సాగు నీటి సంఘాల ఎన్నికల్లో దౌర్జన్యకాండ
నేడు సాగునీటి సంఘాలకు, 17న డిస్ట్రిబ్యూటరీ కమిటీలకు ఎన్నికలు
సాక్షి, అమరావతి :రాష్ట్రంలో సాగు నీటి సంఘాల ఎన్నికలను సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అపహాస్యం చేస్తోంది. సాగు నీటి వినియోగదారుల సంఘాలు, డిస్ట్రిబ్యూటరీ కమిటీలు, ప్రాజెక్టు కమిటీలను తమ మద్దతుదారులకే కట్టబెట్టి, దోచుకోవాలనే దురాలోచనతో అరాచకాలకు తెరలేపింది.
ఆ క్రమంలోనే ‘చేతులెత్తి ఎన్నుకునే విధానం’ ద్వారా వాటికి ఎన్నికలు నిర్వహించేలా చట్టాన్ని సవరించింది. దీనిపై రైతులు హైకోర్టును ఆశ్రయించడంతో ఏకాభిప్రాయం వ్యక్తం కాని చోట రహస్య బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది.
ఇతర పార్టీల మద్దతుదారులు పోటీకి సిద్ధమైతే రహస్య బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతుంది. అలా ఎన్నికలు నిర్వహిస్తే ఫలితాలు ఎలా ఉంటాయన్నది గుర్తెరిగిన కూటమి ప్రభుత్వం అరాచకాలకు తెరతీసింది. ఇతర పార్టీల మద్దతుదారులు సాగు నీటి సంఘాల ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేకుండా గ్రామ సచివాలయాల్లో నో డ్యూ సర్టిఫికెట్లు ఇవ్వకుండా అడ్డుకుని కుట్ర చేస్తోంది.
నో డ్యూ సర్టిఫికెట్ల కోసం తహసిల్దార్ కార్యాలయానికి వచ్చిన ఇతర పార్టీల మద్దతుదారులపై పోలీసుల సమక్షంలోనే టీడీపీ నేతలు దాడులకు దిగుతూ భయోత్పాతం సృష్టిస్తున్నారు. శుక్రవారం వైఎస్సార్ జిల్లా పులివెందుల, జమ్మలమడుగు నియోజకవర్గాల్లో చోటుచేసుకున్న ఘటనలే ఇందుకు నిదర్శనం.
కూటమి నేతలకే పదవులు!
సంప్రదింపులు, ఏకాభిప్రాయం ముసుగులో టీడీపీ కూటమి నేతలు, కార్యకర్తలకు పదవులు పంచి పెట్టేలా 2018లో సవరించిన సాగు నీటి సంఘాల చట్టాన్ని ఆయుధంగా వాడుకుంటోంది. ఈ మేరకు సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించేలా 2019 ఫిబ్రవరి 8న జారీ చేసిన ఉత్తర్వుల (జీవో ఎంఎస్ నంబరు 20)ను ఉపయోగించుకుంటోంది.
ఇందులో భాగంగా ప్రస్తుతం 49,020 ప్రాదేశిక నియోజకవర్గాలు (టీసీ), 6,149 సాగునీటి వినియోగదారుల సంఘాలు (డబ్ల్యూయూఏ), 245 డిస్ట్రిబ్యూటరీ కమిటీలు, 53 ప్రాజెక్టు కమిటీలకు ఎన్నికలు నిర్వహించడానికి 26 జిల్లాల కలెక్టర్లు ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేశారు.
సాగునీటి వినియోగదారుల సంఘాలకు శనివారం.. డిస్ట్రిబ్యూటరీ కమిటీలకు ఈనెల 17న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల పేరుతో తాము ఎంపిక చేసిన నేతలు, కార్యకర్తలకే సాగు నీటి సంఘాల పదవులను టీడీపీ కూటమి పెద్దలు కట్టబెట్టడానికి రంగం సిద్ధం చేశారు. రాష్ట్రంలో భారీ ప్రాజెక్టుల కింద 21,03,825 హెక్టార్లు, మధ్య తరహా ప్రాజెక్టుల కింద 1,85,804 హెక్టార్లు, చిన్న నీటి వనరుల విభాగంలో 5,55,056 హెక్టార్లు.. వెరసి 28,44,685 హెక్టార్ల ఆయకట్టు ఉంది.
