ఉగ్రభూతమే ఉమ్మడి శత్రువు
- సంయుక్త పోరుకు భారత్–ఇజ్రాయెల్ నిర్ణయం
- ఇరు దేశాలకూ ఉగ్రవాదం సవాల్‌గా మారిందన్న మోదీ
- 26/11 భయానక ఘటన: బెంజమిన్ నెతన్యాహూ
- నీటి సంరక్షణ సహా ఏడు ఒప్పందాలు
- మేకిన్ ఇండియాకు సహకారం: అధ్యక్షుడు రువెన్ రివ్లిన్
జెరూసలేం: ఉగ్రవాదంతోపాటుగా వీరికి ఆశ్రయం కల్పిస్తున్న వారిపై కఠినంగా వ్యవహరించటంలో వ్యూహాత్మక భాగస్వామ్యంతో ముందుకెళ్లాలని భారత్, ఇజ్రాయెల్ నిర్ణయించాయి. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న తీవ్రవాద పరిస్థితులు, ఉగ్రవాదానికి ఆర్థికసాయం చేస్తున్న వారిపై సంయుక్తంగా పోరాటం చేయనున్నట్లు స్పష్టం చేశాయి. భారత్, ఇజ్రాయెల్ ప్రధానులు నరేంద్ర మోదీ, బెంజమిన్ నెతన్యాహూల రెండోరోజు సమావేశంలో పలు ద్వైపాక్షిక అంశాలతోపాటుగా ఉగ్రవాదం, దీన్ని ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపైనా చర్చించారు.
కఠినమైన భౌగోళిక పరిస్థితులను కలిగున్న భారత్, ఇజ్రాయెల్ దేశాలు వ్యూహాత్మక సవాళ్లను ఎదుర్కొంటున్నాయని మోదీ తెలిపారు. ‘ఉగ్రవాదం రెచ్చగొడుతున్న హింసను, విషప్రచారాన్ని భారత్ అనుభవిస్తోంది. ఇజ్రాయెల్‌కు కూడా ఇదే సమస్య ఉంది. అందుకే ఇరుదేశాలు ఉగ్రవాదాన్ని అణచివేయటంతోపాటు వారికి సాయం చేస్తున్న వారిపై కఠినంగా వ్యవహరించేందుకు వ్యూహాత్మక భాగస్వామ్యంతో ముందుకెళ్లాలని నిర్ణయించాయి. సైబర్ స్పేస్‌లోనూ కలిసే పనిచేస్తాం’అని సంయుక్త మీడియా సమావేశంలో మోదీ తెలిపారు. 26/11 దాడిని భయానక∙ఘటనగా అభివర్ణించిన నెతన్యాహూ.. ఇరుదేశాలు కలిసే ఉగ్రవాదంపై పోరాటం చేస్తాయన్నారు. ‘ప్రపంచశాంతికి సవాల్‌గా మారిన ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థలు, నెట్వర్క్, వారికి ఆశ్రయం కల్పిస్తున్న వారిపై కఠినంగా వ్యవహరిస్తాం’అని సంయుక్త ప్రకటన పేర్కొంది. అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర సదస్సు (సీసీఐటీ)ను వీలైనంత త్వరగా అమల్లోకి తీసుకురావటంలోనూ కలిసిపనిచేయాలని నిర్ణయించారు. కొన్నేళ్లుగా పశ్చిమాసియాలో నెలకొన్న ఘర్షణ పరిస్థితులపైనా వీరిద్దరూ చర్చించారు.ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం నెలకొనాలని ఆశించారు.
