సొంత నిర్ణయం తీసుకోనివ్వండి..రాజన్
భువనేశ్వర్ : ఆర్బీఐ కు సొంత నిర్ణయాలను తీసుకొనే స్వేచ్ఛనివ్వాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ రఘురామ్ రాజన్ వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం కేంద్ర బ్యాంకుకు అందిస్తున్న పూర్తి స్వేచ్చ, మద్దతుపై సంతోషం వ్యక్తం చేస్తూనే, ఇకముందు సంస్థకు తన సొంత నిర్ణయాలు తీసుకునే అవకాశం కల్పించాలని కోరారు.
ఒడిశా రాష్ట్రంలో మూడు రోజుల పర్యటనలో ఉన్న రాజన్, మొదటిరోజు ఆర్బీఐ ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. మనది వ్యవసాయ ఆధారితమైన ఎకానమీ అనీ, భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.అందుకే వ్యవసాయ ఆధారిత చిన్న, మధ్యస్థ ప్రాజెక్టులపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దీంతోపాటు భారతీయ ఆర్థిక వ్యవస్థ ఇపుడు సరైన దారిలో నడుస్తోందనీ,ఈ క్రమంలో ప్రపంచంలో ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఉద్భవించనుందని వ్యాఖ్యానించారు. ఒడిషాలో ఖనిజ వనరులు విరివిగా ఉన్నాయని, పర్యాటకపరంగా అభివృద్ధి చేసి రాష్ట్ర ఆర్థిక పురోభివృద్దికి వినియోగించుకోవాలని రాజన్ సూచించారు. కోట్లాదిమంది భవిష్యత్తును నిర్దేశించే క్రమంలో ఆర్ బీఐ నిర్ణయం చాలా కీలకమైందని, ఏ చిన్న తప్పు దొర్లినా,దేశాన్ని ప్రజలను కష్టాల్లోకి నెడుతుందని ఉద్యోగులు అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఈ సమావేశానికి మీడియాను అనుమతించలేదు.
అనంతరం ఆయన కళింగ సోషల్ సైన్సెస్ సంస్థను (కెఐఎస్ఎస్)ను సందర్శించారు. పాఠశాల నిర్వహణ, దాని ఆర్థిక నమూనాకు సంబంధించి అక్కడి అధికారులతో చర్చించారు. తన పర్యటనలో భాగంగా ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, ప్రభుత్వ అధికారులను కలువనున్నారు. గ్లోబల్ ఎకానమీ ఆఫ్ ఇండియా అనే అంశంపై హరే కృష్ణ మెహతాబ్ లో మెమోరియల్ లెక్చర్ ఇవ్వనున్నారు.