అనంతపురం అగ్రికల్చర్ : సాగునీటి సంఘాల ఎన్నికల్లో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలయింది. అధికార పార్టీ నేతలకు యంత్రాంగం దాసోహం కావడంతో చాలా చోట్ల ఎన్నికలు ఏకపక్షంగా సాగాయి. అధికార పెత్తనంతో తెలుగుతమ్ముళ్లు సంఘాలను దక్కించుకున్నారు. సాధ్యంకాని ప్రాంతాల్లో ఏదో సాకు చూపి ఎన్నికలను అధికారులు వాయిదా వేశారు. అడుగడుగునా సాగిన అధికార దుర్వినియోగానికి నిరసనగా చాలా చోట్ల వైఎస్సార్‌సీపీ మద్ధతు దారులు ఎన్నికలను బాయ్‌కాట్ చేయడంతో ఏకపక్షంగా సాగాయి. జిల్లా వ్యాప్తంగా శనివారం సాగునీటి సంఘాల ఎన్నికలు ప్రారంభమయ్యాయి.
జిల్లాలో మొత్తం 373 సాగునీటి సంఘాలు ఉండగా అందులో 48 సంఘాలు హెచ్‌ఎల్‌సీ పరిధిలో ఉన్నాయి. తొలిరోజు ఆ సంఘాలకు ఎన్నికలు నిర్వహించారు. సాధారణ ఎన్నికలను తలపించేలా ప్రజాస్వామ్య బద్ధంగా గతంలో వీటికి బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించగా ప్రస్తుత ప్రభుత్వం తమకు అనుకూలంగా ఎన్నిక విధానంలో మార్పు చేశారు. సంఘాల కార్యవర్గాన్ని 12 మంది నుంచి ఆరుగురికి కుదించడంతో పాటు అందరినీ సమావేశ పరిచి ఎంపిక ప్రక్రియ నిర్వహించాలని ఆదేశించారు. దీంతో మొదటి రోజే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన టీడీపీ నేతలు పలు సంఘాలను దక్కించుకున్నారు. రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులతో పాటు పోలీసు యంత్రాంగం చాలా చోట్ల అధికార పార్టీకి అండగా నిలబడి సహకరించడంతో ఏకగ్రీవం అయ్యాయి.
హిందూపురం రూరల్ మండలంలో గుడ్డంపల్లి, బీరేపల్లి, మలుగూరు, చెలివెందల, చిలమత్తూరు మండలం చిలమత్తూరు, కోడూరు సంఘాల ఎన్నికలు కేవలం 20 నిమిషాల్లో ముగించేశారంటే అధికార దర్పం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. తనకల్లు మండలం సీఆర్ పల్లి సంఘం ఎన్నికల సమావేశానికి వైఎస్సార్‌సీపీకి చెందిన ఓటర్లు రాకమునుపే హడావిడిగా టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవం చేసుకున్నారు. అదే మండలం మల్లిరెడ్డిపల్లి సంఘాన్ని టీడీపీ దక్కించుకుంది. 2 వేల మంది ఓటర్లు కలిగిన శింగనమల సాగునీటి సంఘం ఎన్నికలకు వైఎస్సార్‌సీపీకి చెందిన ఆయకట్టు ఓటర్లు పెద్ద సంఖ్యలో హాజరై ఆరుగురు డెరైక్టర్ల పేర్లు ఇవ్వడం, అదే సంఖ్యలో టీడీపీ నుంచి పోటీ పడటంతో వాయిదా వేశారు.
అదే మండలం సలకంచెరువు సంఘం ఎన్నికల్లో కూడా ఇదే పరిస్థితి ఎదురుకావడంతో వాయిదా వేశారు. బుక్కరాయసముద్రం మండలం కొర్రపాడు ఎన్నిక వాయిదా పడింది. నార్పల, యల్లనూరు మండలం యల్లనూరు, కల్లూరు సంఘాలు టీడీపీ ఏకపక్షం చేసుకుంది. పుట్లూరు మండలం కడవకల్లులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు రంగంలోకి దిగడంతో ఎన్నిక వాయిదా వేయగా, శెనగలగూడూరును టీడీపీ దక్కించుకుంది.
