Irrigations Projects
-
వరుస పరిణామాలతో తెలంగాణ నీటిపారుదల యంత్రాంగం బిజీబిజీ
సాక్షి, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిపై కేంద్రం వెలువరించిన గెజిట్ నోటిఫికేషన్ అమలు విషయంలో బోర్డులు పెడుతున్న తొందర, ప్రాజెక్టులు, సంబంధిత పరిణామాలు రాష్ట్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గెజిట్ వెలువడిన మరుసటి రోజునుంచే దాని అమలుపై కార్యాచరణ మొదలు పెట్టాల్సిందిగా బోర్డులు లేఖల మీద లేఖలు రాయడం మొదలు పెట్టాయి. ప్రాజెక్టుల వివరాలు, ఇతర అంశాలకు సంబంధించి వివరాలు కోరుతున్నాయి. వీటిపై చర్చించేందుకు వరుస భేటీలు నిర్వహిస్తున్నాయి. బోర్డులు కోరుతున్న ప్రతి సమాచారం సున్నితమైన కీలక అంశాలకు సంబంధించినది కావ డంతో, అధికారులు ప్రతి విషయాన్నీ అటు ప్రభుత్వం, ఇటు న్యాయవాదులతో చర్చించి ఖరారు చేయాల్సి వస్తోంది. మరోపక్క కోర్టులు, ట్రిబ్యునల్ కేసుల విచారణకు వాదనలు, పార్లమెంటులో ప్రశ్నలకు జవాబులు సిద్ధం చేయాల్సి ఉండటంతో తెలంగాణ ఇరిగేషన్ శాఖకు ఊపిరి సలపడం లేదు. లేఖాస్త్రాలతో పెరుగుతున్న ఒత్తిడి గత నెల 16న గెజిట్ నోటిఫికేషన్ వెలువడిందే ఆలస్యం.. బోర్డులు వీటి అమలుకు పూనుకున్నాయి. నోటిఫికేషన్ వెలువడిన మరుసటి రోజే.. అందులోని అంశాల అమలుకు చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్రాలను కోరాయి. ఆ తర్వాత బోర్డులకు నిధులు విడుదలపై లేఖలు రాశాయి. ఆ వెంటనే రాష్ట్రాల్లో ఆమోదం లేని ప్రాజెక్టుల డీపీఆర్‌లు కోరుతూ లేఖలు రాశాయి. ఆ మరుసటి రోజే సమన్వయ కమిటీ ఏర్పాటు చేసిన సమాచారంతో రెండు లేఖలు, ఆ వెంటనే కమిటీ భేటీని నిర్వహిస్తామంటూ మరో రెండు లేఖాస్త్రాలు సంధించాయి. ఇదే క్రమంలో ఈనెల 3న కమిటీ సమావేశాన్ని నిర్వహించాయి. ఈ భేటీకి తెలంగాణ గైర్హాజరు కాగా, ఏపీ తన అభిప్రాయాన్ని చెప్పింది. అయితే గెజిట్ నోటిఫికేషన్‌లోని అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తూ ఒక్కో అంశంపై అభిప్రాయాలను సిద్ధం చేసుకుంటున్న సమయంలో, 9న పూర్తి స్థాయి భేటీ నిర్వహిస్తామని రెండు బోర్డులు తెలంగాణకు లేఖలు రాశాయి. ఇలావుండగా 9వ తేదీనే కృష్ణా జలాలపై సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వేసిన రిట్ పిటిషన్ ఉపసంహరణకు సంబంధించి విచారణ జరగనుంది. ఏ కారణాలతో పిటిషన్ ఉపసంహరించుకుంటున్నారో తెలంగాణ కోర్టుకు వివరించాల్సి ఉంది. అదే రోజున రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్ సైతం విచారణకు రానుంది. ఇక్కడ తెలంగాణ తన వాదనలు వినిపించాల్సి ఉంది. మరోవైపు గెజిట్‌లో పేర్కొన్న అంశాలు, అనుమతుల్లేని ప్రాజెక్టులు, వాటికి రుణాలు, గెజిట్‌తో ఏర్పడే పరిణామాలపై పార్లమెంట్లో వరుస ప్రశ్నలు వస్తున్నాయి. ముఖ్యంగా అనుమతుల్లేవని చెబుతున్న గోదావరి, కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్, నాబార్డ్‌ల రుణాలపై ఇప్పటికే ప్రశ్నలు లిస్ట్ అయ్యాయి. ఈ ప్రశ్నలపై కేంద్ర జల్‌శక్తి శాఖ రాష్ట్ర ఇరిగేషన్ ఇంజనీర్ల నుంచి సమాధానాలు కోరుతోంది. మరోపక్క ప్రాజెక్టుల అనుమతులు, వాటిపై ఖర్చు చేస్తున్న నిధులపై సమాచారం కోరుతూ కుప్పలు కుప్పలుగా ఆర్టీఐ దరఖాస్తులు వస్తున్నాయి. ఇంకోపక్క రుణాలు ఇస్తున్న బ్యాంకులు, ఇతర రుణ సంస్థలన్నీ అనుమతుల్లేని ప్రాజెక్టులు, వీటికి అనుమతుల సాధనలో రాష్ట్రానికి ఉన్న ప్రణాళికపై వరుస లేఖలు రాస్తున్నాయి. నాలుగురోజులుగా తలమునకలు ఇలా కోర్టు కేసులు, కృష్ణా, గోదావరి బోర్డుల భేటీలు, వాటికి వివరాల సమర్పణ, లేఖలకు సమాధానాలు, పార్లమెంటులో ప్రశ్నలకు జవాబులు సిద్ధం చేయడం తదితర పనుల్లో రాష్ట్ర ఇరిగేషన్ ఇంజనీర్లు గడిచిన నాలుగు రోజులుగా తల మునకలుగా ఉన్నారు. ఓవైపు న్యాయవాదులతో చర్చిస్తూనే మరోవైపు అవసరమైన నివేదికలు సిద్ధం చేసే పనిలో ఉన్నారు. కోర్టు కేసులు, తదితర అంశాలపై రిటైర్ట్ అడ్వొకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి, అదనపు అడ్వొకేట్ జనరల్ రామచందర్రావులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు. పంపుల సరఫరా చేస్తే డబ్బులిస్తారా? తాజాగా కాళేశ్వరం అదనపు టీఎంసీ, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు పంపులు, మోటార్లను సరఫరా చేస్తున్న బీహెచ్ఈఎల్ సైతం పలు సందేహాలు వ్యక్తం చేస్తూ రాష్ట్రానికి లేఖలు రాసినట్లు తెలుస్తోంది. కేంద్రం గెజిట్‌లో అనుమతి లేని ప్రాజెక్టులుగా పేర్కొన్న వీటికి అనుమతులు వస్తాయా? అనుమతులు వచ్చేంతవరకూ పనులు నిలిపివేయాలా? ఒకవేళ పంపులు, మోటార్లు సరఫరా చేస్తే చెల్లింపులు యధావిధిగా కొనసాగుతాయా? అనే ప్రశ్నలకు వివరణ కోరినట్లు సమాచారం. -
కొత్త ప్రాజెక్టులను అపెక్స్ ఆపమంది..!
