ITF features tournment
-
సాకేత్ శుభారంభం
సాక్షి, హైదరాబాద్ : అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ఫ్యూచర్స్–2 పురుషుల టోర్నీలో హైదరాబాద్ ప్లేయర్ సాకేత్ మైనేని శుభారంభం చేశాడు. కోల్‌కతాలో మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ఏడో సీడ్ సాకేత్ 5–7, 6–1, 7–5తో ఫ్రాన్సెస్కో విలార్డో (ఇటలీ)పై గెలుపొందాడు. డబుల్స్ విభాగంలో కాజా వినాయక్ శర్మ ముందంజ వేశాడు. తొలి రౌండ్లో వినాయక్–మోహిత్ మయూర్ జయప్రకాశ్ (భారత్) జంట 7–6 (7/3), 7–6 (9/7)తో రెండోసీడ్ జుయ్ చెన్ హంగ్ (చైనీస్ తైపీ)– ఫ్రాన్సెస్కో విలార్డో (ఇటలీ) జోడీకి షాక్ ఇచ్చింది. -
క్వార్టర్ ఫైనల్లో నిధి, రిషిక
ఐటీఎఫ్ ఫ్యూచర్స్ టోర్నీ చెన్నై: అంతర్జాతీయ టె న్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల ఫ్యూచర్స్ టెన్నిస్ టోర్నీలో సింగిల్స్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి నిధి చిలుముల క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించింది. ఇక్కడి మేయర్ రాధాకృష్ణన్ స్టేడియంలో జరుగుతున్న ఈ పోటీల్లో బుధవారం మెయిన్ డ్రా రెండో రౌండ్లో ఏడో సీడ్ నిధి 7-5, 4-6, 6-1తో మన రాష్ట్రానికే చెందిన యడ్లపల్లి ప్రాంజలపై విజయం సాధించింది. తొలి సెట్లో ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురైనప్పటికీ నిధి గెలుపు దక్కించుకుంది. అయితే రెండో సెట్లో ప్రాంజల దూకుడును కట్టడి చేయలేకపోవడంతో నిధి ఓటమి చవిచూసింది. కాసేపటికే కోలుకున్న నిధి తిరిగి మూడో సెట్లో తన సత్తా చాటింది. మరో వైపు స్నేహ పడమట 2-6, 1-6తో హిరోనో వతనబే (జపాన్) చేతిలో పరాజయం పాలైంది. మరో మ్యాచ్‌లో తెలుగు అమ్మాయి రిషిక సుంకర 6-7 (0/7), 6-4, 6-4తో శ్వేత శ్రీహరిపై నెగ్గి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. డబుల్స్ విభాగంలో చైనాకు చెందిన జియావో వాంగ్‌తో కలసి బరిలోకి దిగిన నిధి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. క్వార్టర్ఫైనల్లో నిధి-వాంగ్ జోడి 6-0, 6-2తో ప్రీతి (భారత్)-సాయ్కాయ్ (జపాన్)పై గెలుపొందింది. మరో మ్యాచ్‌లో రిషిక-శర్మద జోడి 6-1, 6-1తో నిత్యారాజ్-రోహీరా (భారత్) జోడిపై నెగ్గి సెమీస్‌లో అడుగుపెట్టింది. గురువారం జరగనున్న సెమీఫైనల్ మ్యాచ్‌లో నిధి జోడి, నటాషా-ప్రార్థన (భారత్) జోడితో తలపడనుంది. మరో మ్యాచ్‌లో నటాషా-ప్రార్థన ద్వయం 6-3, 6-2తో స్నేహ పడమట-వానియా జోడిపై గెలిచింది. -
క్వార్టర్స్‌లో నిధి జోడి
ఐటీఎఫ్ ఫ్యూచర్స్ టోర్నీ చెన్నై: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల ఫ్యూచర్స్ టోర్నీ డబుల్స్‌లో నిధి చిలుముల జోడి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. ఇక్కడి మేయర్ రాధాకృష్ణన్ స్టేడియంలో జరుగుతున్న ఈ పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నిధి, చైనాకు చెందిన జియావో వాంగ్‌తో కలిసి బరిలోకి దిగింది. ఈ నాలుగో సీడ్ జంట తొలి రౌండ్లో 6-2, 6-2 స్కోరుతో ఆంధ్రప్రదేశ్‌కే చెందిన యడ్లపల్లి ప్రాంజల- రియా భాటియా (భారత్)పై విజయం సాధించింది. మరో డబుల్స్ మ్యాచ్‌లో ఏపీకే చెందిన స్నేహ పడమట-వానియా దంగ్వాల్ (భారత్) జోడి 6-1, 6-3తో భవాని బాల కుమార్-రేష్మ గణపతి (భారత్) జంటను ఓడించి క్వార్టర్స్ ఫైనల్స్‌కు చేరుకుంది. సింగిల్స్ విభాగం తొలి రౌండ్లో మరో తెలుగమ్మాయి రిషిక సుంకర కూడా విజయాన్ని అందుకుంది. మూడో సీడ్ రిషిక 6-1, 6-2 స్కోరుతో ఆర్తి మునియన్పై గెలుపొంది రెండో రౌండ్లోకి ప్రవేశించింది. బుధవారం జరిగే సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్‌కే చెందిన నిధి, ప్రాంజల తలపడనున్నారు.