ఏడు ఒప్పందాలపై సంతకాలు
ద్వైపాక్షిక బంధాలను బలోపేతం చేసుకోవటంతోపాటు ఉగ్రవాదంపై పోరాటంలోనూ పరస్పర సహకారం చేసుకోవాలని ఇరుదేశాలు నిర్ణయించాయి. అంతరిక్ష పరిశోధన, పారిశ్రామిక, వ్యవసాయం రంగాలతోపాటు నీటి పరిరక్షణ అంశంలో ఇరుదేశాల మధ్య బుధవారం ఏడు ఒప్పందాలు జరిగాయి. భారత్–ఇజ్రాయెల్ పారిశ్రామిక పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ), సాంకేతిక సృజనాత్మకత కోసం 40 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.259 కోట్లు) నిధిని ఏర్పాటుచేసేందుకు ఇరువురు ప్రధానులూ అంగీకరించారు. ‘పారిశ్రామిక రంగంలో ఇరుదేశాలకు లాభం చేకూరేలా ఇరుదేశాల శాస్త్రవేత్తలు, పరిశోధకులు పనిచేయాలనే విషయంలో మా (ఇరుదేశాల నేతలు) ఇద్దరి ఆలోచన ఒకే విధంగా ఉంది. వాణిజ్యం, పెట్టుబడుల్లో భాగస్వామ్యం బలోపేతానికి కృషిచేస్తున్నాం’అని మోదీ స్పష్టం చేశారు.
భారత్‌లో ‘జల’సంస్కరణలు!
నీటి సంరక్షణతోపాటుగా భారత్‌లో నీటి వినియోగ సంస్కరణలు తీసుకురావటంపై పరస్పర అంగీకారం కుదిరింది. సృజనాత్మకత, నీటి వినియోగం, వ్యవసాయంలో సాంకేతికత విషయంలో ప్రపంచంలోనే ఇజ్రాయెల్ ముందంజంలో ఉందని మోదీ ప్రశంసించారు. ‘నీటి వనరుల వినియోగాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవటం, జలశుద్ధి, నీటి సంరక్షణ, వ్యవసాయంలో ఉత్పత్తి పెంచటం వంటి అంశాల్లో లోతైన ద్వైపాక్షిక సహకారానికి ఒప్పందం కుదిరింది’అని మోదీ వెల్లడించారు. వ్యవసాయ రంగంలో 2018నుంచి 2020 వరకు మూడేళ్ల కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. అణు గడియారాలు, చిన్న శాటిలైట్ల కోసం ఎలక్ట్రిక్ చోదక ఇంజన్లు, జియో–లియో ( ఎఉౖ– ఔఉౖ) ఆప్టికల్ లింక్‌పైనా సహకారానికి ఇరుదేశాల మధ్య ఒప్పందం కుదిరింది.
థ్యాంక్యూ నెతన్యాహు
భారత–ఇజ్రాయెల్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో చరిత్రాత్మక అధ్యాయాన్ని లిఖించటంలో కీలకంగా వ్యవహరించిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. రెండ్రోజులుగా ఇజ్రాయెల్ పర్యటన, వివిధ అంశాలపై చర్చలతోపాటు ద్వైపాక్షిక సంబంధాల్లో పెరిగిన విశ్వాసం, స్పష్టత వంటి అంశాలను బుధవారం నాటి భేటీలో నెతన్యాహుతో మోదీ పంచుకున్నారు. ఇరుదేశాల మధ్య శతాబ్దానికి పైగా ఉన్న బంధాలు, 25 ఏళ్లుగా నెలకొన్న దౌత్యపరమైన సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవటంలో ఈ పర్యటన ఎంతగానో ఉపకరించిందని మోదీ పేర్కొన్నారు. ఇరుదేశాల ప్రజల మధ్య సంబంధాలను పెంచేందుకు జెరేసలేంలో భారత సాంస్కృతిక కేంద్రం ఏర్పాటుచేయనున్నట్లు ఈ సందర్భంగా మోదీ ప్రకటించారు.
అధ్యక్షుడు రివ్లిన్‌తో మోదీ భేటీ
అంతకుముందు ఇజ్రాయెల్ అధ్యక్షుడు రువెన్ రివ్లిన్ను మోదీ కలిశారు. ఆయనతో జరిగిన ప్రత్యేకమైన భేటీలో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, మేకిన్ ఇండియా పథకాన్ని విజయవంతం చేయటంలో ఇజ్రాయెల్ అందిస్తున్న సాంకేతిక సహకారంపైనా చర్చించారు. ‘ఇది ఐ (ఇండియా) టు ఐ (ఇజ్రాయెల్) బంధం’అని ప్రధాని పేర్కొన్నారు. ‘అధ్యక్షుడు రివ్లిన్ భారత్‌లో పర్యటించినపుడు మేకిన్ ఇండియా గురించి మాట్లాడారు. ఇజ్రాయెల్‌లో నా పర్యటన మొదలైనప్పటినుంచీ చాలా మంది నోట్లో ఈ నినాదాన్ని విన్నాను. సంతోషంగా ఉంది’అని మోదీపేర్కొన్నారు.
రివ్లిన్ కూడా.. ప్రపంచంలోని గొప్ప నేతల్లో మోదీ ఒకరని ప్రశంసించారు. ‘ఇరుదేశాల మధ్య ఉమ్మడి ఆలోచనలున్నాయి. చాలా అంశాల్లో కలిసి పనిచేస్తున్నాం. మీ (భారత్) ఆలోచనలను మేం అర్థం చేసుకున్నాం. మేకిన్ ఇండియా కోసం చాలా చేస్తున్నాం. మరింత చేస్తాం కూడా. భారత్‌లో కలిసి చేసేందుకు కొన్ని ప్రాజెక్టులను మేం సూచించాం. ఇందుకు మీరు అంగీకరించటాన్ని అభినందిస్తున్నాం’అని రివ్లిన్ వెల్లడించారు. ఇరు దేశాల్లోని యూనివర్సిటీలు, పరిశ్రమల్లో పరస్పర సహకారానికి అవకాశం ఉందని భావిస్తున్నట్లు రివ్లిన్ తెలిపారు. సంయుక్త కార్యక్రమాల్లో పెట్టుబడులకు ఇజ్రాయెలీలు సిద్ధంగా ఉన్నారన్నారు. కాగా, ‘అధ్యక్షుడు రివ్లిన్ను మరోసారి కలవటం నా అదృష్టం. గతేడాది రివ్లిన్ భారతపర్యటనలోనూ ఇరుదేశాల సంబంధాలపై చర్చించాం. భారత్‌కు సహకారం అందించేందుకు సిద్ధమేనని ఆయన పునరుద్ఘాటించారు. ఇజ్రాయెల్‌లో ఆతిథ్యానికి చాలా సంతోషకరం’అని రాష్ట్రపతి నివాసం అతిథుల పుస్తకంలో మోదీ పేర్కొన్నారు.
రామానుజన్ ఓ ఉదాహరణ
యోగాసనాలపై ఆసక్తి, యోగసనాలతోనే రెండు ప్రజాస్వామ్య దేశాలకు అనుసంధానం విషయంలో మోదీ చొరవ స్ఫూర్తిదాయకమని నెతన్యాహు తెలిపారు. ‘యోగాపై మోదీ చూపుతున్న ఆసక్తి నాకు స్ఫూర్తి కలిగిస్తోంది. కొంచెం కొంచెంగా యోగా ప్రారంభించమని మోదీ సూచించారు. అలాగే కొనసాగిస్తున్నాను’అని ఆయన వెల్లడించారు. ప్రఖ్యాత గణితశాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్.. భారతీయుల మేధస్సుకు ఒక ఉదాహరణ అని ఆయన తెలిపారు. భారతీయులతో టాలెంట్‌లో భాగస్వామ్యం చేసుకోవటంలో ఇజ్రాయెల్ విశ్వసిస్తుందన్నారు. ‘భారతీయులంటే మాకు చాలా గౌరవం. ఇజ్రాయెల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పనిచేసే మా మామయ్య.. ఎప్పుడు చూసినా శ్రీనివాస రామానుజన్ గొప్పదనం గురించి చెబుతూ ఉండేవాడు. కొన్ని శతాబ్దాలుగా రామానుజన్‌ను మించిన మేథమెటీషియన్ ప్రపంచంలో ఎవరూ లేరు. ఇదే భారతీయుల మేధస్సుకు ఆయనో ఉదాహరణ మాత్రమే’అని మోదీతో సమావేశం అనంతరం విడుదల చేసిన ఓ ప్రకటనలో నెతన్యాహు పేర్కొన్నారు.