కనేకల్లు మండలం హెచ్‌ఎల్‌సీ 6-బీ డిస్ట్రిబ్యూటరీ సాగు సంఘం ఎన్నికలు బెనకల్ గ్రామంలో నిర్వహించారు. 1,100 మంది ఓటర్లలో 70 శాతం మంది వైఎస్సార్‌సీపీకి మద్ధతుగా కరిబసప్పను అధ్యక్షుడిగా చేయాలని పట్టుపట్టడంతో అధికారులు ఇరు పార్టీల నుంచి ముగ్గురు అభ్యర్థుల పేర్లను నమోదు చేసుకున్నారు. అదే మండలం ఊడేగోళంలో జరిగిన 7 డిస్ట్రిబ్యూటరీ సంఘ ఎన్నికను వాయిదా వేశారు. రెండు పార్టీల నుంచి ఆరుగురు అభ్యర్థులు రంగంలోకి దిగడంతో నిబంధనలు ఒప్పుకోవని వాయిదా వేశారు. బొమ్మనహాల్ మండలం హరేసముద్రం, కొలగానహళ్లి, బొళ్లనగుడ్డం సంఘాలను తెలుగుతమ్ముళ్లు ఏకపక్షం చేసుకున్నారు.
గాండ్లపెంట మండలం పోరెడ్డివారిపల్లి సంఘం అధ్యక్ష పీఠం టీడీపీ, ఉపాధ్యక్ష స్థానాన్ని వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు దక్కించుకున్నారు. కదిరి అర్బన్ మండలం కౌలేపల్లి సంఘం వాయిదా పడగా, గంగన్నవారిపల్లి సంఘాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. తాడిపత్రి మండలం చిన్నపొలమడ, పెద్దపొలమడ, వెంకటాంపల్లి సంఘాలను తెలుగుతమ్ముళ్లు ఏకపక్షం చేసుకున్నారు. భోగసముద్రంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు పోటీ పడటంతో వాయిదా వేశారు. పెద్దవడుగూరు, దిమ్మగుడి సంఘాలను టీడీపీ నేతలు దక్కించుకున్నారు.
మడకశిర మండలం చందకచర్ల, అమరాపురం మండలం వలసలో అధికార పార్టీ నేతలు దక్కించుకున్నారు. గుత్తి మండలం పెద్దొడ్డి 1, 2, 3 సంఘాల ఎన్నికలు ఏకపక్షంగా కొనసాగాయి. గుంతకల్లు మండలం పాతకొత్తచెరువులో టీడీపీ అధ్యక్ష పదవి, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఉపాధ్యక్ష పదవిని పొందారు. వైటీ చెరువు సంఘం ఎన్నిక ఏకపక్షమైంది. పెనుకొండ మండలం కోనాపురం, కురుబవాండ్లపల్లి, పరిగి మండలం పరిగి, శిరేగోళం, సోమందేపల్లి మండలం మాగేచెరువు, చల్లాపల్లి సంఘాలను తెలుగుతమ్ముళ్లు ఏకపక్షంగా కైవసం చేసుకున్నారు.
రొద్దం మండలం కలిపి ఏకపక్షం కాగా శేషాపురం సంఘ ఎన్నికల్లో ఇరు పార్టీలు రంగంలోకి దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. దీంతో ఇక్కడ ఎన్నికను వాయిదా వేశారు. తలుపుల మండలం బట్రేపల్లి సంఘాన్ని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి కైవసం చేసుకోగా, పులిగుండ్లపల్లి సంఘాన్ని టీడీపీ దక్కించుకుంది.
ఎన్నికలు ఏకపక్షంగా జరుగుతున్నాయి : వైఎస్సార్‌సీపీ
జిల్లాలో తాగునీటి సంఘం ఎన్నికలు ఏకపక్షంగా జరుగుతున్నాయని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఎం. శంకర్‌నారాయణ శనివారం ఓ ప్రకటనలో ఆరోపించారు. అధికార పార్టీ నాయకులు ప్రభుత్వాధికారులను భయబ్రంతులకు గురి చేస్తూ.. ఏకపక్షం చేసుకుంటున్నారన్నారు. వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీకి చెందిన వారికి ఎన్నికల్లో పోటీచేసే అవకాశం ఉన్నప్పటికి అధికారులు కేవలం అధికారపార్టీకి చెందిన పేర్లను మాత్రమే పరిశీలనలోకి తీసుకుంటున్నారన్నారు.
తమ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నీ పాలన ఇదేనా..? అని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. అధికారులు వ్యవహరిస్తున్న తీరు అప్రజాస్వామికమన్నారు. ప్రభుత్వాధికారులు అధికార పార్టీ నాయకుల కోసం పనిచేయకుండా రైతుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ ఎన్నికల్లో అన్ని పార్టీలకు చెందిన వారు స్వేచ్ఛగా పాల్గొనే విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుందని హితువు పలికారు.
ప్రజాస్వామ్యం అపహాస్యం
Published Sun, Sep 13 2015 4:24 AM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM
Advertisement
Advertisement