ఐటీ ఉద్యోగుల జీతాలు ఇంత దారుణమా?
సాధారణంగా ఐటీ రంగంలో పనిచేసే ఉద్యోగులకు (IT Employees) మంచి జీతాలు (Salary) ఉంటాయి. అయితే ఇక్కడ కూడా ఉన్నత స్థాయి అధికారులకు, ప్రారంభ స్థాయి ఉద్యోగులకు మధ్య వేతనాల పెంపు విషయంలో భారీ వ్యత్యాసాలు ఉన్నాయి. ‘మనీకంట్రోల్’ విశ్లేషించిన డేటా ప్రకారం.. గత ఐదేళ్లలో దేశంలోని ఐదు ప్రముఖ ఐటీ కంపెనీల్లోని టాప్ ఎగ్జిక్యూటివ్‌ల వేతనాలు 160% పెరిగాయి. కానీ ఫ్రెషర్ల (Freshers) జీతాలు పెరిగింది కేవలం 4 శాతమే.2024 ఆర్థిక సంవత్సరంలో సీఈవోల (CEO) సగటు వార్షిక వేతనం రూ. 84 కోట్లకు చేరువగా ఉండగా, ఫ్రెషర్స్ జీతాలు రూ. 3.6 లక్షల నుంచి రూ. 4 లక్షలకు పెరిగాయి. డేటాలో చేర్చిన కంపెనీల్లో టీసీఎస్ (TCS), ఇన్ఫోసిస్ (Infosys), హెచ్‌సీఎల్ టెక్ (HCLTech), విప్రో (Wipro), టెక్ మహీంద్ర (Tech Mahindra) ఉన్నాయి.ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌వో మోహన్‌దాస్ పాయ్‌తో సహా విమర్శకులు వేతన పెరుగుదలలో భారీ వ్యత్యాసంపై ఆందోళన వెలిబుచ్చారు. ఫ్రెషర్లకు తక్కువ జీతం ఇస్తున్నప్పుడు ఉన్నత స్థాయి అధికారులకు ఉదారంగా వేతన ప్యాకేజీలు ఇవ్వడాన్ని తప్పుపడుతున్నారు. పెరుగుతున్న అసమానతలు, ఆర్థిక వినియోగంపై దాని హానికరమైన ప్రభావాన్ని మోహన్‌దాస్ పాయ్ ఎత్తిచూపారు.ఈ ఐటీ కంపెనీల్లో సీఈవోలు, ఫ్రెషర్లు మధ్య వేతన వ్యత్యాసం తీవ్రంగా ఉంది. ఉదాహరణకు విప్రో నిష్పత్తి 1702:1 వద్ద ఉండగా, టీసీఎస్ నిష్పత్తి 192:1. ఐటీ పరిశ్రమలో పరిస్థితి ఇలా ఉంటే.. ఇంజనీరింగ్, తయారీ వంటి ఇతర రంగాలలో వేతన వృద్ధి మరింత దిగజారింది. 2019, 2023 మధ్య ఏటా వేతన వృద్ధి కేవలం 0.8% మాత్రమే.అధిక అట్రిషన్ రేట్లు, తక్కువ ఆన్-సైట్ అవకాశాలు వంటి సవాళ్లను ఐటీ (IT) రంగం ఎదుర్కొంటోంది. ఇది వేతన పరిహారాలపై ప్రభావం చూపుతోంది. సీఈవోల జీతాలు గ్లోబల్ బెంచ్‌మార్క్‌లకు అనుగుణంగా ఉన్నప్పటికీ, పెరుగుతున్న వ్యత్యాసం అసమానతలను మరింత పెంచుతోందని, పెరుగుతున్న జీవన వ్యయాలతో ఇబ్బందులు పడుతున్న మధ్యతరగతి ఉద్యోగులను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఫ్రెషర్ల జీతాలను కనీసం రూ. 5 లక్షలకు పెంచాలని, ఈ లాభదాయక సంస్థలకు ఇది సాధ్యమేనని విమర్శకులు పేర్కొంటున్నారు.