నీటి వృథాకు అడ్డుకట్ట వేసి.. యాజమాన్య పద్ధతుల ద్వారా ఆయకట్టు చివరి భూములకు నీళ్లందించి, దిగుబడులు పెంచాలన్న లక్ష్యంతో సాగు నీటి సంఘాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వాటికి 2014 వరకు సాధారణ ఎన్నికల తరహాలోనే ఎన్నికలు నిర్వహించింది. ఆయకట్టు రైతులు తమ ఓటు ద్వారా ప్రాదేశిక నియోజకవర్గాల ప్రతినిధులు, సాగునీటి సంఘాలు, డిస్ట్రిబ్యూటరీ, ప్రాజెక్టు కమిటీల అధ్యక్షులను ఎన్నుకునేవారు. కానీ.. టీడీపీ కూటమి ప్రభుత్వం 2018లో ఆ విధానానికి స్వస్తి పలుకుతూ సంప్రదింపులు, ఏకాభిప్రాయం ముసుగులో తమ వారికే పదవులు కట్టబెట్టేలా చట్టాన్ని సవరించి, సాగునీటి సంఘాలను నీరుగార్చింది.
» వైఎస్సార్ జిల్లాలో సాగునీటి వినియోగదారుల సంఘాల ఎన్నికల నేపథ్యంలో తహసీల్దార్ కార్యాలయాల వద్ద టీడీపీ శ్రేణులు మోహరించాయి. ఎక్కడికక్కడ వీఆర్వోల నుంచి వైఎస్సార్‌సీపీ మద్దతుదారులైన రైతులకు నో డ్యూస్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఒత్తిడి తెచ్చారు. చక్రాయపేట, వేముల, వేంపల్లెల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగింది. వేంపల్లెలో నో డ్యూస్ సర్టిఫికెట్లు ఇచ్చేందుకు సిద్దమైన వీఆర్వోలను మండల టీడీపీ నాయకుడి కుమారుడు బూతు పురాణం అందుకున్నారు.
జమ్మలమడుగు నియోజకవర్గంలోని పెద్దముడియంలో వీఆర్వోలందరినీ ప్రత్యేక వాహనంలో ఎక్కించుకుని టీడీపీ నేతలు సమయం ముగిసేంతవరకు తమ ఆధీనంలో పెట్టుకున్నారు. అలా చేయడంపై ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి అధికారులకు ఫిర్యాదు చేశారు.
నీటి తీరువా బకాయిలు ఉంటే పోటీకి నో..
సాగు నీటి సంఘాల ఎన్నికల్లో పోటీ చేయాలంటే నీటి తీరువా బకాయిలు ఉండకూడదు. ఎన్నికల్లో పోటీ చేసే వారు నీటి తీరువా బకాయిలు లేవని వీఆర్వోల నుంచి నో డ్యూ సర్టిఫికెట్లు తీసుకోవాలి. సాధారణంగా నో డ్యూ సర్టిఫికెట్లను ఆ సాగునీటి సంఘాల పరిధిలోని గ్రామ సచివాలయాల్లో వీఆర్వోలు జారీ చేస్తారు.
అయితే ఇప్పుడు సాగు నీటి సంఘాల ఎన్నికల నేపథ్యంలో నో డ్యూ సర్టిఫికెట్లు జారీ చేయవద్దని వీఆర్వోలకు కూటమి ప్రజాప్రతినిధులు హుకుం జారీ చేశారు. దాంతో నో డ్యూ సర్టిఫికెట్ల కోసం ఆ మండల తహసిల్దార్ కార్యాలయాలకు వెళ్లిన ఇతర పార్టీల మద్దతుదారులపై పోలీసుల సమక్షంలోనే కూటమి శ్రేణులు దాడులు చేసి.. భయోత్పాతానికి గురిచేస్తున్నాయి.
అంతటా అదే తీరు
సాక్షి నెట్‌వర్క్ : సాగు నీటి సంఘాల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులపై పోటీ చేసి గెలవలేమనే భయంతో అధికార కూటమి పార్టీల నేతలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ కుట్రలకు తెరలేపారు. కర్నూలు జిల్లా కోడుమూరు ఎల్‌ఎల్‌సీ పరిధిలోని గోరంట్ల 45 డిస్ట్రిబ్యూటరీ కింద 10 టీసీలకు నీటి తీరువ పన్ను కట్టేందుకు మండలంలోని వెంకటగిరి గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ మద్దతుదారులైన రైతులు వెళ్లారు.
అయితే తహసీల్దార్ పన్ను కట్టించుకోవద్దని చెప్పారంటూ కోడుమూరు, ముడుమలగుర్తి, ఎర్రదొడ్డి వీఆర్వోలు వారిని తిప్పి పంపేందుకు యత్నించారు. దీంతో ఆగ్రహించిన రైతులు తహసీల్దార్ వెంకటేష్ నాయక్ కార్యాలయం బయట రోడ్డుపై బైఠాయించారు.
