సాగునీటి సంఘాల ఎన్నికల్లో అరాచకం
సర్కారు ఏకపక్ష ధోరణితోవ్యవహరించడం దారుణం
మాజీమంత్రి చెల్లుబోయిన వేణు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా
రాజమహేంద్రవరం సిటీ: సాగునీటి సంఘాల ఎన్నికల్లో టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్య విధానాలకు విరుద్ధంగా వ్యవహరించిందని తూర్పు గోదావరి జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, మాజీమంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆరోపించారు. రాజమహేంద్రవరంలోని మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా నివాసంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా టీడీపీ వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందన్నారు.
గడిచిన ఆర్నెలల్లో ప్రభుత్వం ఏమీచేయకపోవడంవల్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందని, అందుకే ఏకగ్రీవం పేరుతో విపక్ష పార్టీలను నామినేషన్లు వేయకుండా చేశారని చెల్లుబోయిన ఆరోపించారు. విపక్ష పార్టీలకు చెందిన వారికి నో డ్యూస్ సరి్టఫికెట్లు ఇవ్వకుండా చేయడానికి వీఆర్వోలను ఎమ్మార్వో ఆఫీసుల్లో ఉంచేయడం, కొన్నచోట్ల బంధించడం, వారి దగ్గరకు వెళ్లకుండా పోలీసులను ప్రయోగించి అడ్డగించడం ద్వారా నామినేషన్లు వేయకుండా చేశారన్నారు.
ఇక విజయనగరం జిల్లా ఎస్.కోటలో అయితే కూటమిలో భాగస్వామి అయిన బీజేపీకి చెందిన అభ్యరి్థనే నామినేషన్ వేయకుండా చేసి అధికార పార్టీకే కొమ్ము కాశారన్నారు. ఏమాత్రం పారదర్శకత లేకుండా కూటమి ప్రభుత్వం ఏకపక్ష ధోరణిలో వ్యవహరించడం దారుణమని చెల్లుబోయిన చెప్పారు.
రైతులు బాగా అసంతృప్తితో ఉన్నారు : జక్కంపూడి
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఒకటి ఎన్నికల తర్వాత మరొకటి చెప్పడం చంద్రబాబుకి మొదటినుంచీ అలవాటేనన్నారు. సూపర్ సిక్స్ అని చెప్పి, ఈ ఆర్నెలల్లో ఒక్కటి కూడా అమలు చేయకపోవడంతో ప్రజల్లో కూటమి ప్రభుత్వంపట్ల తీవ్ర వ్యతిరేకత నెలకొందన్నారు.
ముఖ్యంగా రైతులు బాగా అసంతృప్తితో ఉన్నారని.. అందుకే సాగునీటి సంఘాల ఎన్నికలను అరాచక పద్ధతిలో నిర్వహిస్తున్నారని జక్కంపూడి విమర్శించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఎన్ని ఇబ్బందులున్నా సరే, రైతులకు ఎప్పటికప్పుడు రూ.13,500ల పెట్టుబడి సాయం అందించామని.. అయితే, కూటమి ప్రభుత్వం ఇప్పటివరకూ ఆ ఊసే ఎత్తడంలేదని ఎద్దేవా చేశారు.
సాగునీటి సంఘాల ఎన్నికల్లో ప్రజలందరూ ప్రభుత్వ అరాచకాన్ని గమనిస్తున్నారని.. పద్ధతి మార్చుకోకపోతే ప్రజలు సమయం వచ్చినపుడు బుద్ధి చెబుతారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment