ఇప్పుడు ఎలాంటి పెంపు వద్దు: రాజనర్సింహ
హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టుల పనులకు ధరలను పెంచే విషయంలో మంత్రివర్గంలో తీవ్ర విభేదాలు పొడసూపాయి. ధరలను పెంచడానికి మంత్రివర్గ ఉపసంఘంతో పాటు, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా సానుకూలంగా ఉండగా, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై సుమారు రూ.20 వేల కోట్ల భారం పడే విషయంపై మంత్రివర్గంలో చర్చించకుండా ఎలా నిర్ణయం తీసుకుంటారని దామోదర ప్రశ్నించారు. పైగా రాష్ర్ట విభజన నిర్ణయానంతర పరిణామాల నేపథ్యంలో ఇలాంటి కీలక నిర్ణయం తీసుకోవడం భావ్యమేనా ? అని నిలదీశారు.
ఈ మేరకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతికి ఆయన ఇటీవల లేఖ రాశారు. సాగునీటి ప్రాజెక్టుల పనులకు ధరలను పెంచాలని గత కొంత కాలంగా కాంట్రాక్టర్లు కోరుతున్న విషయం తెలిసిందే. గత ఏడెనిమిది సంవత్సరాల క్రితం ఉన్న ధరలతో పోలిస్తే...ప్రస్తుతం అన్ని వస్తువుల ధరలు భారీగా పెరిగాయని, దీంతో నష్టం వస్తోందని వారు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. ధరలను పెంచకపోతే పనుల్ని చేయబోమంటూ పనుల వేగాన్ని గణనీయంగా తగ్గించారు.
ఈ నేపథ్యంలో కాంట్రాక్టర్ల డిమాండ్‌ను పరిశీలించడానికి ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. ఇందులో భారీ నీటిపారుదల శాఖ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డితో పాటు, చిన్నతరహా నీటిపారుదల శాఖ మంత్రి టి.జి.వెంకటేశ్, ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, రెవెన్యూశాఖ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి జె.గీతారెడ్డి సభ్యులుగా ఉన్నారు. పలుమార్లు సమావేశమైన ఉప సంఘం ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. ధరల పెంపునకు ఉపసంఘం మొగ్గు చూపింది.
2013 ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ధరల పెంపు నిర్ణయాన్ని అమలు చేయాలని సిఫారసు చేసింది. అంటే ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు చేసిన ఐదు మాసాల పనులకు కూడా అదనపు చెల్లింపుల్ని చేయాల్సి ఉంటుంది. అలాగే భవిష్యత్తులో చేయబోయే పనులకు కూడా కొత్త ధరలు వర్తిస్తాయి. ఈమేరకు అధికారులు ఫైల్‌ను సిద్ధం చేశారు. నీటిపారుదల శాఖ మంత్రి సంతకానంతరం ఫైల్‌ను సీఎం నిర్ణయం కోసం పంపించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే డిప్యూటీ సీఎం ముఖ్యమంత్రికి, సీఎస్‌కు లేఖ రాశారు. ధరల పెంపు పరిశీలనకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటును కూడా ఉప ముఖ్యమంత్రి తప్పుపట్టారు. దామోదర లేఖ నేపథ్యంలో ధరల పెంపుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశంపై చర్చ జరుగుతోంది.
రూ. 30 కోట్ల అదనపు భారం!
జలయజ్ఞంలో చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణాలకు సంబంధించి సుమారు రూ. 1.29 లక్షల కోట్ల మొత్తానికి కాంట్రాక్టర్లతో ఒప్పందాలు కుదిరాయి. ఇందులో ఇప్పటి వరకు రూ. 73.91 వేల కోట్ల విలువైన పనులు జరిగాయి. అంటే మరో రూ.55 వేల విలువైన పనులకు కొత్త ధరలను చెల్లించాల్సి ఉంది. ప్రస్తుత ధరలను అంచనా వే సి లెక్కిస్తే...కొత్తగా మరో రూ. 20 నుంచి రూ. 30 వేల కోట్ల అదనపు భారం పడే అవకాశం ఉంది.