మంచుసంద్రంలో టేబుల్ వేసుకొని..
ఈయన పేరు లుడోవికో ఇనౌడీ. ఇటలీకి చెందిన ప్రముఖ సంగీత విధ్వాసుడు. మంచి పియానిస్ట్. ఆరు పదుల వయసు ఉంటుంది. సాధారణంగా ప్రదర్శన అంటే ఒక పెద్ద సమూహం ముందు ఇస్తారు. వారుకొట్టే చప్పట్ల వర్షంలో తడుస్తూ మరింత సంతోషంగా వాయిస్తుంటారు. కానీ, ఈయన మాత్రం అసలు మనుషులే ఉండని ఓ చోటును ఎంచుకున్నాడు. ఉడుకు రక్తంతో ఉన్న వాళ్లుసైతం గజగజలాడుతూ వణికిపోయే ప్రాంతాన్ని తన ప్రదర్శన ప్రాంతంగా సెలక్ట్ చేసుకున్నాడు. ఎముకలు కొరికేసే చలిలో కనీసం ఒక హెడ్ క్యాప్ కూడా ధరించకుండా ఎంతో నిర్మలంగా ప్రశాంతంగా వెళ్లి కూర్చున్నాడు.
అది ఎక్కడో కాదు ప్రపంచలోనే అత్యంత కఠిన చలికలిగినటువంటి ఆర్కిటిక్ సముద్రం మీద. గడ్డకట్టి ఉండే ఈ సముద్రంలో అక్కడక్కడా మంచుముక్కలు తేలియాడుతుండగా వాటి మధ్యలో ఒక పెద్ద టేబుల్ లాంటి దానిని ఏర్పాటుచేసుకొని దానిపై పీయానో పెట్టుకొని కరిగిపోతున్న ఆ మంచువైపు దీనంగా చూస్తూ ఆయన సంగీత ప్రదర్శన ఇచ్చారు. ఆ సమయంలో పెద్ద పెద్ద మంచుకొండల నుంచి ఐస్ ముక్కలు దబాల్లుమని సముద్రంలో పడుతున్నా ఆయన ఏమాత్రం భయపడకుండా ఆర్కిటిక్ సముద్రంలో తేలియాడుతూ మ్యూజిక్ ప్లే చేశారు.
ఈ సమయంలో ఆయన కూర్చున్న డయాస్ కూడా మంచుగడ్డలతోపాటే సముద్రంలో తేలియాడుతూ ఉంటే నిబ్బరంగా కూర్చొని ఆయన ఈ సాహసం చేశారు. అయితే, ఆయన ఇలా ఎందుకు చేశారని అనుకుంటున్నారా.. ఎందుకంటే గ్లోబల్ వార్మింగ్ క్రమంలో ఆర్కిటిక్ లోని మంచుమొత్తం కరిగిపోతున్న విషయం తెలిసిందే. ఇలాగే కొనసాగితే ఇక సహజ సిద్ధమైన ఆ మంచుమండలం అంతర్ధానం అవుతుంది. ఇది మానవజాతికి అంత మంచిది కాదు. ఈ నేపథ్యంలో ఆర్కిటిక్ను రక్షించుకోవడం మనందరి బాధ్యత అని చెప్పేందుకు ఆయన ఈ సాహసం చేశారు.