సాక్షి, వరంగల్: కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో మంగళవారం జరిగిన అపెక్స్ కౌన్సిల్లో ఉమ్మడి వరంగల్ ప్రాజెక్టులపై కీలక చర్చ జరిగింది. కృష్ణా బేసిన్లో ఆంధ్రప్రదేశ్, గోదావరి బేసిన్లో తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులపై పరస్పరం ఫిర్యాదు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాలలో కొత్తగా చేపడుతున్న తొమ్మిది ప్రాజెక్టుల పనులను తక్షణమే ఆపాలని కేంద్రమంత్రి ఆగస్టు 11న ఆదేశాలు జారీ చేశారు. అయితే, తొమ్మిది ప్రాజెక్టుల జాబితాలో ఏడు తెలంగాణకు సంబంధించినవి కాగా, ఇందులో నాలుగు ఉమ్మడి వరంగల్‌లోనివే ఉన్నాయి. తాజాగా మంగళవారం ఇదే అంశంపై కేంద్రమంత్రి షెకావత్ రెండు రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా, మరోమారు జిల్లా ప్రాజెక్టులు తెరపైకి వచ్చాయి. ఆపాలన్న ప్రాజెక్టులు ఇవే... కేంద్రం ఆపాలని సూచించిన ప్రాజెక్టుల జాబితాలో తెలంగాణకు సంబంధించినవి ఏడు ఉన్నాయి. తెలంగాణ సాగునీటి సరఫరా పథకం, సీతారామ ఎత్తిపోతలు, లోయర్ పెనుగంగ నదిపై బ్యారేజీలు, కాళేశ్వరం మూడో టీఎంసీ ఎత్తిపోతలు, గోదావరి ఎత్తిపోతలు, తుపాకులగూడెం, రామప్ప సరస్సు నుంచి పాకాల సరస్సుకు నీటి మళ్లింపు పథకాలపై అభ్యంతరాలు చెప్పింది. ఇందులో రామప్ప, పాకాల సరస్సు మళ్లింపు, కాళేశ్వరం మూడో టీఎంసీ, తుపాకులగూడెం(సమ్మక్క సాగర్), గోదావరి ఎత్తిపోతల పథకాలు ఉమ్మడి వరంగల్‌లోని కీలక ప్రాజెక్టులు. తెలంగాణకే తలమానికంగా కాళేశ్వరం ప్రాజెక్టును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. దేవాదుల ఎత్తిపోతల పథకం కూడా తుది దశకు చేరింది. తుపాకులగూడెం పనులు శరవేగంగా సాగుతుండగా, రామప్ప సరస్సు నుంచి పాకాల సరస్సుకు నీటి మళ్లింపుపై కూడా జల్‌శక్తి శాఖ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. మంగళవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం మీడియా సమావేశంలో ఏ ప్రాజెక్టు కట్టాలన్నా అనుమతి ఇచ్చే అధికారం అపెక్స్ కౌన్సిల్‌దేనని గజేంద్రసింగ్ షెకావత్ స్పష్టం చేయడంపై జిల్లాలో చర్చ జరుగుతోంది. డీపీఆర్‌ల తయారీపై కసరత్తు అపెక్స్ కౌన్సిల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రాజెక్టులకు సంబంధించిన సమగ్ర నివేదికలను వారంలోగా సిద్ధం చేసేందుకు నీటిపారుదల శాఖ అధికారులు కసరత్తు మొదలెట్టారు. మంగళవారం సమావేశం ముగిసిన వెంటనే నీటిపారుదలశాఖ కార్యదర్శి ఉమ్మడి వరంగల్‌లో ప్రాజెక్టుల ఇన్‌చార్జ్‌లకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. కాళేశ్వరం మూడో టీఎంసీతో సహా అభ్యంతరాలు వ్యక్తమైన నాలుగు ప్రాజెక్టులపైనా నివేదికలు సిద్ధం చేయడంపై దృష్టి సారించారు. ఈ మేరకు కాళేశ్వరం ఎత్తిపోతలు, గోదావరి ఎత్తిపోతల మూడో దశ, తుపాకులగూడెం, రామప్ప సరస్సు నుంచి పాకాల సరస్సుకు నీటి మళ్లింపు పథకాలకు సంబంధించి పర్యవేక్షక, కార్యనిర్వాహక ఇంజినీర్లకు మౌఖిక ఆదేశాలు అందాయి. అపెక్స్ కౌన్సిల్‌కు ముందే నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులతో సమావేశమైన సీఎం కేసీఆర్.. కౌన్సిల్ తర్వాత కూడా స్పష్టమైన సూచనలు చేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ సలహా కమిటీ కాళేశ్వరం ఎత్తిపోతల డీపీఆర్‌ను ఆమోదించిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణ ప్రభుత్వం పరిధిని మార్చి రోజుకు రెండు టీఎంసీల నుంచి మూడు టీఎంసీలు మళ్లించేలా సామర్థ్యాన్ని పెంచింది. ఇందుకు సంబంధించిన డీపీఆర్‌ను గోదావరి బోర్డు, కేంద్ర జలసంఘం పరిశీలనకు ఇవ్వకుండానే పనులు చేపట్టారని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ప్రాజెక్టు పరిధి లేదా వ్యయంలో మార్పు జరిగితే మళ్లీ ఆమోదం పొందాల్సి ఉంటుందని కౌన్సిల్ సూచించినట్లు తెలిసింది. అదేవిధంగా రామప్ప సరస్సు నుంచి పాకాల సరస్సు వరకు మళ్లింపు పథకంపై కొత్త డీపీఆర్‌ను సమర్పించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. -