» ఏలేరు పరీవాహక ప్రాంతాల్లో అత్యంత కీలకమైన నియోజకవర్గం పిఠాపురం. ఏలేరు ఆధునీకరణకు భారీగా నిధులు విడుదల చేసే అవకాశం ఉండడంతో వాటిపై పెత్తనం చెలాయించడానికి మెట్ట ప్రాంత టీడీపీ నేత ప్రోద్బలంతో డిస్ట్రిబ్యూటరీ కమిటీ(డీసీ)ల సంఖ్యను ఆరుకు, నీటి సంఘాలను 30కి పెంచేశారు.
ఈ విభజన కూడా అస్తవ్యస్తంగా చేశారు. పిఠాపురం మండలం రాపర్తి, భోగాపురం, బి.ప్రత్తిపాడు గ్రామాల్లో 400 మంది రైతుల పేర్లు జాబితా నుంచి తొలగించారు. పిఠాపురం నియోజకవర్గంలోని 36 నీటి సంఘాల్లో 16 టీడీపీ, 20 జనసేన మద్దతుదారులు గెలిచేలా లక్ష్యంగా పెట్టుకుని దౌర్జన్యాలకు తెరలేపారు.
» చిత్తూరు జిల్లా పెద్ద పంజాణి మండలం చలమంగళం పెద్ద చెరువు సాగునీటి వినియోగదారుల సంఘం ఎన్నిక పోటీ చేసేందుకు రైతులకు అవసరమైన సర్టిఫికెట్లు ఇవ్వడంలో వీఆర్వో రత్నప్ప ఏకపక్షంగా వ్యవహరించాడని రైతులు మండిపడ్డారు.
శుక్రవారం ఉదయం సచివాలయానికి వచ్చిన ఆయన అవసరమైన రైతులకు ఓటరు లిస్టు మాత్రం అందజేసి, భోజనం తర్వాత నో డ్యూ సర్టిఫికెట్లు ఇస్తానని చెప్పి వెళ్లిపోయారు. సాయంత్రం వరకు రైతులు వేచి ఉన్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అయితే టీడీపీ సానుభూతి పరులకు మాత్రం నో డ్యూ సర్టిఫికెట్లు ఇవ్వడం గమనార్హం.
» కృష్ణా జిల్లాలో అధికార పార్టీ కనుసన్నల్లో నీటి సంఘాల ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన శాసనసభ్యులు.. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నుంచి ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలో, ఎవర్ని ఎన్నుకోవాలో కింది స్థాయి నాయకులకు ఇప్పటికే ఆదేశించినట్లు తెలుస్తోంది. అధ్యక్షులు, ఉపాధ్యక్షుల పేర్లు కూడా ఆయా నియోజకవర్గాల శాసనసభ్యులు సూచించి, ఆ విధంగా ఎన్నిక నిర్వహించాలని అధికారులకు దిశా నిర్దేశం చేసినట్లు సమాచారం
» ఎన్టీఆర్ జిల్లాలో 1978 ప్రాదేశిక నియోజకవర్గాలకు(టీసీ), 242 సాగునీటి సంఘాలకు సంబంధించి ఎవరెవరిని ఎన్నుకోవాలో ఆయా ప్రాంత ఎమ్మెల్యేలు ఇప్పటికే పేర్లు ఖరారు చేశారు. ఆ మేరకు వారు ఎన్నికయ్యేలా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
» చిత్తూరు జిల్లా ఐరాల మండలం పుల్లూరులో నేరేడు చెరువు సాగు నీటి సంఘం పరిధిలోని 70 మంది రైతుల పేర్లను ఓటర్ల జాబితాలోంచి తొలగించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి ఓట్లు వేశారనే నెపంతో ఇలా చేశారు. బాధిత రైతులు ఎంఎస్.లోకనాథ్‌రెడ్డి, బీఎం.గోవింద్‌రెడ్డి, పీఎం.సుధాకర్‌రెడ్డి, ఎం.సురేంద్రరెడ్డి, రవి, గణపతి ఆచారి, సురేంద్ర తదితరులు తహసీల్దార్ కార్యాలయాన్ని సంప్రదించగా అక్కడ ఎవరూ స్పందించలేదు. రైతుల అర్జీని ఫిర్యాదుల బాక్స్‌లో వేసి వెళ్లాలని కంప్యూటర్ ఆపరేటర్ సూచించగా తుదకు అలానే చేయాల్సి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment