టీడీపీ నేతలు పలు సంఘాలను దక్కించుకున్నారు. రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులతో పాటు పోలీసు యంత్రాంగం చాలా చోట్ల అధికార పార్టీకి అండగా నిలబడి సహకరించడంతో ఏకగ్రీవం అయ్యాయి. హిందూపురం రూరల్ మండలంలో గుడ్డంపల్లి, బీరేపల్లి, మలుగూరు, చెలివెందల, చిలమత్తూరు మండలం చిలమత్తూరు, కోడూరు సంఘాల ఎన్నికలు కేవలం 20 నిమిషాల్లో ముగించేశారంటే అధికార దర్పం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. తనకల్లు మండలం సీఆర్ పల్లి సంఘం ఎన్నికల సమావేశానికి వైఎస్సార్సీపీకి చెందిన ఓటర్లు రాకమునుపే హడావిడిగా టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవం చేసుకున్నారు. అదే మండలం మల్లిరెడ్డిపల్లి సంఘాన్ని టీడీపీ దక్కించుకుంది. 2 వేల మంది ఓటర్లు కలిగిన శింగనమల సాగునీటి సంఘం ఎన్నికలకు వైఎస్సార్సీపీకి చెందిన ఆయకట్టు ఓటర్లు పెద్ద సంఖ్యలో హాజరై ఆరుగురు డెరైక్టర్ల పేర్లు ఇవ్వడం, అదే సంఖ్యలో టీడీపీ నుంచి పోటీ పడటంతో వాయిదా వేశారు. అదే మండలం సలకంచెరువు సంఘం ఎన్నికల్లో కూడా ఇదే పరిస్థితి ఎదురుకావడంతో వాయిదా వేశారు. బుక్కరాయసముద్రం మండలం కొర్రపాడు ఎన్నిక వాయిదా పడింది. నార్పల, యల్లనూరు మండలం యల్లనూరు, కల్లూరు సంఘాలు టీడీపీ ఏకపక్షం చేసుకుంది. పుట్లూరు మండలం కడవకల్లులో వైఎస్సార్సీపీ అభ్యర్థులు రంగంలోకి దిగడంతో ఎన్నిక వాయిదా వేయగా, శెనగలగూడూరును టీడీపీ దక్కించుకుంది. కనేకల్లు మండలం హెచ్ఎల్సీ 6-బీ డిస్ట్రిబ్యూటరీ సాగు సంఘం ఎన్నికలు బెనకల్ గ్రామంలో నిర్వహించారు. 1,100 మంది ఓటర్లలో 70 శాతం మంది వైఎస్సార్సీపీకి మద్ధతుగా కరిబసప్పను అధ్యక్షుడిగా చేయాలని పట్టుపట్టడంతో అధికారులు ఇరు పార్టీల నుంచి ముగ్గురు అభ్యర్థుల పేర్లను నమోదు చేసుకున్నారు. అదే మండలం ఊడేగోళంలో జరిగిన 7 డిస్ట్రిబ్యూటరీ సంఘ ఎన్నికను వాయిదా వేశారు. రెండు పార్టీల నుంచి ఆరుగురు అభ్యర్థులు రంగంలోకి దిగడంతో నిబంధనలు ఒప్పుకోవని వాయిదా వేశారు. బొమ్మనహాల్ మండలం హరేసముద్రం, కొలగానహళ్లి, బొళ్లనగుడ్డం సంఘాలను తెలుగుతమ్ముళ్లు ఏకపక్షం చేసుకున్నారు. గాండ్లపెంట మండలం పోరెడ్డివారిపల్లి సంఘం అధ్యక్ష పీఠం టీడీపీ, ఉపాధ్యక్ష స్థానాన్ని వైఎస్సార్సీపీ అభ్యర్థులు దక్కించుకున్నారు. కదిరి అర్బన్ మండలం కౌలేపల్లి సంఘం వాయిదా పడగా, గంగన్నవారిపల్లి సంఘాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. తాడిపత్రి మండలం చిన్నపొలమడ, పెద్దపొలమడ, వెంకటాంపల్లి సంఘాలను తెలుగుతమ్ముళ్లు ఏకపక్షం చేసుకున్నారు. భోగసముద్రంలో వైఎస్సార్సీపీ అభ్యర్థులు పోటీ పడటంతో వాయిదా వేశారు. పెద్దవడుగూరు, దిమ్మగుడి సంఘాలను టీడీపీ నేతలు దక్కించుకున్నారు. మడకశిర మండలం చందకచర్ల, అమరాపురం మండలం వలసలో అధికార పార్టీ నేతలు దక్కించుకున్నారు. గుత్తి మండలం పెద్దొడ్డి 1, 2, 3 సంఘాల ఎన్నికలు ఏకపక్షంగా కొనసాగాయి. గుంతకల్లు మండలం పాతకొత్తచెరువులో టీడీపీ అధ్యక్ష పదవి, వైఎస్సార్సీపీ అభ్యర్థి ఉపాధ్యక్ష పదవిని పొందారు. వైటీ చెరువు సంఘం ఎన్నిక ఏకపక్షమైంది. పెనుకొండ మండలం కోనాపురం, కురుబవాండ్లపల్లి, పరిగి మండలం పరిగి, శిరేగోళం, సోమందేపల్లి మండలం మాగేచెరువు, చల్లాపల్లి సంఘాలను తెలుగుతమ్ముళ్లు ఏకపక్షంగా కైవసం చేసుకున్నారు. రొద్దం మండలం కలిపి ఏకపక్షం కాగా శేషాపురం సంఘ ఎన్నికల్లో ఇరు పార్టీలు రంగంలోకి దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. దీంతో ఇక్కడ ఎన్నికను వాయిదా వేశారు. తలుపుల మండలం బట్రేపల్లి సంఘాన్ని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి కైవసం చేసుకోగా, పులిగుండ్లపల్లి సంఘాన్ని టీడీపీ దక్కించుకుంది. ఎన్నికలు ఏకపక్షంగా జరుగుతున్నాయి : వైఎస్సార్సీపీ జిల్లాలో తాగునీటి సంఘం ఎన్నికలు ఏకపక్షంగా జరుగుతున్నాయని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎం. శంకర్‌నారాయణ శనివారం ఓ ప్రకటనలో ఆరోపించారు. అధికార పార్టీ నాయకులు ప్రభుత్వాధికారులను భయబ్రంతులకు గురి చేస్తూ.. ఏకపక్షం చేసుకుంటున్నారన్నారు. వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీకి చెందిన వారికి ఎన్నికల్లో పోటీచేసే అవకాశం ఉన్నప్పటికి అధికారులు కేవలం అధికారపార్టీకి చెందిన పేర్లను మాత్రమే పరిశీలనలోకి తీసుకుంటున్నారన్నారు. తమ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నీ పాలన ఇదేనా..? అని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. అధికారులు వ్యవహరిస్తున్న తీరు అప్రజాస్వామికమన్నారు. ప్రభుత్వాధికారులు అధికార పార్టీ నాయకుల కోసం పనిచేయకుండా రైతుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ ఎన్నికల్లో అన్ని పార్టీలకు చెందిన వారు స్వేచ్ఛగా పాల్గొనే విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుందని హితువు పలికారు.