ఇప్పుడు ఎలాంటి పెంపు వద్దు: రాజనర్సింహ
హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టుల పనులకు ధరలను పెంచే విషయంలో మంత్రివర్గంలో తీవ్ర విభేదాలు పొడసూపాయి. ధరలను పెంచడానికి మంత్రివర్గ ఉపసంఘంతో పాటు, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా సానుకూలంగా ఉండగా, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై సుమారు రూ.20 వేల కోట్ల భారం పడే విషయంపై మంత్రివర్గంలో చర్చించకుండా ఎలా నిర్ణయం తీసుకుంటారని దామోదర ప్రశ్నించారు. పైగా రాష్ర్ట విభజన నిర్ణయానంతర పరిణామాల నేపథ్యంలో ఇలాంటి కీలక నిర్ణయం తీసుకోవడం భావ్యమేనా ? అని నిలదీశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతికి ఆయన ఇటీవల లేఖ రాశారు. సాగునీటి ప్రాజెక్టుల పనులకు ధరలను పెంచాలని గత కొంత కాలంగా కాంట్రాక్టర్లు కోరుతున్న విషయం తెలిసిందే. గత ఏడెనిమిది సంవత్సరాల క్రితం ఉన్న ధరలతో పోలిస్తే...ప్రస్తుతం అన్ని వస్తువుల ధరలు భారీగా పెరిగాయని, దీంతో నష్టం వస్తోందని వారు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. ధరలను పెంచకపోతే పనుల్ని చేయబోమంటూ పనుల వేగాన్ని గణనీయంగా తగ్గించారు. ఈ నేపథ్యంలో కాంట్రాక్టర్ల డిమాండ్‌ను పరిశీలించడానికి ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. ఇందులో భారీ నీటిపారుదల శాఖ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డితో పాటు, చిన్నతరహా నీటిపారుదల శాఖ మంత్రి టి.జి.వెంకటేశ్, ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, రెవెన్యూశాఖ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి జె.గీతారెడ్డి సభ్యులుగా ఉన్నారు. పలుమార్లు సమావేశమైన ఉప సంఘం ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. ధరల పెంపునకు ఉపసంఘం మొగ్గు చూపింది. 2013 ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ధరల పెంపు నిర్ణయాన్ని అమలు చేయాలని సిఫారసు చేసింది. అంటే ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు చేసిన ఐదు మాసాల పనులకు కూడా అదనపు చెల్లింపుల్ని చేయాల్సి ఉంటుంది. అలాగే భవిష్యత్తులో చేయబోయే పనులకు కూడా కొత్త ధరలు వర్తిస్తాయి. ఈమేరకు అధికారులు ఫైల్‌ను సిద్ధం చేశారు. నీటిపారుదల శాఖ మంత్రి సంతకానంతరం ఫైల్‌ను సీఎం నిర్ణయం కోసం పంపించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే డిప్యూటీ సీఎం ముఖ్యమంత్రికి, సీఎస్‌కు లేఖ రాశారు. ధరల పెంపు పరిశీలనకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటును కూడా ఉప ముఖ్యమంత్రి తప్పుపట్టారు. దామోదర లేఖ నేపథ్యంలో ధరల పెంపుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశంపై చర్చ జరుగుతోంది. రూ. 30 కోట్ల అదనపు భారం! జలయజ్ఞంలో చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణాలకు సంబంధించి సుమారు రూ. 1.29 లక్షల కోట్ల మొత్తానికి కాంట్రాక్టర్లతో ఒప్పందాలు కుదిరాయి. ఇందులో ఇప్పటి వరకు రూ. 73.91 వేల కోట్ల విలువైన పనులు జరిగాయి. అంటే మరో రూ.55 వేల విలువైన పనులకు కొత్త ధరలను చెల్లించాల్సి ఉంది. ప్రస్తుత ధరలను అంచనా వే సి లెక్కిస్తే...కొత్తగా మరో రూ. 20 నుంచి రూ. 30 వేల కోట్ల అదనపు భారం పడే అవకాశం ఉంది.